తెలంగాణకు చల్లటి కబురు… ఐదు రోజులు చిరుజల్లులు.. ఈదురుగాలులు
తెలంగాణలో ఎండలకు తాత్కాలిక బ్రేక్. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఐదు రోజుల పాటు సన్నటి వానలు, ఉరుములు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణలో వాతావరణ మార్పుతో హైదరాబాద్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో వర్ష వాతావరణం కనిపిస్తున్న దృశ్యం.
Telangana Weather Update: Thunderstorms, Light Rains Likely for Five Days
హైలైట్స్
- తెలంగాణలో ఐదు రోజులు సన్నటి వానలు
- ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు
- గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2–4 డిగ్రీలు తగ్గే అవకాశం
- హైదరాబాద్ సహా 14 జిల్లాలకు వాతావరణ శాఖ సమాచారం
విధాత వాతావరణం డెస్క్ | 15 మార్చి 2026 | హైదరాబాద్:
ఉక్కపోతకు కొంచెం విరామం
తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రత పెరిగి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. మార్చిలోనే ప్రజలు ఎండ ధాటికి బేజారవుతున్నారు. అయితే వేడి నుండ కొంత ఉపశమనం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) తాజా బులెటిన్ ప్రకారం మార్చి 16 నుంచి మార్చి 20 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సన్నటి వానలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. దక్షిణ–తూర్పు దిశ నుంచి తేమతో కూడిన గాలులు తెలంగాణలోకి ప్రవేశించడం వల్ల వాతావరణంలో మార్పు చోటుచేసుకుంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
14 జిల్లాలకు ఉరుముల హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సన్నటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ విడుదల చేసిన మ్యాప్.
మార్చి 16న తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది.
హైదరాబాద్ నగరంలో వచ్చే 24 గంటల్లో ఆకాశం కొంతమేర మేఘావృతంగా ఉంటుందని, ఉదయం సమయంలో పరిసరాలు మసగ్గా ఉండవచ్చని చెప్పారు. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత సుమారు 36 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.

సన్నటి వానల మధ్య గొడుగులతో రోడ్డుపై వెళ్తున్న ప్రజలు — ఎండ తీవ్రతకు వర్షాలు ఉపశమనం ఇవ్వనున్నాయి.
మొత్తానికి తెలంగాణలో ఎండ తీవ్రత మధ్యలోనే వాతావరణంలో మార్పు కనిపించడం ప్రజలకు కొంత ఉపశమనం కలిగించే అంశంగా భావిస్తున్నారు. రాబోయే ఐదు రోజుల పాటు సన్నటి వానలు, ఈదురుగాలులు కొనసాగితే ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ సూచిస్తోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram