AI Data Centers | ఏఐ డాటా సెంటర్ ఏర్పాటును రద్దు చేసిన అమెరికా నగరం.. కారణం ఇదే!
అమెరికాలోని న్యూ బ్రున్స్‌విక్ నగరం ఏఐ డాటా సెంటర్‌ను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నది. సహజ వనరులను యథేచ్ఛగా తోడివేసే ఈ సెంటర్‌లకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. వాటితో ఎంతో ప్రమాదం ఉన్నప్పటికీ.. మన దేశం ఏఐ డాటా సెంటర్ల కోసం వెంపర్లాడుతున్నది. ఇదే అదనుగా గూగుల్ వంటి కంపెనీలు భారత్‌లో డాటా సెంటర్ల ఏర్పాటకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.
AI Data Centers | భారతదేశం ఏఐ డాటా సెంటర్ల ఏర్పాటుకు ద్వారాలు తెరుస్తూ ఉంటే.. ఆ కంపెనీల ప్రధాన కేంద్రమైన అమెరికాలో మాత్రం ప్రజానీకం తలుపులు మూసేస్తున్నారు. అత్యధిక మొత్తంలో నీటిని, విద్యుచ్ఛక్తిని వాడే ఏఐ డాటా సెంటర్ల ఏర్పాటుపై ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నిరసన ప్రదర్శనలు కూడా నిర్వహిస్తున్నారు. మాకొద్దీ డాటా సెంటర్లు అంటూ ఎలుగెత్తి నినదిస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పట్నంలో ఏఐ సెంటర్ ఏర్పాటుకు గూగుల్ ముందుకు వచ్చిన సందర్భాన్ని చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంది.
కానీ.. అమెరికాలోని న్యూ జెర్సీ రాష్ట్రంలోని న్యూ బ్రున్స్‌విక్ నగర కౌన్సిల్.. ప్రజల ఒత్తిడితో తమ ప్రాంతంలో ఏఐ డాటా సెంటర్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 19, 2026న ఏకంగా తీర్మానం చేసింది. ఇప్పటికే ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ.. ఆ ప్రాంతాన్ని పార్క్ అవసరాలకు వినియోగించుకునేలా సవరణలు చేసింది. కౌన్సిల్ నిర్ణయం పట్ల నగరవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. నివాసాలు, వ్యాపార కేంద్రాలకు సమీపంలో 27వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో డాటా సెంటర్ ఏర్పాటుకు ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని నగర అధికారులు ప్రకటించిన తొమ్మిది రోజుల్లోనే కౌన్సిల్ తన నిర్ణయాన్ని రద్దు చేసుకోవడం విశేషం. తద్వారా డాటా సెంటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సమూహాల్లో న్యూ బ్రున్స్‌విక్ నగరం కూడా చేరింది.
ప్రభుత్వ నిర్ణయంపై ఫుడ్ అండ్ వాటర్ వాచ్ సెంట్రల్ న్యూ జెర్సీ సీనియర్ ఆర్గనైజర్ చార్లీ క్రటోవిల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజల సహకారంలేకుండా ఈ విజయం సాధ్యమయ్యేదే కాదని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. న్యూ బ్రున్స్‌విక్ మాత్రమే కాకుండా.. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల గొప్ప టీమ్ వర్క్‌గా ఆయన అభివర్ణించారు. తమ చర్యలకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘ఇంత మంది యువత బయటకు రావడం చాలా ఉత్సహాన్నిస్తున్నది. మన ఉద్యమానికి ఇదొక శక్తిమంతమైన, ఐక్యతను చాటా సందర్భం’ అని క్రటోవిల్ తన ప్రకటనలో అభివర్ణించారు. గత ఏడాది అక్టోబర్‌లో ఫుడ్ అండ్ వాటర్ వాచ్.. డాటాసెంటర్లపై మారటోరియం విధించాలన్న డిమాండ్‌ను తీసుకువచ్చింది. ఈ పిలుపులో సుమారు 250 సంస్థలు భాగస్వాములయ్యాయి.
ఏఐ డాటా సెంటర్లు పెద్ద మొత్తంలో సహజ వనరులను వాడేస్తాయి. అమెరికాలో ఉన్న డాటా సెంటర్లు జాతీయ విద్యుత్తులో నాలుగు శాతాన్ని వినియోగించుకుంటున్నాయి. అంటే.. 70 లక్షల ఇండ్లు ఏడాదిపాటు వినియోగించుకునే విద్యుత్తుతో ఇది సమానం. డాటా సెంటర్‌లో నిత్యం చల్లదనం కొనసాగించేందుకు లక్షల గ్యాలన్ల నీటిని ప్రతి సంవత్సరం వినియోగిస్తారు. ఫలితంగా స్థానిక ప్రజల అవసరాలకు తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతున్నదని 2023లో లారెన్స్ బర్క్‌లీ నేషనల్ లాబొరేటరీ నివేదిక పేర్కొంటున్నది.
A data center in New Brunswick was canceled tonight when hundreds of residents showed up. When fight big tech and private equity we win. pic.twitter.com/doZ63Pdwue
— Ben Dziobek (@BenDziobek) February 19, 2026
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram