Credit Score : క్రెడిట్ స్కోర్ ను ఎలా లెక్కిస్తారు?
లోన్లు సులభంగా రావాలంటే క్రెడిట్ స్కోర్ కీలకం. EMI చెల్లింపులు, రుణ వినియోగం, క్రెడిట్ కార్డు వాడకం ఆధారంగా స్కోర్ లెక్కిస్తారు.

ప్రైవేట్ ప్రభుత్వ బ్యాంకుల్లో అప్పులు సులభంగా మంజూరు కావాలంటే మంచి మీ క్రెడిట్ స్కోర్ (సిబిల్ స్కోర్) ఉండాలి. ఈ స్కోర్ ఆధారంగానే వడ్డీ రేటును కూడా తగ్గిస్తారు. క్రెడిట్ హిస్టరీ సరిగా లేకపోతే రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావు. ఆర్ధికంగా ఎంత క్రమశిక్షణగా ఉన్నారో క్రెడిట్ హిస్టరీ తెలుపుతుంది. అందుకే క్రెడిట్ హిస్టరీ దెబ్బతినకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడతారు. అయితే క్రెడిట్ స్కోర్ ను ఎలా లెక్కిస్తారనేది కూడా ముఖ్యమే. క్రెడిట్ స్కోర్ పెంచుకొంటే రుణాలు సులభంగా వస్తాయి.
క్రెడిట్ స్కోర్ ను ఎలా లెక్కిస్తారు?
ఒక వ్యక్తి ఆర్ధిక స్థితిగతులు, ఆర్ధిక క్రమశిక్షణను క్రెడిట్ హిస్టరీ చెబుతోంది. ఏదైనా లోన్ తీసుకొనే వాళ్లు తమ క్రెడిట్ హిస్టరీని కాపాడుకొనేందుకు చాలా కష్టాలు పడుతుంటారు. లోన్లు మంజూరు కావాలంటే క్రెడిట్ స్కోర్ బాగుండాలి. కనీసం 750 పాయింట్లు ఉంటే క్రెడిట్ స్కోర్ బాగున్నట్టు లెక్క. క్రెడిట్ స్కోర్ 300 నుంచి 900 పాయింట్లుగా లెక్కగడుతారు. 750 పాయింట్లు దాటితే బ్యాంకర్లు కళ్లుమూసుకొని లోన్లు ఇస్తారు. అలాంటి వినియోగదారుడి కోసం బ్యాంకర్లు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. క్రెడిట్ స్కోర్ ను ఎలా లెక్కిస్తారోచూద్దాం.
మీరు తీసుకున్న లోన్ల ఈఎంఐల చెల్లింపు ఎలా ఉంది, సక్రమంగా చెల్లిస్తున్నారా, లేదా ఆలస్యమైందా… ఎన్నిసార్లు ఇలా ఆలస్యమైంది. లోన్లు చెల్లించలేక డిఫాల్ట్ చేశారా ఇలాంటివన్నీపరిగణనలోకి తీసుకుని పాయింట్లు ఇస్తారు. ఆలస్యంగా ఈఎంఐలను చెల్లిస్తే మీ క్రెడిట్ హిస్టరీపై 30 నుంచి 35 శాతం నెగిటివ్ ప్రభావం ఉంటుంది. అంటే క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది.
ఇక మీరు తీసుకున్న రుణాల్లో సెక్యూర్డు రుణాలు, అన్ సెక్యూర్డు రుణాల మధ్య సమతుల్యత ఉందా లేదా అనే విషయం క్రెడిట్ స్కోర్ పై ప్రభావం ఉంటుంది. లోన్ల కోసం పదే పదే సెర్చ్ చేసినా… లేదా ధరఖాస్తు చేసినా కూడా క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంది. అంతేకాదు క్రెడిట్ కార్డు కోసం ధరఖాస్తు చేసినా కూడా క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది.
అప్పులు ఎక్కువైతే క్రెడిట్ స్కోర్ పై ప్రభావం
క్రెడిట్ కార్డులకు సంబంధించి పలు రకాల బ్యాంకులు ఆఫర్లు ఇస్తున్నాయి. అవసరం ఉన్నా లేకున్నా క్రెడిట్ కార్డులను తీసుకోవడానికి ఎక్కువమంది ఆసక్తి చూపుతారు. క్రెడిట్ కార్డు జేబులో ఉందని ఇష్టారీతిలో దాన్ని వాడితే క్రెడిట్ స్కోర్ తగ్గిపోతోంది. క్రెడిట్ కార్డు లిమిట్ లో 30 శాతం వరకే వాడాలి. అంటే రూ. 1 లక్ష క్రెడిట్ కార్డు లిమిట్ ఉంటే రూ. 30 వేల వరకే వాడాలి. అంతకంటే ఎక్కువ వాడితే దాని ప్రభావం క్రెడిట్ స్కోర పై పడుతుంది. మీకున్న రుణ పరిమితిలో మీరు ఎంత వాడుకున్నారో తెలిపేదే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో. దీన్ని సీయుఆర్ అని కూడా పిలుస్తారు. క్రెడిట్ స్కోర్ లో సీయుఆర్ ప్రభావం కనీసం 25 శాతంగా ఉండే అవకాశం ఉంది. మీరు ఎవరికైనా జామీను లేదా పూచీకత్తు ఇస్తే వారు లోన్లు తీర్చకపోతే దాని ప్రభావం మీ క్రెడిట్ స్కోర్ పై పడుతోంది.