Elon Musk | ఎలాన్‌ మస్క్‌ భారత పర్యటన వాయిదా.. ఎందుకంటే..!

Elon Musk | అగ్రరాజ్యం అమెరికాకు చెందిన అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ భారత పర్యటన వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మస్క్‌.. ఇవాళ, రేపు (ఏప్రిల్‌ 21, 22) భారత్‌లో పర్యటించాల్సి ఉండె. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీతో ఎలాన్‌ మస్క్‌ భేటీ కూడా ఖరారయ్యింది. కానీ అకస్మాత్తుగా మస్క్‌ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.

  • By: Thyagi |    business |    Published on : Apr 21, 2024 8:56 AM IST
Elon Musk | ఎలాన్‌ మస్క్‌ భారత పర్యటన వాయిదా.. ఎందుకంటే..!

Elon Musk : అగ్రరాజ్యం అమెరికాకు చెందిన అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ భారత పర్యటన వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మస్క్‌.. ఇవాళ, రేపు (ఏప్రిల్‌ 21, 22) భారత్‌లో పర్యటించాల్సి ఉండె. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీతో ఎలాన్‌ మస్క్‌ భేటీ కూడా ఖరారయ్యింది. కానీ అకస్మాత్తుగా మస్క్‌ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.

టెస్లా కంపెనీ బాధ్యతలకు సంబంధించిన ఒత్తిడి దృష్ట్యానే తాను భారత పర్యటనను వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని మస్క్‌ తన ‘ఎక్స్‌’ హ్యాండిల్‌ ద్వారా వెల్లడించారు. మరికొన్ని నెలల తర్వాత తాను భారత్‌లో పర్యటిస్తానని తెలిపారు. ఈ నెల 23న (మంగళవారం) టెస్లా ఆర్థిక ఫలితాలపై సమావేశం ఉన్నందున భారత పర్యటనను వాయిదా వేసుకున్నట్లు మస్క్‌ వెల్లడించారు.

మస్క్‌ భారత పర్యటన సందర్భంగా టెస్లా కంపెనీ భారత్‌లో ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించే ప్రణాళికలను ప్రకటిస్తారని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదేవిధంగా తన స్టార్‌లింక్‌ ద్వారా శాటిలైట్‌ ఇంటర్నెట్‌ వ్యాపారాన్ని భారత్‌కు విస్తరించే ఆలోచనలోనూ మస్క్‌ ఉన్నారు. కానీ అనూహ్యంగా ఆయన భారత పర్యటనను వాయిదా వేసుకున్నారు.

కాగా, మస్క్‌ పర్యటన వాయిదాపై కాంగ్రెస్‌ స్పందించింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని మస్క్‌ ముందుగానే గ్రహించారని, పదవి నుంచి దిగిపోయే మోదీతో భేటీకి అంతదూరం వెళ్లడం ఎందుకని తన పర్యటనను వాయిదా వేసుకున్నారని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’ లో వ్యాఖ్యానించారు.