Telangana Electricity Job Notification 2025 | గుడ్ న్యూస్..తెలంగాణ విద్యుత్ సంస్థలలో 3వేల ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు

తెలంగాణ విద్యుత్ సంస్థల్లో 3వేల ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు.. ట్రాన్స్ కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లో ఉమ్మడి నోటిఫికేషన్ రాబోతోంది.

Telangana Electricity Job Notification 2025 | గుడ్ న్యూస్..తెలంగాణ విద్యుత్ సంస్థలలో 3వేల ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు

విధాత, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ శాఖలో 3వేల ఉద్యోగాల నోటిఫికేషన్ జారీకి సిద్దమవుతుంది. ట్రాన్స్ కో, జెన్కో, ఎస్పీడీసీఎల్,ఎన్పీడీసీఎల్ లోని 3,000 పోస్టుల భర్తీకి ఉమ్మడి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయడానికి ఏర్పాట్లు చేయాలని విద్యుత్తు సంస్థల యాజమాన్యాలను ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటిదాకా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌తో సంబంధం లేకుండా ఈ సంస్థలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీచేసి సొంతంగా ఉద్యోగాలను భర్తీ చేసుకునే విధానం కొనసాగుతోంది. వేర్వేరు నియామక పరీక్షలు నిర్వహించడం వల్ల అభ్యర్థులు అన్ని పరీక్షలు రాస్తున్నారు. కొందరికి రెండు, మూడు సంస్థల్లో ఉద్యోగాలు వస్తుండగా ఏదో ఒక్కదానిలో చేరుతున్నారు. దీంతో మిగతావి ఖాళీగా మిగులుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దఫా వేర్వేరు ఉద్యోగ నోటిఫికేషన్లు కాకుండా విద్యార్థుల ప్రయోజనం కోసం ఉమ్మడి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించింది.

ఇప్పటివరకు తెలంగాణ ట్రాన్స్ కోలో 122 పోస్టులు, జెన్కోలో 283, ఎస్పీడీసీఎల్ లో 135, ఎన్పీడీసీఎల్ లో 394 పోస్టులు..మొత్తం 934పోస్టులు ఖాళీ ఉన్నట్లుగా గుర్తించారు. వీటితో పాటు యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్ర నిర్మాణం చివరిదశకు చేరుకోవడం.. రామగుండంలో థర్మల్, ఇతర ప్రాంతాల్లో సౌర విద్యుత్కేంద్రాల నిర్మాణ ప్రతిపాదనలు ఉండటంతో భారీగా కొత్త పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది. గతంలో ఇచ్చిన పదోన్నతులను సవరించి అందరికీ సమన్యాయం చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు అమలు చేస్తే కిందిస్థాయిలో మరిన్ని పోస్టులు ఖాళీ అవుతాయి. అన్నీ కలిపితే మొత్తంగా రాష్ట్రంలోని విద్యుత్‌ సంస్థల పరిధిలో దాదాపు 3 వేల పోస్టులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.