జ‌బ‌ర్ధ‌స్త్‌లోకి తిరిగి రావాలంటూ ఫ్యాన్స్ డిమాండ్.. సౌమ్య‌రావు ఇలా స్పందించిందేంటి?

జ‌బ‌ర్ధ‌స్త్‌లోకి తిరిగి రావాలంటూ ఫ్యాన్స్ డిమాండ్.. సౌమ్య‌రావు ఇలా స్పందించిందేంటి?

బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్‌కి యాంక‌ర్స్ ఎంత వ‌న్నె తెస్తారో మ‌నం చూస్తూనే ఉన్నాం. మొద‌ట్లో యాంక‌ర్ అన‌సూయ‌, ర‌ష్మీలు త‌మ క్యూట్ మాట‌ల‌తోనే కాదు త‌మ అంద‌చందాల‌తోను కుర్రాళ్ల‌కి గిలిగింత‌లు పెట్టారు. అయితే అన‌సూయ కొన్ని కార‌ణాల వ‌ల‌న షో నుండి త‌ప్పుకోవ‌డంతో సౌమ్య‌రావు జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్‌గా సంద‌డి చేసింది. అంద‌రితో క‌లిసిపోతూ క్యూట్ మాట‌ల‌తో, నాజూకు అందంతో అద‌ర‌హో అనిపించింది. కొన్ని నెల‌ల పాటు తెగ ర‌చ్చ చేసిన సౌమ్య‌రావుకి ప్రేక్ష‌కులు బాగా క‌నెక్ట్ అయ్యారు. చాలా మంది ఆమెకు ఫ్యాన్స్ అయ్యారు. అయితే ఊహించ‌ని విధంగా సౌమ్య‌రావు ఇటీవ‌ల జ‌బ‌ర్ధ‌స్త్ నుండి త‌ప్పుకుంది.

సౌమ్య రావు స్థానంలో బిగ్‌ బాస్‌ బ్యూటీ సిరి హన్మంత్‌ యాంకర్‌గా వ్యవహరిస్తుండ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. సౌమ్య‌రావు షో నుండి త‌ప్పుకుందా లేదంటే ఆమెని త‌ప్పించారా అనే అనుమానం ఇప్పుడు అంద‌రిలో ఉంది. అయితే సౌమ్య షోలో క‌నిపించ‌న‌ప్ప‌టి నుండి సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్ ఆమెకి పోస్ట్ లు పెడుతున్నారు. తనని చాలా మిస్‌ అవుతున్నామని , మళ్లీ జబర్దస్త్ షోలోకి తిరిగి రావాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఎప్పుడు వస్తారంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. కొంద‌రైతే సౌమ్య‌రావు అందం, అభిన‌యాన్ని పొగుడుతూ మీరు వెళ్లిపోయాక ఆ షో చూడ‌ట‌మే మానేశామ‌ని అంటున్నారు.

దీనిపై స్పందించిన యాంకర్ సౌమ్య రావు..మీ ప్రేమ‌కి ధ‌న్య‌వాదాలు అంటూ కామెంట్ పెట్టింది. ఈ విష‌యంలో నేను చాలా అదృష్ట‌వంతురాలిన‌ని పేర్కొంది. మళ్లీ జబర్దస్త్ షోకి రావాలనే డిమాండ్‌కి రియాక్ట్ అవుతూ టైమ్‌ వచ్చినప్పుడు కచ్చితంగా వస్తా అంటూ త‌న పోస్ట్ ద్వారా తెలియ‌జేసింది సౌమ్య‌రావు. అయితే ఇటీవ‌ల కావాలనే సౌమ్య రావుని షో నుంచి తొలగించినట్టు ప్ర‌చారం జ‌ర‌గ‌గా, దీనిపై ఆమె రియాక్ట్ అయ్యింది. ఎందుకు జబర్దస్త్ ని వీడారని ఫ్యాన్స్ సోషల్‌ మీడియా వేదికగా అడగ్గా, టైమ్‌ వచ్చినప్పుడు అన్నీ చెబుతా అంటూ ఆమె తెలియ‌జేయ‌డం కొస‌మెరుపు. ఇప్పుడు ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో మాత్ర‌మే యాక్టివ్‌గా ఉంటూ సంద‌డి చేస్తుంది.