Jayalalitha House Seized | హైదరాబాద్‌లోని మాజీ సీఎం జయలలిత భవనం సీజ్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితకు చెందిన హైదరాబాద్ నగరంలోని భవనాన్ని సోమవారం జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించాలని నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో భవనాన్ని సీజ్ చేశారు.

Jayalalitha House Seized | హైదరాబాద్‌లోని మాజీ సీఎం జయలలిత భవనం సీజ్

విధాత, హైదరాబాద్ : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితకు చెందిన హైదరాబాద్ నగరంలోని భవనాన్ని సోమవారం జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్‌ నగరం యూసుఫ్‌గూడ జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-38 పరిధి శ్రీనగర్‌కాలనీలో జీ+4తో నిర్మించిన 8-3-1099/ఎ (పీటీఐఎన్‌ నంబర్: 1100833474) భవనం జె.జయలలిత పేరుతో ఉంది. ఈ భవనానికి సంబంధించి 2017నుంచి ఆస్తి పన్ను బకాయిలుపేరుకుపోవటంతో డిప్యూటీ కమిషనర్ సురేశ్ ఫిబ్రవరిలో జయలలితకు సంబంధించిన వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. సదరు వ్యక్తులు స్పందించకపోవడంతో జీహెచ్ఎంసీ ఏఎంసీ బాల్‌రాజ్ ఆధ్వర్యంలో భవనాన్ని సిబ్బంది సీజ్ చేశారు.

ఓటీఎస్ స్కీమ్ మార్చి 31 వరకు అమలులో ఉన్నందున రాయితీ పోను రూ.82,91,822 మేర బకాయిలు ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. గతంలో ఈ భవనంలో ప్రైవేటు కార్యాలయం నిర్వహించారని.. దీంతో వాణిజ్య సముదాయం కింద ఆస్తి పన్ను విధించినట్లు అధికారులు తెలిపారు. 2017 నుంచి ఈ భవనాన్ని నివాసానికి వాడుకుంటున్నందున రెసిడెన్షియల్‌గా మార్పు చేయాలని జయలలిత మేనల్లుడు, చెన్నైకి చెందిన దీపక్‌ జయకుమార్‌ జీహెచ్‌ఎంసీ అధికారులను గతంలో కోరారు.

ఇదిలా ఉండగా.. OTS స్కీం కింద రాయితీకి మార్చి 31 తుది గడువు ఉన్న క్రమంలో ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీకి 90 శాతం మాఫీకి అధికారులు అవకాశం కల్పించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మూడు కార్పొరేషన్ల పరిధిలో 2,350 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసినట్లు తెలిపారు.

మరోవైపు తమిళనాడు మాజీ సీఎం జయలలితకు భారీగా ఆస్తులు ఉన్నాయి. అమె తమిళనాడుకు మూడుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఎంజీ రామచంద్రన్ రాజకీయ వారసురాలిగా అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టి పురుచ్చతలైవి(విప్లవ నాయకురాలు), అమ్మ అని పేరొందారు. ఆరుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు జయలలిత సినిమాల్లోనూ నటించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జలలలిత అనారోగ్యంతో కన్నుమూశారు. జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు అప్పట్లో సంచలనం రేపింది. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులు గతంలో తమిళనాడు ప్రభుత్వానికి చేరాయి. పసిడి ఆభరణాలు, నగదుతో పాటు ఆస్తుల పత్రాలను మూడు ట్రంకు పెట్టెల్లో అధికారులు తమిళనాడు సర్కారుకు అప్పగించారు.

ఇవి కూడా చదవండి :

Job Mela | నేడు ఉస్మానియా యూనివ‌ర్సిటీలో జాబ్ మేళా
AP High Court Jobs | ఏపీ హైకోర్టులో 300 ఉద్యోగాలు.. పోస్టును బట్టి జీతం నెలకు రూ.1.47లక్షలు!