Rythu Bharosa | రైతు భరోసా నిధులు ఇచ్చేది ఎప్పుడు? అధికారుల కీలక అప్‌డేట్‌

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా నిధుల కోసం రైతాంగం ఎదురుచూపులు చూస్తున్నది. క్యాబినెట్‌ మీటింగ్‌ తర్వాత నిధులు విడుదల చేస్తారని తొలుత ప్రచారం జరిగినా.. ఆ సంకేతాలు ఏమీ లేవు. రాబోయే పరిషత్‌ ఎన్నికలకు ముందు లేదా తర్వాత నిధులు జమ చేసే అవకాశాలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.

Rythu Bharosa | రైతు భరోసా నిధులు ఇచ్చేది ఎప్పుడు? అధికారుల కీలక అప్‌డేట్‌

విధాత, హైదరాబాద్:
Rythu Bharosa | తెలంగాణ రైతాంగం గత రెండు నెలలుగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నది. ఫిబ్రవరి 18 వ తేదీ నుంచి వారం రోజుల పాటు డబ్బులు వేస్తారని ప్రచారం జరిగింది. ఆ తేదీలలో డబ్బులు వేయడం ప్రారంభించ లేదు. 23 వ తేదీన (సోమవారం) జరిగే మంత్రి వర్గ సమావేశం లో ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే దానిపై స్పష్టత ఇస్తారని రైతులు ఆశించారు. కానీ ఈ సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదని తెలిసింది. మరో ముఖ్య విషయం ఏంటంటే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రివర్గ సమావేశానికి హాజరు కాలేదని సమాచారం. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల రాకపోవడం మూలంగా చర్చ జరగలేదా… రైతు భరోసా పథకంపై ఎజెండా లేదని ఆయన రాలేదా? అనేది తెలియడం లేదు.

అయితే మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల పై మంత్రి వర్గం సమావేశం లో సుదీర్ఘంగా చర్చించారు. బీసీ ల రిజర్వేషన్ పై కేంద్రానికి ఉభయ సభల తీర్మానం చేసి పంపించి నందున నిర్ణయం వెలువడే వరకు వేచి చూడాలని నిర్ణయించారు. టెన్త్ పరీక్షల తరువాతే పరిషత్ ఎన్నికల కు వెళ్లడం మేలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు కారణాల మూలంగా మే లేదా జూన్ నెలలో పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

ఏ లెక్కన చూసినా పరిషత్ ఎన్నికల కు ముందే రైతు భరోసా పథకం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తారని ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. నిధులు అందుబాటులో ఉన్నందున రైతుల ఖాతాల్లో బదిలీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తే వెంటనే బదిలీ ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన వెంటనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడ బహిరంగ సభలో చెప్పిన విషయం తెలిసిందే.

గత వానాకాలం సీజన్ లో 69,39,548 రైతులకు ఒక ఎకరాకు ₹6,000 చొప్పున బదిలీ చేశారు. మొత్తం ₹8,744.13 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. సుమారు 1 కోటి 45 లక్షల 73వేల ఎకరాల కు సాయం అందింది. ఈ యాసంగి లో కూడా అంతే మొత్తం బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బోగస్ రైతులను ఏరివేసేందుకు ప్రొఫెసర్ జయ శంకర్ వ్యవసాయ విద్యాలయం సమర్పించిన సర్వే నివేదికను అమలు చేయవద్దని ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.