Maruti Suzuki సంచలనం.. జూన్ 5న దేశంలోనే తొలి E100 ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు లాంచ్.. పెట్రోల్ బాధ తప్పినట్లేనా?

Maruti Suzuki | పెట్రోల్, డీజిల్ ధరల భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధనంతో నడిచే కార్లపై మారుతి సుజుకీ దృష్టిసారించింది. పూర్తిగా ఇథనాల్‌ఋతో నడిచే ఫ్యూయల్ ఫ్లెక్స్‌ను కారును లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.

Maruti Suzuki | పెట్రోల్, డీజిల్ ధరల భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధనంపై ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలోనే పూర్తిగా ఇథనాల్‌తో నడిచే కార్లపై ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ దృష్టి సారించింది. దేశంలోనే తొలి E100 ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును త్వరలోనే లాంచ్ చేయబోతుంది.

ప్రపంచ పర్యవరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5వ తేదీన పూర్తిగా ఇథనాల్‌తో నడిచే కారును మారుతి సుజుకీ ఆవిష్కరించబోతున్నట్లుగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారత్‌లో ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాన్ని పెంచడంలో ఇది కీలక అడుగు అని పేర్కొన్నారు.

E100 ఫ్లెక్సీ ఫ్యూయల్ అంటే ఏంటి?

ప్రస్తుతం భారత్‌లో E20 పెట్రోల్ వినియోగంలో ఉంది. అంటే పెట్రోల్‌లో 20 శాతం వరకు ఇథనాల్ మిశ్రమం ఉంటుంది. కానీ ఫ్లెక్సీ ఫ్యూయల్ (E100)లో పూర్తిగా ఇథనాల్ మాత్రమే ఉంటుంది. అంటే పెట్రోల్ అవసరం లేకుండానే వాహనం నడుస్తోంది. దీనివల్ల పెట్రోల్ వినియోగం భారీగా తగ్గే అవకాశం ఉంది.

ఇథనాల్ ప్రధానంగా చెరకు, మొక్కజొన్న వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారవుతుంది. ఇవి మన దేశంలోనే ఉత్పత్తి కావడం వల్ల విదేశాల నుంచి చమురు దిగుమతులపై ఆధారపడే అవసరం గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం దేశ అవసరాల్లో దాదాపు 87 శాతం పెట్రోల్, డీజిల్, గ్యాస్ దిగుమతుల ద్వారానే నెరవేరుతున్నాయి. దీనివల్ల విదేశీ మారకద్రవ్యం భారీ స్థాయిలో ఖర్చవుతుంది. అదే చెరకు, మొక్కజొన్న వంటి పంటల నుంచి వచ్చే ఇథనాల్‌ ఉత్పత్తి పెరిగితే రైతులకు కూడా లబ్ధి చేకూరుతుంది. అలాగే క్రూడ్ ఆయిల్ దిగుమతులు తగ్గడంతో పాటు కాలుష్యాన్ని అదుపు చేయవచ్చు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పిన వివరాల ప్రకారం.. ఇథనాల్ ధర లీటర్‌కు సుమారు రూ.65 వరకు ఉండొచ్చు. ఇది సాధారణ పెట్రోల్ ధరలతో పోలిస్తే తక్కువ. దీనివల్ల వినియోగ ఖర్చులు కూడా తగ్గుతాయి.

పాత కార్లను E100 ఇంధనంతో వాడలేమా?

ప్రస్తుతం భారత్‌లో ఉన్న E20తో పోలిస్తే E100 ఇంధనానికి ఆక్టేన్ రేటింగ్ ఎక్కువ. ఇది పెట్రోల్ కంటే ఎక్కువ తేమను గ్రహించే స్వభావం కలిగి ఉంటుంది. దీంతో ఇంజిన్ లోపలి భాగాలకు తుప్పు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.ఇథనాల్ స్వభావం కారణంగా ప్రత్యేక ఇంజిన్ భాగాలు అవసరమవుతాయి. ఇంధన పైపులు, ఇంజెక్టర్లు, సీల్స్, అంతర్గత ఇంజిన్ భాగాలను రూపొందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే మారుతి సుజుకీ ముందడుగు వేసి.. ఫ్లెక్సీ ఫ్యూయల్ కార్లను అభివృద్ది చేసింది. ఇక టొయోటా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, సుజుకీ వంటి కంపెనీలు కూడా ఇప్పటికే ఫ్లెక్సీ ఫ్యూయల్ వాహనాల అభివృద్ధిపై ఫోకస్ చేశాయి. నమూనాలను కూడా ప్రదర్శించాయి.

మారుతి సుజుకీ ఏ కార్లలో E100 టెక్నాలజీ అందిస్తుంది?

ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో విడుదల చేయబోయే కారు మోడల్‌ను ఇప్పటివరకు మారుతి సుజుకీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే, ఇటీవల నిర్వహించిన ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకీ కంపెనీ ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ కలిగిన WagonRను ప్రదర్శించింది. అలాగే విదేశీ మార్కెట్లలో ఇథనాల్‌కు అనుకూలంగా మార్చిన Fronx మోడల్‌ను చూపించింది. కాబట్టి రెండు కార్లలో ఏదో ఒకటి జూన్ 5వ తేదీన ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ కారుగా విడుదలయ్యే అవకాశం ఉందని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

కార్లు వచ్చేశాయి సరే.. ఇంధనం అందరికీ దొరుకుతుందా!

ప్రస్తుతం ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ సిద్ధంగా ఉంది. మారుతి సుజుకీతో పాటు వివిధ కంపెనీలు కూడా ఈ టెక్నాలజీ కార్లను రెడీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ అంతే స్పీడ్‌తో దేశవ్యాప్తంగా E100 ఇంధనం అందుబాటులోకి తీసుకురావడం సాధ్యం కాదు. ప్రస్తుతం చాలా పెట్రోల్ బంకుల్లో E20 మాత్రమే అందుబాటులో ఉంది. E100 దేశవ్యాప్తంగా సరఫరా చేయాలంటే ప్రత్యేక మౌలిక సదుపాయాలు అవసరం అవుతాయి. అవన్నీ సమకూర్చేందుకు చాలా సమయమే పట్టొచ్చు. అయితే ప్రస్తుతానికి E22, E25, E30 ఇథనాల్ మిశ్రమంపై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. క్రమంగా పెట్రోల్‌లో ఇథనాల్ పెంచే దిశగా ముందుకు సాగుతోంది.

Read More:

Self Driving Truck | హైవేలపై సరికొత్త విప్లవం.. డ్రైవర్లు లేకుండా ఏఐతో రోడ్లపై పరుగులు పెట్టే ట్రక్కులు.. వీటితో లాభమా? నష్టమా?

స్పోర్టీ లుక్.. ప్రీమియం ఫీచర్లతో కొత్త బజాజ్ పల్సర్ N160 లాంచ్.. ధర ఎంతంటే..!

 

Latest News