ఐఐటీ హైదరాబాద్, గ్రాన్యూల్స్ ఇండియా మధ్య కీలక ఒప్పందం
పారిశ్రామిక ఆటోమేషన్‌లో అత్యాధునిక పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఐఐటీ హైదరాబాద్, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ జతకట్టాయి. ప్రాసెస్ ఆటోమేషన్‌లో డా. కృష్ణప్రసాద్ చిగురుపాటి చైర్ ప్రొఫెసర్‌షిప్ ఏర్పాటు కోసం ఈ రెండు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి

విధాత, హైదరాబాద్: పారిశ్రామిక ఆటోమేషన్‌లో అత్యాధునిక పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఐఐటీ హైదరాబాద్, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ జతకట్టాయి. ప్రాసెస్ ఆటోమేషన్‌లో డా. కృష్ణప్రసాద్ చిగురుపాటి చైర్ ప్రొఫెసర్‌షిప్ ఏర్పాటు కోసం ఈ రెండు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందంపై ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి, గ్రాన్యూల్స్ ఇండియా ఛైర్మన్ డా. కృష్ణప్రసాద్ సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా డా. కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్యం ద్వారా ఐఐటీహెచ్ ప్రొఫెసర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలోనూ, విద్యా నైపుణ్యాలను పెంచుకోవడంలోనూ సహాయపడుతుందన్నారు. ఈ చొరవ భవిష్యత్ తరాలకు ఉపకరిస్తుందని, ఆవిష్కరణలు, స్థిరత్వం, సామర్థ్యం, పారిశ్రామిక పరివర్తనకు అవసరమైన ప్రాసెస్ ఆటోమేషన్‌లో పరిశోధనలకు ఇది ఒక ప్రోత్సాహంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్‌తో ఈ ఒప్పందం తమకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తమ లక్ష్యం మార్పులు తీసుకురాగల పరిశోధనలకు కేంద్రంగా మారడమేనని ఆయన తెలిపారు. ఈ ఒప్పందం విద్యా రంగం, పరిశ్రమల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన రంగాల్లో కొత్త ఆవిష్కరణలకు ఊతం ఇస్తుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రాన్యూల్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమా చిగురుపాటి, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పీవీ శ్రీనివాస్, ఫైనాన్షియల్ ఆఫీసర్ ముఖేష్ సురానా, అలాగే ఐఐటీహెచ్ ప్రొఫెసర్లు కూడా పాల్గొన్నారు.