Bajaj Auto | ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో కీలక నిర్ణయం తీసుకుంది. 350 సీసీ విభాగంలోకి అడుగుపెట్టాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే సక్సెస్ అయిన 400 సీసీ బైక్‌ల ఉత్పత్తిని నిలిపివేసి, వాటి స్థానంలో Pulsar NS350z, Dominar 350 మోడళ్లను భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తోంది. ఈ రెండు బైక్‌లు కూడా వచ్చే నెల మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
400 సీసీలకు ఎందుకు గుడ్‌బై
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ మార్పుల కారణంగా 350 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం గల బైక్‌ల ధరలు భారీగా పెరిగాయి. 350 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ ఉన్న బైక్‌లపై సుమారు 40 శాతం వరకు పన్ను ఉండగా.. 350 సీసీ లోపు బైక్‌లకు కేవలం 18 శాతం మాత్రమే పన్ను ఉంది. దీంతో పెద్ద ఇంజిన్ బైక్‌ల ధరలు పెరిగి, వినియోగదారులకు భారంగా మారాయి. ఈ క్రమంలోఇప్పటివరకు మార్కెట్‌లో ఉన్న Bajaj Pulsar NS400Z మరియు Bajaj Dominar 400 మోడళ్లను కంపెనీ నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ బైకుల ఉత్పత్తి నిలిపివేసినట్లు సమాచారం. అయితే అందుబాటులో ఉన్న స్టాక్‌కు మాత్రం బుకింగ్స్ ఓపెన్‌గా ఉన్నాయి.
పాత ఇంజిన్‌లోనే మార్పులు
జీఎస్టీ మార్పుల కారణంగా ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బజాజ్ ఆటో తన 400 సీసీ మోడళ్ల ఇంజిన్ సామర్థ్యాన్ని తగ్గించి 350 సీసీ కేటగిరీల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. దీంతో పాత ఇంజిన్‌లోనే పలు మార్పులు చేసి దీన్ని తీసుకొస్తోంది. బోర్‌ను తగ్గించి, స్ట్రోక్‌ను అలాగే ఉంచింది.. దీంతో పవర్, టార్క్ కొంత తగ్గే అవకాశం ఉంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి కాంపిటీషన్!
ధర విషయానికి వస్తే ప్రస్తుతం Dominar 400 సుమారు రూ.2.40 లక్షలు ఉండగా.. Pulsar NS400Z రూ.1.94 లక్షల్లో లభిస్తోంది. కొత్తగా రాబోయే 350 సీసీ మోడల్ బైక్‌లు మరింత తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. Dominar 350 ధర సుమారు రూ.2లక్షల వరకు, Pulsar NS350Z ధర రూ.1.50 లక్షలలోపు ఉండొచ్చని ఆటో మొబైల్ నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే.. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌కు గట్టి పోటీ ఇవ్వనుందని అభిప్రాయపడుతున్నారు.
Read More:
రాయల్ ఎన్‌ఫీల్డ్ సరికొత్త గెరిల్లా 450 బైక్ లాంచ్.. Apex వేరియంట్‌తో స్పోర్టీ స్టైల్!
శాంసంగ్ ఫోన్ కంటే తక్కువ ధరలో రాయల్ ఎన్‌ఫీల్డ్.. యూత్ నుంచి యమ క్రేజ్!
