Moringa Based Sanitary Pads : ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించే మోరింగ శానిటరీ ప్యాడ్స్.. చర్మ రక్షణకూ బెస్ట్
ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించే మోరింగ ఆధారిత శానిటరీ ప్యాడ్స్ చర్మ రక్షణతో పాటు పీరియడ్స్ సమయంలో భద్రమైన సహజ ప్రత్యామ్నాయం.
పాతకాలంలో రుతుచక్రం కోసం మహిళలు ఇంట్లోనే పాత వస్త్రాలను వినియోగించేవారు. అయితే, ఆధునిక కాలంలో శానిటరీ ప్యాడ్స్ (Sanitary Pads) అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఎవరూ పాత పద్ధతులను అనుసరించడం లేదు. మార్కెట్లో దొరికే శానిటరీ ప్యాడ్స్‌నే ఉపయోగిస్తున్నారు. వీటితో మహిళలు ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ శానిటరీ ప్యాడ్ల తయారీలో రకరకాల రసాయనాలను ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ. అంతేకాదు సంతానోత్పత్తి లోపాలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే సహజసిద్ధంగా తయారు చేసిన శానిటరీ ప్యాడ్స్‌నే ఉపయోగించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అందులో మోరింగ ఆధారిత శానిటరీ ప్యాడ్‌లు (Moringa Based Sanitary Pads) బెస్ట్ అని ప్రముఖ గైనకాలజిస్టులు సూచిస్తున్నారు. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు, బాక్టీరియల్ వాజినోసిస్, రుతుక్రమం సమయంలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడతాయట. మోరింగాతో తయారు చేసిన ప్యాడ్స్ పీరియడ్స్ సమయంలో దద్దుర్లు, దురద, ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి సహజమైన, యాంటీ బాక్టీరియల్ రక్షణను అందిస్తాయట. ఇవి చర్మంపై సున్నితంగా ఉంటూ, వాసనను నియంత్రిస్తూ, మెరుగైన శోషణ శక్తితో సౌకర్యాన్ని కల్పిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇవీ ప్రయోజనాలు..
ఈ శానిటరీ ప్యాడ్స్ వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. ఇన్ఫెక్షన్లు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల (UTIs) ప్రమాదం తగ్గుతుంది. అంతేకాదు, చర్మంపై దద్దుర్లు, మంటను నివారిస్తాయి. పీరియడ్స్‌టైమ్‌లో వచ్చే దుర్వాసనను కూడా ఇవి నియంత్రిస్తాయి. దుర్వాసనను అరికట్టి రోజంతా తాజాగా ఉంచుతాయి. చర్మ రక్షణకు కూడా ఈ ప్యాడ్స్ ఎంతో ఉపయోగకరం. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల వల్ల చర్మంపై మంట, దురత తగ్గుతాయి. మోరింగాలో సహజంగానే విటమిన్ ఇ, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ సంరక్షణకు ఎంతగానో దోహదపడతాయి. ప్రస్తుతం Everteen వంటి బ్రాండ్లు మునగతో కూడిన ఈ రకమైన ప్యాడ్‌లను అందిస్తున్నాయి.
శానిటరీ ప్యాడ్లలో అధికమొత్తంలో రసాయనాలు..
శానిటరీ ప్యాడ్ల తయారీలో ఎక్కువ మొత్తంలో వాడుతున్న రసాయనాలు అండాశయ, రొమ్ము క్యాన్సర్లకు కారణం అవుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. శానిటరీ ప్యాడ్లలో రసాయనాలు మరీ ముఖ్యంగా వీఓసీలు (వొలాటైల్ ఆర్గానిక్ కంపౌండ్స్) ఉండే అవకాశం ఎక్కువ అని గుర్తించారు. ప్రముఖ బ్రాండ్ శానిటరీ ప్యాడ్లలో విషపూరితమైన స్టైరిన్, క్లోరోఫామ్, క్లోరోమీథేన్ సమ్మేళనాలు అధిక మొత్తంలో ఉన్నట్లు విమెన్స్ వాయిస్ ఫర్ ఎర్త్ గ్రూప్ గుర్తించి హెచ్చరించింది.
శానిటరీ ప్యాడ్స్‌తో పర్యావరణానికి హానికరం..
శానిటరీ ప్యాడ్స్‌తో పర్యావరణానికి హానికరమని పలు అధ్యయనాల్లో తేలింది. సాధారణ శానిటరీ ప్యాడ్స్‌లో 90% వరకు ప్లాస్టిక్, సింథటిక్ పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. అవి పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ప్యాడ్ల తయారీలో డయాక్సిన్లు, ఫ్థాలేట్లు, ఫార్మాల్డిహైడ్ వంటి హానికరమైన రసాయనాలను ఉపయోగిస్తారు. ఇవి నేల, భూగర్భ జలాలను కలుషితం చేస్తాయి. వీటిని కాల్చివేయడం ద్వారా వీటిలో ఉండే రసాయనాలు గాలిలోకి విషపూరితమైన డయాక్సిన్, ప్యూరాన్లను విడుదల చేస్తాయి.
ఇవి కూడా చదవండి :
MSVG | బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ తాండవం ..‘మన శంకర వరప్రసాద్ గారు’తో పుష్ప రికార్డ్స్ బ్రేక్..
Harish Rao : ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు రేవంత్ రెడ్డి జల ద్రోహం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram