Site icon vidhaatha

RBI MPC | వరుసగా పదోసారి యథావిధిగా రెపోరేటు.. ఈఎంఐలపై తగ్గిన భారం.. సామాన్యులకు మళ్లీ నిరాశే..!

RBI MPC | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) మానిటరీ పాలసీ కమిటీ పాలసీ (Monetary Policy Committee) వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. ఎంపీసీ 51వ సమావేశంలో చర్చించిన తర్వాత రెపో రేటును 6.5 శాతం వద్దనే యథావిధిగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నది. మూడు రోజుల ఎంసీసీ సమావేశం అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) గురువారం రెపోరేటును ప్రకటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న రెపోరేటును యథావిధిగా కొనసాగించేందుకు ఎంపీసీ సభ్యులు అంగీకరించారన్నారు. అయితే, ఆర్‌బీఐ రెపోరేటును యథావిధిగా కొనసాగించడం ఇది పదోసారికావడం విశేషం. ఇక ప్రస్తుతం గృహ రుణాల ఈఎంఐలో ఎలాంటి మార్పులు ఉండబోవని ఆర్‌బీఐ ఎంపీసీ నిర్ణయంతో స్పష్టత వచ్చింది.

ఆర్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అంచనాను 7.2శాతంగా కొనసాగించింది. ఫ్లెక్సిబుల్‌ మానిటరీ పాలసీ ఫ్రేమ్‌ వర్క్‌ ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుందుని.. ఇది పెద్ద నిర్మాణాత్మక సంస్కరణ అని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్‌బీఐ బెంచ్‌మార్క్ వడ్డీ రేటును వరుసగా 10వ సారి 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచిందని ఆయన చెప్పారు. సాధారణ రుతుపవనాలుగా భావించి 2025 ఆర్థిక సంవత్సరంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.5శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. రుతుపవనాల సీజన్‌ కలిసిరావడం, తగినంత బఫర్‌ స్టాక్‌ ఉండడంతో ఈ ఏడాది చివరలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గుతుందని శక్తికాంత దాస్‌ తెలిపారు. వడ్డీ రేట్లపై యథాతథ స్థితిని కొనసాగించేందుకు మానిటరీ పాలసీ కమిటీలోని ఐదుగురు సభ్యులు అంగీకరించారని.. ఒకరు వ్యతిరేకించినట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ పేర్కొన్నారు. భారతీయ బ్యాంకుల ప్రమాణాలు బలంగానే ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ తెలిపారు.

అయినప్పటికీ రుణాలు, క్రెడిట్ కార్డ్ బకాయిలపై బ్యాంకులకు హెచ్చరికలు జారీ చేశారు. రెపో రేటు అనేది వాణిజ్య బ్యాంకులు తమ తక్షణ అవసరాలను తీర్చడానికి సెంట్రల్ బ్యాంక్ నుంచి తీసుకునే వడ్డీ రేటు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్‌బీఐ దీన్ని ఉపయోగిస్తుంది. రెపో రేటు మారకుండా ఉండడంతో ఇల్లు, వాహనాలు సహా వివిధ రుణాలపై నెలవారీ వాయిదాలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రపంచ స్థాయిలో సవాళ్లు ఉన్నప్పటికీ, దేశ ఆర్థిక పునాది బలంగా ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ (స్థూల జాతీయోత్పత్తి) వృద్ధి రేటు 7.2 శాతంగా అంచనా చేశారు. దీనితో పాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. ఈ నెల 7 నుంచి గురువారం వరకు ఎంపీసీ మీటింగ్‌పై మార్కెట్‌ వర్గాలు దృష్టి సారించారు. ఇంతకు ముందు తొమ్మిది సమావేశాల్లోనూ రెపోరేటును 6.50శాతంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నది.

Exit mobile version