Bob Rides App | సింగిల్ యాప్ బాబ్ రైడ్స్ వచ్చేసింది.. ఊబర్, ఓలా, రాపిడో ధరలు పోల్చుకోవచ్చు!
ఓలా, ఉబెర్ తదితర యాప్‌లలో దేనిలో తక్కువ ధరకు ప్రయాణించవచ్చునో తెలుసుకునే కొత్త యాప్ విశేష ఆదరణ పొందుతున్నది.

Bob Rides App | బెంగళూరు కు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ బాబ్ రైడ్స్ యాప్ ను సిద్ధం చేసింది. ఇప్పుడున్న క్యాబ్ యాప్ లకు భిన్నంగా ఆల్ ఇన్ వన్ యాప్ ను తయారు చేశారు. ఈ బాబ్ రైడ్ యాప్ మీ ఫోన్ లో ఉంటే చాలు సునాయసంగా, తక్కువ రేటుకు ప్రయాణించవచ్చు. ఇకనుంచి తమ మొబైల్ ఫోన్ లో ఊబర్, ఓలా, రాపిడో, నమ్మయాత్రి యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండనే ఉండదు. గత నెలలో ఆవిష్కరించిన ఈ యాప్ లో సునాయసంగా, తక్కువ ధరకు రైడ్ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ యాప్ లో నిర్ణీత గమ్యస్థానానికి ఏ సంస్థ కు ఎంత రేటు చెల్లించాలనేది సూచిస్తుంది. తక్కువ రేటుకు వచ్చే వారిని ఎంపిక చేసుకుని ప్రయాణం చేయవచ్చు.
కర్నాటకలోని క్రైస్త్ యూనివర్సిటీలో చదువుకున్న జై ఆదిత్య పూర్ణ కు తొలుత ఈ యాప్ ను తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. ప్రతి రోజు యూనివర్సిటీ వెళ్ళేందుకు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చేది. దీంతో తక్కువ రేటుకు వచ్చేవారి కోసం ఓలా, ఊబర్, రాపిడో యాప్ లను చూసి పోల్చుకోవాల్సిన సమస్య ఉండేది. దీనికి సమయం వెచ్చించడంతో పాటుగా ఆందోళన పెరిగేది. తన లాగే మెట్రో నగరాల్లో ప్రతి ఒక్కరు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నట్లు అర్థమైంది. కొన్ని సందర్భాల్లో డిమాండ్ పేరుతో బాదుడు బాదుతున్నారు కూడా. మల్టీ క్యాబ్ యాప్ లను ఒకే యాప్ నుంచి చూసుకునే విధంగా ఒక ఆలోచన చేసి, ఆ ప్రాజెక్టు వివరాలను మైక్రోసాఫ్ట్ కంపెనీకి జూన్ 2024 లో పంపించాడు. ఈ ప్రాజెక్టు నచ్చడంతో మైక్రోసాఫ్ట్ రూ.2 కోట్ల గ్రాంట్ మంజూరు చేసిందని ఆదిత్య పేర్కొన్నాడు. ఈ గ్రాంట్ మొత్తం అందడంతో యాప్ రూపకల్పన ఈజీ అయిందన్నారు.
తనకు మార్కెటింగ్, ఆపరేషన్స్ పై అనుభవం ఉందని , టెక్నికల్ గా అంత నాలెడ్జి లేదన్నారు. తన యూనివర్సిటీకే చెందిన ఆన్ష్ అరోరా ను సంప్రదించగా, టెక్నికల్ గా సహకరించారు. యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ ద్వారా అరోరా సుమారు రూ.1 కోటి వరకు రెవెన్యూ సంపాదించాడు. సరేననడంతో ఇద్దరూ కలిసి బాబ్ రైడ్ యాప్ ను తయారు చేశారు. రైడింగ్ ధరల వ్యత్యాసం తెలియచేస్తూ, ఏది ఎంచుకోవాలో సూచిస్తూ బుకింగ్ చేసుకునే ఆఫ్షన్ కూడా చూపిస్తుంది. సింగిల్ యాప్ మూలంగా మూడు నాలుగు యాప్ లు డౌన్ లౌడ్ చేసుకోవడంతో ఏర్పడే స్టోరేజీ సమస్యను పరిష్కరిస్తుంది. బాబ్ ఈజీ అండ్ అఫర్డబుల్ రైడ్స్ ను సింపుల్ గా, పారదర్శకంగా, అందుబాటు రేటు లో ప్రతి ఒక్కరికి సౌకర్యవంతమైన ప్రయాణం లభించే విధంగా రూపొందించామని ఆదిత్య, అరోరా వెల్లడించారు.