పార్లమెంటుపై దాడి ఘటనపై ఎంపీలు ఏం చెప్పారంటే..
పార్లమెంటులో పొగ వదిలిన వ్యక్తుల్లో ఒకరి వద్ద లక్నో చిరునామాతో ఆధార్ కార్డును పోలీసులు కనుగొన్నారు.

న్యూఢిల్లీ : పార్లమెంటులో ఇద్దరు వ్యక్తులు అక్రమంగా చొరబడి.. హానికారకం కాని గ్యాస్ ప్రయోగించిన ఉదంతం దేశంలో సంచలనం సృష్టించింది. వారిద్దరినీ ఎంపీలు, పార్లమెంటు సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారు ఎవరు అన్న విషయం స్పష్టంగా ఇంకా తెలియరాలేదు. వారిద్దరినీ పోలీసులు విచారిస్తున్నారు. అయితే.. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న కొందరు ఎంపీలు ఘటన జరిగిన తీరును వివరించారు. ఆగంతకులను పట్టుకున్నవారిలో బీఎస్పీ ఎంపీ రామ్ శిరోమణి వర్మ కూడా ఒకరు.
పట్టుబడినవారిలో ఒకరి వద్ద లక్నో అడ్రస్‌తో ఉన్న ఆధార్ కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆయన తెలిపారు. ఘటన జరిగిన తీరును ఆయన వివరిస్తూ.. ఆ సమయంలో పార్లమెంటు మొత్తం పొగతో నిండిపోయిందని చెప్పారు. ఒక వ్యక్తి చేతిలో ఇమిడిపోయే క్యాన్‌తో పసుపు పచ్చని పొగను సభలో వదిలాడని తెలిపారు. ‘ఎంపీలు అతడిని పట్టుకుని చితకబాది భద్రతాసిబ్బందికి అప్పగించారు’ అని ఆయన వివరించారు. పొగను వదిలిన క్యానిస్టర్, ఒక పేపర్‌ను షూస్‌లో దాచుకుని వచ్చాడని తెలిపారు. అతడిని తొలుత పట్టుకున్నవారిలో తానూ ఒకడినని ఎంపీ హనుమాన్ బేనివాల్ చెప్పారు.
‘మేం అతడిని పట్టుకోగానే షూస్‌లోనుంచి ఏదో తీసి, పొగను వదిలాడు. ఆ వెంటనే రెండో వ్యక్తి కూడా పట్టుబడ్డారు’ అని తెలిపారు. పట్టుబడివారి నుంచి కొంత మెటీరియల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. ‘సమగ్ర విచారణకు ఆదేశించాం. ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు తగిన ఆదేశాలు ఇచ్చాం. ప్రాథమిక దర్యాప్తులో అది కేవలం పొగ మాత్రమేనని, అదేమీ ప్రమాదకరమైనది కాదని వెల్లడైంది’ అని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ గుర్జీత్‌సింగ్ అజ్లా ఈ ఘటన గురించి వివరిస్తూ.. ‘అతడిని పట్టుకుని, పసుపు రంగు పొగను వెదజల్లుతున్న క్యాన్‌ను గుంజుకుని, బయటపడేశాను. ఇదొక తీవ్రమైన భద్రతా ఉల్లంఘన’ అన్నారు.