Congress Ticket Disputes | రోడ్డెక్కిన పంచాయితీలు: గందరగోళంగా కాంగ్రెస్‌ ‘మున్సిపల్’ టికెట్ల పంపకాలు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో టికెట్ వివాదాలు తీవ్రరూపం దాల్చాయి. సంగారెడ్డి, గద్వాల, జగిత్యాల జిల్లాల్లో వర్గపోరాటాలు, నిరసనలు, బీ-ఫారాల గందరగోళం పార్టీకి సవాలుగా మారాయి.

Reported by: ADHARVA | తెలంగాణ‌ | Feb 03, 2026, 11:52 pm IST
Read Time: 6 mins
Congress Ticket Disputes | రోడ్డెక్కిన పంచాయితీలు: గందరగోళంగా కాంగ్రెస్‌ ‘మున్సిపల్’ టికెట్ల పంపకాలు

Why Telangana Congress Is Fighting Itself Over Municipal Tickets

హైలైట్స్:

  • బీఫారాల వివాదాలు, బహిరంగ నిరసనలు, వీధి పోరాటాలు
  • న్నికలకు ముందే వేడెక్కిన కాంగ్రెస్​ రాజకీయాలు

విధాత తెలంగాణ డెస్క్​ | హైదరాబాద్​:

Congress Ticket Disputes | తెలంగాణలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. టికెట్ల పంపిణీ అంశం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తిని రెచ్చగొడుతూ, పలుచోట్ల బహిరంగ నిరసనలు, పరస్పర ఆరోపణలు, వర్గపోరాటాలకు కారణమవుతోంది.

శాసనసభ, పార్లమెంట్‌, గ్రామపంచాయతీ ఎన్నికల్లో కనిపించిన విభేదాలు ఈసారి మరింత ఉద్ధృతంగా మారాయి. టిపిసిసి స్క్రీనింగ్ కమిటీ సూచనల మేరకు బీ-ఫారాలు జారీ చేసిన తర్వాత పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ఇది పార్టీ ఎన్నికల వ్యూహానికే సవాలుగా మారుతోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

సంగారెడ్డి, గద్వాలలో బీఫారాల గందరగోళం

సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీలో నాలుగో వార్డు నుంచి నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నాయకురాలు నీలం శ్రీలత తీవ్ర నిరసనకు దిగారు. చివరి రోజు మరో మహిళకు బీ-ఫారం జారీ చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన ఆమె, పార్టీ నేతలు శ్రీకాంత్ రెడ్డి, వడ్ల కృష్ణ తనను మోసం చేశారని ఆరోపించారు. ఈ అన్యాయానికి నిరసనగా జిన్నారం మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవకుండా చూస్తానని హెచ్చరించారు.

అదేవిధంగా జోగులాంబ గద్వాల మున్సిపాలిటీలోనూ తీవ్ర అయోమయం నెలకొంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన అనుచరులకు బీ-ఫారాలు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. మరోవైపు మాజీ జడ్పీ చైర్‌పర్సన్ సరిత తిరుపతయ్య వర్గం కూడా తమకే టికెట్లు వచ్చాయని పేర్కొనడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళం పెరిగింది.

జగిత్యాల వర్గపోరాటం, తిరుగుబాటుదారులకు హెచ్చరిక

జగిత్యాల మున్సిపాలిటీలో సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు మరింత తీవ్రతరమైంది. 50 డివిజన్లలో 29 టికెట్లు ఎమ్మెల్యే వర్గానికి, 21 టికెట్లు జీవన్ రెడ్డి వర్గానికి కేటాయించడంతో అసంతృప్తి చెలరేగింది. జీవన్ రెడ్డి నివాసం వద్ద ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో చేరి పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ పరిణామం జిల్లా రాజకీయాల్లో కలకలం రేపింది.

మరోవైపు సంగారెడ్డిలో సీనియర్ నేత టి. జగ్గారెడ్డి తిరుగుబాటు అభ్యర్థులకు కఠిన హెచ్చరిక జారీ చేశారు. పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా పోటీలో కొనసాగితే సస్పెన్షన్ తప్పదని స్పష్టం చేశారు.

నాయకుల విభేదాలు శాపంగా మారిన వైనం

టికెట్ల పంపిణీలో పారదర్శకత లేకపోవడం, వర్గాల ఆధిపత్య పోరు, స్థానిక నేతల మధ్య సయోధ్య లేకపోవడం —ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలహీనతలను బయటపెడుతున్నాయి. పార్టీ కేంద్ర నాయకత్వం సకాలంలో జోక్యం చేసుకుని సమన్వయం సాధించకపోతే, ఈ అంతర్గత వివాదాలు ఎన్నికల ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని కాంగ్రెస్​ సీనియర్​ నేతలు అభిప్రాయపడుతున్నారు.

మున్సిపల్ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎదుర్కొంటున్న ఈ అంతర్గత కలహాలు పార్టీకి కీలక పరీక్షగా మారాయి. వర్గపోరాటాలను అదుపు చేసి ఐక్యత సాధిస్తేనే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.