భారీగా బంగారాన్ని విక్రయించిన ఆర్బీఐ ?

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారత విదేశీ మారక నిల్వలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న క్రమంలో ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. బ్లూమ్‌బెర్గ్ ఎకనామిక్స్ సీనియర్ ఇండియా ఎకనామిస్ట్ అభిషేక్ గుప్తా విశ్లేషణ ప్రకారం.. మే 22తో ముగిసిన రెండు వారాల వ్యవధిలో ఆర్‌బిఐ సుమారు $12 బిలియన్ల (దాదాపు రూ. 1.14 లక్షల కోట్లు) విలువైన బంగారాన్ని విక్రయించినట్లుగా సమాచారం.

విధాత : పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారత విదేశీ మారక నిల్వలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న క్రమంలో ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. యుద్ద ఉద్రిక్తతల ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థను నష్టపరుచకుండా ఉండేందుకు, తరిగిపోతున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలను పెంచుకునేందుకు, అలాగే తమ విదేశీ మారక ద్రవ్య ఆస్తులను కాపాడుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తన బంగారు నిల్వల్లో కొంత భాగాన్ని విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ ఆర్థిక విశ్లేషణా సంస్థ ‘బ్లూమ్‌బెర్గ్ ఎకనామిక్స్’ తన తాజా నివేదికలో వెల్లడించింది.

బ్లూమ్‌బెర్గ్ ఎకనామిక్స్ సీనియర్ ఇండియా ఎకనామిస్ట్ అభిషేక్ గుప్తా విశ్లేషణ ప్రకారం.. మే 22తో ముగిసిన రెండు వారాల వ్యవధిలో ఆర్‌బిఐ సుమారు $12 బిలియన్ల (దాదాపు రూ. 1.14 లక్షల కోట్లు) విలువైన బంగారాన్ని విక్రయించింది. ఇదే కాలంలో కేంద్ర బ్యాంకు సుమారు $7.5 బిలియన్ల విలువైన విదేశీ మారక ద్రవ్య ఆస్తులను (డాలర్లు వంటివి) కొనుగోలు చేసింది. అయితే ఈ బంగారం విక్రయాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయకపోవడం గమనార్హం.

ప్రభుత్వం విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచినప్పటికీ ఆర్‌బిఐ వద్ద ఉన్న బంగారు నిల్వల విలువ తగ్గడం గమనార్హం. సాధారణ పరిస్థితులలో దిగుమతి సుంకాల పెంపు వల్ల బ్యాంకు వద్ద ఉన్న బులియన్ ,డాలర్ల విలువ పెరగాలి, కానీ ఇక్కడ విలువ తగ్గడం కారణంగా ఆర్బీఐ నిశ్శబ్దంగా బంగారాన్ని విక్రయించిందనడానికి బలమైన సూచనగా ఆ నివేదిక పేర్కొంది.

అందుకే ఆర్బీఐ బంగారం అమ్మేసిందా..?

పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో ఆర్‌బిఐ బంగారం విక్రయించి నగదు నిల్వలను పెంచుకోవడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి పాక్షికంగా మూసివేయబడటం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు విపరీతంగా పెరిగిపోవడం. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన భారతదేశం, ముడిచమురు కొనుగోళ్ల కోసం తన విదేశీ మారక నిల్వలను వేగంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.

రెండవది చమురు ధరల భారం వల్ల భారతదేశ కరెంట్ ఖాతా లోటు పెరిగి, దేశీయ కరెన్సీ అయిన రూపాయిపై తీవ్ర ఒత్తిడి పడింది. మే 20న రూపాయి ఆల్‌టైమ్ లోకి పడిపోగా, ప్రస్తుతం రూపాయి డాలర్‌తో పోలిస్తే 95.17 వద్ద ట్రేడవుతోంది. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు కేంద్ర బ్యాంకుకు తక్షణ నిధులు అవసరమయ్యాయి.

మూడవది మార్కెట్ అస్థిరతను అదుపు చేయడానికి మరియు దిగుమతిదారుల డాలర్ డిమాండ్‌ను తీర్చడానికి కేంద్ర బ్యాంకుకు ప్రస్తుతం బంగారం కంటే త్వరగా చలామణి అయ్యే విదేశీ కరెన్సీలు (ముఖ్యంగా అమెరికా డాలర్) అవసరం. అందుకే తక్షణ ద్రవ్యత లేదా లిక్విడిటీ కోసం బంగారం విక్రయానికి మొగ్గు చూపినట్లుగా నివేదిక అంచనా వేసింది.

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం మార్చి నెలాఖరు నాటికి ఆర్బీఐ వద్ద మొత్తం 880.52 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది. ఈ మొత్తం నిల్వల్లో 77 శాతం బంగారాన్ని ఆర్బీఐ మన దేశీయ ఖజానాలలోనే భద్రపరిచింది. ఆరు నెలల క్రితం వరకు భారతదేశంలో కేవలం 66 శాతం బంగారం మాత్రమే ఉండేది. మిగిలిన నిల్వలను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వద్ద విదేశాలలో ఉంచేవారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాకు చెందిన విదేశీ ఆస్తులను స్తంభింపజేయడంతో ఆర్బీఐ సహా పలు వర్ధమాన దేశాల కేంద్ర బ్యాంకులు అప్రమత్తమయ్యాయి. భౌగోళిక రాజకీయ ప్రమాదాల నుండి తమ సంపదను రక్షించుకోవడానికి విదేశాల్లో దాచిన తమ బంగారాన్ని వేగంగా స్వదేశానికి తరలించే ప్రక్రియలో భాగంగా కొద్ది రోజుల క్రితం భారత్ కూడా విదేశాల్లోని బంగారాన్ని స్వదేశానికి రప్పించిన సంగతి తెలిసిందే.

 

Latest News