Nirmala Sitharaman : రేపే బడ్జెట్‌.. మరో రికార్డు క్రియేట్‌ చేయబోతున్న నిర్మలమ్మ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. చిదంబరం రికార్డును సమం చేయనున్నారు.

Nirmala Sitharaman : రేపే బడ్జెట్‌.. మరో రికార్డు క్రియేట్‌ చేయబోతున్న నిర్మలమ్మ

Nirmala Sitharaman | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) రికార్డుల మీద రికార్డులను సృష్టిస్తున్నారు. కేంద్ర మంత్రివర్గంలో వరుసగా మూడోసారి చోటు దక్కించుకున్న ఏకైక మహిళా నాయకురాలిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఇప్పటికే ఎనిమిది సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగానూ గుర్తింపు పొందారు. ఇప్పుడు మరో సరికొత్త రికార్డు సృష్టించేందుకు సిద్ధమయ్యారు నిర్మలమ్మ.

వరుసగా తొమ్మిదోసారి..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని (2026-27)కి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను రేపు నిర్మలమ్మ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. వరుసగా తొమ్మిదో సారి కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. తద్వారా వరుసగా తొమ్మిది సార్లు (9th Consecutive Budget) పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పనున్నారు. నిర్మలమ్మ ఇప్పటికే ఒక తాత్కాలిక బడ్జెట్‌, ఎనిమిది పూర్తిస్థాయి బడ్జెట్‌లు సమర్పించిన విషయం తెలిసిందే.

2019లో నరేంద్రమోదీ సారధ్యంలో రెండో దఫా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకూ వరుసగా ఐదు పూర్తి స్థాయి బడ్జెట్లను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక బడ్జెట్ పార్లమెంటుకు సమర్పించారు. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల అనంతరం 2024-25కి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా ఏడో సారి బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించారు. ఆ తర్వాత 2025-26 ఏడాదికిగానూ ఎనిమిదోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఇప్పుడు తొమ్మిదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు.

చిదంబరం రికార్డును సమం చేయనున్న నిర్మలమ్మ

ఈసారి బడ్జెట్‌తో మాజీ కేంద్ర మంత్రి చిదంబరం రికార్డును నిర్మలమ్మ సమం చేయనున్నారు. వేర్వేరు సమయాల్లో మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం తొమ్మిది బడ్జెట్‌లను పార్లమెంట్‌కు సమర్పించారు. తొలిసారి 1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ హయాంలో బడ్జెట్‌ సమర్పించారు. హెచ్‌డీ దేవెగౌడ ప్రధానిగా ఉండగా 1996 మార్చి 19న తొలి బడ్జెట్‌ పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు. ఆ తర్వాత 1997లో రెండోసారి, కాంగ్రెస్‌ సర్కార్‌ అధికారంలో ఉన్నప్పుడు 2004-08 మధ్య 5సార్లు బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కొంత కాలం హోంమంత్రిగా పని చేసిన చిదంబరం.. తిరిగి 2013, 2014 సంవత్సరాల్లో 2సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

మోరార్జీ దేశాయ్‌ రికార్డుకు చేరువలో..

అంతేకాదు, నిర్మలమ్మ మరో రెండుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెడితే మాజీ ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్‌ రికార్డును అధిగమించనున్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి ప్రధాన మంత్రులుగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేసిన మొరార్జీ దేశాయ్‌ అత్యధికంగా 10సార్లు బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. మొరార్జీ దేశాయ్‌ 1959-1964 మధ్య ఆరు, 1967-1969 మధ్య నాలుగు బడ్జెట్‌లు సమర్పించారు.

బడ్జెట్‌ ప్రసంగంలోనూ రికార్డే..

ఎక్కువసార్లు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగానే కాదు, అత్యధిక సమయం బడ్జెట్‌ ప్రసంగం చేసిన మంత్రిగా నిర్మలమ్మకు రికార్డు ఉంది. ఆమె బడ్జెట్‌ ప్రసంగాల్లో 2020లో చేసిన బడ్జెట్‌ ప్రసంగం అత్యంత సుదీర్ఘమైనది. అప్పుడు ఆమె ఏకంగా 2 గంటల 40 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేసి రికార్డు సృష్టించారు. బడ్జెట్‌ చరిత్రలో ఇదే ఇప్పటి వరకూ సుదీర్ఘ ప్రసంగంగా కొనసాగుతోంది. ఆ బడ్జెట్‌లోని కీలక ప్రకటనల్లో కొత్త ఆదాయపు పన్ను స్లాబులు, ఎల్‌ఐసీఐపీవో, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, ఉద్యోగాలపై ఆమె సుదీర్ఘ ప్రసంగం చేశారు. బడ్జెట్‌ను తొలిసారి ప్రవేశపెట్టిన 2019లో ఆమె ప్రసంగం 2 గంటల 17 నిమిషాల పాటు సాగింది. ఇది రెండో అతిపెద్ద బడ్జెట్‌ ప్రసంగం.

ఏకైక మహిళా నాయకురాలిగా నిర్మలా సీతారామన్

మోదీ తొలి విడత మంత్రి వర్గంలో (2014) పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్‌ బాధ్యతలు చేపట్టారు. 2017లో కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత 2019లో రెండోసారి ప్రధాని మోదీ ఎన్నికైన తర్వాత ఏర్పాటైన కేంద్ర మంత్రి వర్గంలోనూ చోటు దక్కించుకున్న నిర్మలా సీతారామన్‌కు అత్యంత కీలకమైన ఆర్థికశాఖను అప్పగించారు నరేంద్రమోదీ. నాటి నుంచి దేశీయ ఆర్థిక రంగంలో మలి విడుత ఆర్థిక సంస్కరణలను పరుగులెత్తించారు. కేంద్ర మంత్రివర్గంలో మూడోసారి వరుసగా చోటు దక్కించుకున్న ఏకైక మహిళా నాయకురాలిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పారు.

ఇవి కూడా చదవండి :

PRC delay Telangana | పీఆర్సీకోసం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఎదురుచూపులు
Bill Gates : బిల్‌గేట్స్‌కు సెక్సువల్‌ డిసీజ్‌.. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో వెలుగులోకి సంచ‌ల‌న విష‌యాలు