PRC delay Telangana | రెండేళ్లయినా తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు అతీగతీ లేని పీఆర్సీ..
అధికారంలోకి వచ్చిన ఆరు నెల్లలో కొత్త పీఆర్సీ అంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రెండు సంవత్సరాలు దాటుతున్నా పట్టించుకోకుండా తాత్సారం చేస్తున్నదని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.
- బీఆర్ఎస్ హయాంలో కమిషన్.. నాన్చుతున్న కాంగ్రెస్
- ఆరు నెలల్లో ఇస్తామన్న హామీ ఏమైంది?
- ముఖ్యమంత్రి ఒప్పుకుంటేనే నివేదిక ఇస్తారా?
- రగిలిపోతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు
విధాత, హైదరాబాద్ :
PRC delay Telangana | కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డు ఉద్యోగుల వేతనాల పెంపునకు సంబంధించి పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) నివేదిక సమర్పించడంలో అంతులేని ఆలస్యంపై ప్రభుత్వోద్యోగులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే తప్ప పీఆర్సీ కమిటీ నివేదిక సమర్పించే పరిస్థితి లేదనే వాదనలు ఉద్యోగుల మధ్య చర్చల్లో వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో కొత్త పీఆర్సీ ప్రకటిస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీ… పత్తా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పే రివిజన్ కమిషన్‌ను నియమించారు. అయితే.. ఎన్నికల్లోపు కమిషన్ తన నివేదికను సిద్ధం చేయలేదు. దీంతో తదుపరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై పీఆర్సీ నివేదికను సిద్ధం చేయించి, అమలు చేయాల్సిన బాధ్యత పడింది. నిజానికి తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కొత్త పీఆర్సీ కమిషన్‌ను నియమిస్తామని పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ కూడా ఇచ్చారు. కానీ.. రెండున్నరేళ్లు దాటుతున్నా పీఆర్సీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంతులేని తాత్సారం చేస్తున్నదని ఉద్యగులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
నిజానికి పీఆర్సీని 2013 జూలై నెలలో అమలు చేయాల్సి ఉండగా.. ఇప్పటికీ నివేదిక సిద్ధం కాలేదని అంటున్నారు. పెరుగుతున్న ధరలు, జీవన వ్యాయాన్ని పరిగణనలోకి తీసుకుని వెంటనే పీఆర్సీ నివేదికను సిద్ధం చేసి సమర్పించేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.
పీఆర్సీ కమిటీని కొనసాగించడం ద్వారా ప్రభుత్వానికి ప్రతినెలా లక్షల రూపాయల దుబారా తప్పితే మరో ప్రయోజనం లేదంటున్నారు.
కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో కొలువు తీరిన సమయంలో పీఆర్సీ నివేదిక ప్రకారం వేతనాలు పెరుగుతాయని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సంబురపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా ఆరు నెలల్లో అమలు చేస్తారని ఎదురుచూసిన వారికి మొండి చెయ్యే మిగిలింది. వారి ఆశలను పీఆర్సీ కమిటీ అడియాసలు చేసింది. ఇప్పటి వరకు పీఆర్సీ కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించలేదు. నివేదిక సమర్పించడానికి రెండు సంవత్సరాల గడువు అవసరమా? అని ఉద్యోగులు, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.
మాజీ ఐఏఎస్ అధికారి శివశంకర్ అధ్యక్షతన 2023 అక్టోబర్ 2వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో పే రివిజన్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యుడిగా మాజీ ఐఏఎస్ బీ రామయ్య ఉన్నారు. ఏప్రిల్ 2వ తేదీన 2024 న నివేదిక సమర్పించాలని గడువు నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి చొప్పున మూడుసార్లు గడువు పొడిగించుకుంటూ వస్తున్నారు. తాజా గడువు కూడా వచ్చే నెలతో ముగియనున్నది. ఆ తరువాత కూడా మరో ఆరు నెలలు పొడిగించే సూచనలు ఉన్నాయన్న వార్తలు.. ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో ఆగ్రహాగ్నిని రాజేస్తున్నాయి. శివశంకర్ కమిషన్ తన నివేదికను సిద్ధం చేసిందని, ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా నివేదికను స్వీకరించేందుకు కాలయాపన చేస్తున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు 51 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా, ప్రభుత్వం మాత్రం 30 శాతానికి పరిమితం చేయాలనే ఉద్దేంతో ఉన్నట్లు కన్పిస్తున్నది. ఉద్యోగుల డిమాండ్ ప్రకారం 51 శాతం ఫిట్‌మెంట్ అమలుచేస్తే రాష్ట్ర ఖజానాపై వార్షికంగా సుమారు రూ.12,750 కోట్ల భారం పడుతుందని ఆర్థిక శాఖలోని సీనియర్ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం అనుకున్నట్లుగా 30 శాతం ఫిట్‌మెంట్ అమలు చేస్తే వార్షికంగా రూ.7,500 కోట్ల వరకు భారం ఉండనున్నది.
ఇప్పటికే రాష్ట్రంలో ఉచిత పథకాలు ఇబ్బడిముబ్బడిగా అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం కంటే.. ఖర్చు అధికంగా మారింది. తీసుకువచ్చిన అప్పులు సైతం హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. వెరసి.. ఆర్థిక నిర్వహణ కడు దయనీయంగా మారింది. ఈ సంగతిని పక్కనపెడితే.. ముఖ్యమంత్రి నుంచి గ్రీన్‌సిగ్నల్ రాకపోవడంతోనే పీఆర్సీ కమిషన్ నివేదిక సమర్పణకు బ్రేక్ పడిందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఇందులో ఫిట్‌మెంట్ ఎంత అనేదే కీలక అంశంగా చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దలు సూచించిన విధంగా ఎంత శాతం అనే అంకె చేర్చడమే మిగిలి ఉందని, మొత్తం పని పూర్తయిందని తెలుస్తున్నది.
42 శాతం ఫిట్‌మెంట్ వెంటనే ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పీఆర్సీ నివేదిక జాప్యంతో చాలా నష్టపోయారని, ఇప్పటికైనా వెంటనే నివేదిక ఇవ్వాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్ రావు పీఆర్సీ కమిటీ చైర్మన్‌కు గతంలో వినతి పత్రం అందచేశారు. ఉద్యోగుల కనిష్ఠ వేతనం రూ.32వేలు, గరిష్ఠ వేతనం రూ.2,95,460గా ఖరారు చేయాలని కోరారు. తమ నివేదికలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్ధు చేస్తూ పాత పెన్షన్ అమలు చేసేలా సిఫారసులు చేయాలని విన్నవించారు. ఇలా పలు సంఘాలు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను కమిటీ ఛైర్మన్ కు సమర్పించి రెండేళ్లు అవుతోంది. అయినా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి స్పందనలూ లేవు.
వచ్చే నెలలో పీఆర్సీ గడువు ముగియనున్న నేపథ్యంలో మళ్లీ గడువు పొడిగిస్తారా? ఇలా ఎంతకాలం పొడిగించుకుంటూ వెళ్తారు? ఈ కథ కంచికి చేరేదెన్నడోనని.. ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
Read Also |
Moringa Based Sanitary Pads : ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించే మోరింగ శానిటరీ ప్యాడ్స్.. చర్మ రక్షణకూ బెస్ట్
Liu Chuxi | 55 రోజులుగా కోమాలో విద్యార్థి.. ప్రాణం పోసిన స్నేహితుల వీడియో
Bandla Krishna Mohan Reddy : కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి..ఫిరాయింపులో మరో ట్విస్టు !
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram