AI Data Centers | డాటా సెంటర్లు ‘హీట్‌ ఐలాండ్స్‌’గా మారిపోతున్నాయా? మానవాళికి కొత్త అధ్యయనం హెచ్చరికలు

ఏఐ డాటా సెంటర్లు నీటిని, పెద్ద మొత్తంలో విద్యుత్తును వినియోగిస్తాయన్న అందోళనలు ఇప్పటి వరకూ ఉన్నాయి. అయితే తాజాగా శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో విస్తుబోయే అంశాలు వెలుగు చూశాయి. డాటా సెంటర్ల చుట్టుపక్కల పది కిలోమీటర్ల వరకూ భూమి వేడెక్కిపోతున్నదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

AI Data Centers | డాటా సెంటర్లు ‘హీట్‌ ఐలాండ్స్‌’గా మారిపోతున్నాయా? మానవాళికి కొత్త అధ్యయనం హెచ్చరికలు

AI Data Centers | డాటా సెంటర్లు. కృత్రిమ మేధకు అత్యంత కీలకమైనవి. ఇవి ఇప్పటి వరకూ పెద్ద మొత్తంలో నీటిని, విద్యుత్తును వినియోగిస్తాయనే ఆందోళనలే ఉన్నాయి. కానీ.. వీటితో పర్యావరణానికి పెను ప్రమాదాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డాటా సెంటర్ల చుట్టుపక్కల ఉన్న భూమిని ‘హీట్‌ ఐలాండ్స్‌’గా మార్చేస్తున్నాయని, ఈ వేడి కనిష్ఠంగా 16 డిగ్రీల ఫారన్‌హైట్‌గా ఉంటున్నదని చెబుతున్నారు. సుమారు 34 కోట్ల మంది ప్రజలు ఈ వేడిని అనుభవిస్తారని పేర్కొంటున్నారు.

రానురాను డాటా సెంటర్ల సంఖ్య పెరుగుతున్నా.. వాటి కారణంగా కలిగే ప్రభావాలను అర్థం చేసుకోవడంలో చాలా గ్యాప్స్‌ ఉన్నాయని యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌లోని ఎర్త్‌ అబ్జర్వేషన్‌ గ్రూప్‌కు చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఆండ్రియా మారినోని చెప్పారు. ఆండ్రియా ఈ అధ్యయనం రచయిత కూడా. అయితే ఈ అధ్యయనం ఇంకా పీర్‌ రివ్యూడ్‌ కాలేదు.

  • ఆండ్రియా మరినోని, ఆయన సహచరులు చేసిన అధ్యయనంలో డాటా సెంటర్ల చుట్టుపక్కల భూమి ఉష్ణోగ్రత సగటున 3.6 డిగ్రీల ఫారన్‌హైట్‌ (సుమారు 2 డిగ్రీల సెల్సియస్‌) నుంచి కొన్ని ప్రాంతాల్లో 16.4 డిగ్రీల ఫారన్‌హైట్‌ (సుమారు 9 డిగ్రీల సెల్సియస్‌) వరకూ వేడి పెరుగుదల నమోదైంది.
  • ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల పెరుగుదల.. డాటా సెంటర్ల ఏర్పాటు మొదలైన తర్వాత స్పష్టంగా కనిపిస్తున్నదని మారినోని అధ్యయనం పేర్కొంటున్నది. ఈ అధ్యయనం కోసం ప్రపంచవ్యాప్తంగా లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వేల సర్వర్లతో కూడిన ఆరువేలకు పైగా డాటా సెంటర్లను, 20 సంవత్సరాల ఉపగ్రహాల రిమోట్‌ సెన్సింగ్‌ డాటాను విశ్లేషించారు.
  • ఈ అధ్యయనంలో ప్రత్యేకంగా అధిక జనసాంద్రత ఉన్న నగరాలను, సీజనల్‌ మార్పులు, గ్లోబల్‌ వామింగ్‌ ప్రభావం వంటి అంశాలను తొలగించిన పరిశీలించడం ద్వారా డాటా సెంటర్ల ప్రభావాన్ని స్పష్టంగా అంచనా వేసేందుకు ప్రయత్నించారు.

