ITR Refunds : ఐటీఆర్ రీఫండ్స్ ఆలస్యానికి కారణం ఏంటి?
టీడీఎస్, బ్యాంక్ వివరాల్లో తప్పులు, ఈ-వెరిఫికేషన్ ఆలస్యం, పాన్-ఆధార్ లింక్ సమస్యలు… ఇవే ఐటీ రీఫండ్ ఆలస్యానికి ప్రధాన కారణాలు. స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి.
ఆదాయ పన్ను రిటర్న్స్ రీఫండ్ ఎందుకు ఆలస్యం అవుతాయి? దీనికి కారణాలు ఏంటి? ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో ఎలాంటి పొరపాట్లు చేస్తే రిటర్న్స్ రీఫండ్ కు ఆలస్యం అవుతుంది? రీఫండ్ స్టేటస్ ను ఎలా తెలుసుకోవాలి.
ఐటీ రీఫండ్ అంటే ఏంటి?
ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన తర్వాత నెల రోజుల్లోపుగా మీకు ఆదాయపన్ను శాఖ నుంచి రీఫండ్ వస్తుంది. కానీ,ఈ ఆర్ధిక సంవత్సరం మాత్రం ప్రత్యేక కారణాలతో రీఫండ్ చెల్లింపులో ఆలస్యం అవుతోందని ఆ శాఖ చెబుతోంది.
ఉద్యోగుల జీతంలో టీడీఎస్ కట్ అయినా లేదా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టినా చివరికి మీ ట్యాక్స్ ఎంతో కంప్యూటర్ లెక్కిస్తుంది. ఒకవేళ మీరు కట్టాల్సిన దానికన్నా ఎక్కువ ట్యాక్స్ కడితే ఎక్కువగా పే చేసిన డబ్బు మీకు తిరిగి చెల్లిస్తారు. ఇలా చెల్లించే డబ్బునే ఐటీ శాఖ రీఫండ్ గా పిలుస్తారు. ఏఏ కారణాలతో రీఫండ్ ఆలస్యం అవుతోందో తెలుసుకుందాం. తప్పుడు సమాచారం, తప్పుడు క్లైయిమ్, బ్యాంక్ ఖాతా వివరాల్లో మార్పులు, ఐటీఆర్-V పంపడంలో ఆలస్యం, పాన్ , ఆధార్ కార్డు లింక్ కాకపోయినా, ఫారం- 16, 26 As, క్లైయిమ్ చేసిన డిడక్షన్ లో తేడాలు ఉంటే ఐటీ రీఫండ్ ఆలస్యం అవుతుంది.
ఈ-ధృవీకరణ ఆలస్యమైనా
ఐటీ రీఫండ్ ఆలస్యానికి చిన్న అంశాలు కూడా కారణం అవుతాయి. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో మీరు ఇచ్చిన బ్యాంక్ ఖాతా నెంబర్ , బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్ నెంబర్లలో తేడాలున్నా కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. పాన్ కార్డులో ఉన్న పేరుతో బ్యాంకు అకౌంట్ లో ఉన్న పేరుకు మ్యాచ్ కాకపోతే కూడా రీఫండ్ ఆలస్యం అవుతుంది. బ్యాంక్ ఐఎఫ్ఎస్ సీ కోడ్ పాతది వేసినా కూడా ఇబ్బందే. చెల్లించాల్సిన బకాయిల విషయంలో సమగ్ర సమాచారం లేకపోవడం, చెల్లుబాటుకాని లేదా తప్పుగా లింక్ చేసిన బ్యాంక్ ఖాతా, 30 రోజుల్లో ఈ ధృవీకరణ పూర్తి చేయకపోయినా, తప్పుడు రిటర్న్స్ ఫైల్ చేసినా కూడా రీఫండ్ ఆలస్యం అవుతుంది. మరో కారణంతో కూడా రీఫండ్ ఆలస్యం కావచ్చు. గత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బకాయిని ఈ ఆర్ధిక సంవత్సరం రీఫండ్ తో సర్ధుబాటు చేసినా కూడా రీఫండ్ క్లైయిమ్ తిరస్కరించే అవకాశం ఉంది.
ఐటీ రీఫండ్ స్టేటస్ ను ఎలా చెక్ చేసుకోవాలి?
ఆదాయ పన్ను శాఖ వెబ్ సైట్ లో ఐటీ రీఫండ్ స్టేటస్ ను తెలుసుకోవచ్చు. ఆదాయపన్ను శాఖ అధికారిక వెబ్ సైట్ https: incometax.gov.in వెబ్ సైట్ కు వెళ్లాలి. మీ పాన్ నెంబర్, పాస్ వర్డ్ తో ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. ఈ ఫైల్ సెక్షన్ లో ఆదాయపన్ను రిటర్న్స్ లో వ్యూ ఫైల్డ్ రిటర్న్స్ పై క్లిక్ చేయాలి. అప్పుడు ఈ ఆర్ధిక సంవత్సరం ఐటీఆర్ పై క్లిక్ చేస్తే మీ రిటర్న్స్ పై స్టేటస్ కనిపిస్తుంది. ప్రోసీడ్ అని ఉంటే రీఫండ్ పూర్తవుతుందని, రీ ఫండ్ ఇష్యూడ్ అని కనిపిస్తే డబ్బు మీ బ్యాంక్ ఖాతాకు వచ్చేస్తుందని అర్ధం. పెండింగ్ అని ఉంటే రీఫండ్ మరింత ఆలస్యం అవుతుందని అర్ధం. ఇక ఎన్ఎస్‌డీఎల్ వెబ్ సైట్ ద్వారా కూడా మీ రీఫండ్ స్టేటస్ తెలుసుకోవచ్చు. https:tin.tin.nsdl.com/oltas/refund-status-pan.html వెబ్ సైట్లోకి వెళ్లాలి. మీ పాన్ నెంబర్, అసెస్ మెంట్ ఇయర్ అంటే ఏ ఆర్ధిక సంవత్సరమో సెలక్ట్ చేసుకోవాలి. క్యాప్చా టైప్ చేసి సబ్ మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. రీఫండ్ సెంట్ అని వస్తే రీఫండ్ ప్రక్రియ పూర్తైనట్టే. రీఫండ్ ఫెయిల్డ్ లేదా రిటర్న్డ్ అని వస్తే మీ బ్యాంక్ వివరాలు తప్పుగా ఉన్నట్టు అర్ధం చేసుకోవాలి. తప్పుగా ఉన్న వివరాలను సరిచేయాలి. అప్పుడు మీ రీఫండ్ మీకు తిరిగి వస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram