Axis Bank వినియోగదారులకు అలర్ట్.. OTP మోసాలకు ఇక చెక్

Axis Bank వినియోగదారులకు అలర్ట్.. OTP మోసాలకు ఇక చెక్

ముంబై: భారతదేశంలో ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్, వినియోగదారుల భద్రతను మెరుగుపరచడానికి, OTP సంబంధిత మోసాల నుంచి కస్టమర్లను కాపాడేందుకు కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ‘ఓపెన్’ యాప్‌లో తొలిసారిగా ‘ఇన్-యాప్ మొబైల్ OTP’ సౌలభ్యాన్ని ప్రారంభించింది. ఈ సరికొత్త సౌలభ్యం SMS ద్వారా OTP పంపే బదులు, నేరుగా సమయ ఆధారిత పాస్‌వర్డ్‌లను (TOTP) సృష్టిస్తూ టెలికాం నెట్‌వర్క్‌లపై ఆధారపడే అవసరాన్ని తొలగిస్తుంది. ఇది వేగవంతమైన, అత్యంత సురక్షిత ప్రామాణీకరణను అందిస్తూ మోసాల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

సైబర్ బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో, ముఖ్యంగా SMS ఆధారిత OTPలను లక్ష్యంగా చేసిన సిమ్ స్వాప్, ఫిషింగ్ దాడుల సందర్భంలో, యాక్సిస్ బ్యాంక్ ‘ఇన్-యాప్ మొబైల్ OTP’ సదుపాయం మోసాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వినియోగదారులు ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో ప్రవేశించడానికి, లావాదేవీలను ధృవీకరించడానికి ఈ సౌలభ్యాన్ని వినియోగించుకోవచ్చు. ఇంటర్నెట్ ద్వారా పనిచేస్తూ, ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా నావికులు, తరచూ అంతర్జాతీయ ప్రయాణం చేసేవారు, NRIలకు ఇది ఉపయోగపడుతుంది. అంతేకాక, కస్టమర్లు రియల్ టైం లాగిన్, లావాదేవీ ప్రయత్నాల నోటిఫికేషన్లను పొందుతూ, పారదర్శకతను, ఖాతా కార్యకలాపాలపై నియంత్రణను పెంచుకోవచ్చు. యాక్సిస్ బ్యాంక్ ప్రెసిడెంట్ & హెడ్ సమీర్ శెట్టి మాట్లాడుతూ.. “కస్టమర్లు మోసపోకుండా ఉండేందుకు కృషి చేస్తున్నాం. వారి భద్రతే మా ప్రధాన లక్ష్యం. కస్టమర్లకు సురక్షిత, నమ్మకమైన డిజిటల్ బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడంలో తాజా పరిణామం కీలకమైనది” అని అన్నారు.