పది కిలోమీటర్ల వరకూ ప్రభావం

ఈ ప్రభావం సమీప ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాలేదని, సుమారు పది కిలోమీటర్ల వరకూ ఉష్ణోగ్రత ప్రభావం కనిపించిందని అధ్యయనకారులు తెలిపారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 34 కోట్ల మంది ప్రభావితమైనట్లు పేర్కొన్నారు. మెక్సికోలోని బాజీయో ప్రాంతంలో 20 ఏళ్లలో అనూహ్య స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగినట్టు గుర్తించారు. స్పెయిన్‌లోని అరగాన్‌లో సమీప ప్రాంతాలకంటే అధిక వేడి ఉన్నట్టు గమనించారు. ఇక్కడ ఉష్ణోగ్రతల పెరుగుదలకు ఇతర కారణాలేవీ కనిపించ లేదని అధ్యయనం పేర్కొంటున్నది.

అసలు కారణం డాటా సెంటర్లే

డాటా సెంటర్లలో 24 గంటలూ నిరంతరాయంగా పనిచేసే సర్వర్లు ఉంటాయి. వాటిని రక్షించేందుకు భారీ కూలింగ్‌ వ్యవస్థలు ఏర్పాటు చేస్తారు. ఇది వినియోగించే విద్యుత్తు అంతిమంగా వేడి రూపంలో బయటకు వస్తుంది. అదే హీట్‌ ఐలాండ్‌ ప్రభావాన్ని సృష్టిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో డాటా సెంటర్లు నిర్మిస్తున్నారు. రానున్న కాలంలో వీటి సంఖ్య మరింత పెరగనున్న నేపథ్యంలో తాజా అధ్యయనాన్ని గట్టి హెచ్చరికగా భావించాలని నిపుణులు చెబుతున్నారు.

ఏఐ విషయలో చోటు చేసుకుంటున్న పోటీ.. పర్యావరణ పరిరక్షణను పక్కన పెడుతోందని లండన్‌ సౌత్‌ బ్యాంక్‌ వర్సిటీకి చెందిన సస్టైనబిలిటీ, సర్క్యులారిటీ డిజైన్‌ ఎమెరిటస్‌ ప్రొఫెసర్‌ డెమోరా ఆండ్రూస్ వ్యాఖ్యానించారు. డాటా సెంటర్ల ప్రభావాలపై ఇప్పటికే అనేక ఆందోళనలు ఉన్నప్పటికీ.. అవి ఉత్పత్తి చేసే వేడిపై ప్రత్యేకంగా దృష్టిసారించిన పరిశోధన తన దృష్టిలో ఇదే మొదటిదని అన్నారు.

ఈ ఫలితాలపై మరింత పరిశోధన అవసరమని బోర్డర్‌స్టెప్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ సస్టైనబిలిటీకి చెందిన సీనియర్‌ పరిశోధకుడు రాల్ఫ్‌ హింటెమన్‌ అన్నారు. తాజా అధ్యయనం కొన్ని ఆసక్తికర గణాంకాలు అందించినప్పటికీ.. ఇందులో చూపిన ప్రభావాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పారు. అత్యంత పెద్ద సమస్య డాటా సెంటర్లు వినియోగించే విద్యుత్తేనని అన్నారు.

రానున్న రోజుల్లో మరీ దారుణ పరిస్థితులు

ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం వేగంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో మరిన్ని డాటా సెంటర్లు ఏర్పాటవుతున్న నేపథ్యంలో వేడి ప్రభావం మరింత తీవ్రంగా ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వడగాల్పుల వంటి పరిస్థితులను ఇది మరింత తీవ్రతరం చేసే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

Read Also |

Bengaluru Techie Couple Suicide : బెంగళూర్ లో టెకీ జంట ఆత్మహత్య
Jayalalitha House Seized | హైదరాబాద్‌లోని మాజీ సీఎం జయలలిత భవనం సీజ్