Megastar Chiranjeevi : రాజకీయాలకు దూరం..సోషల్ మీడియాను పట్టించుకోను
రాజకీయాలకు దూరంగా ఉన్నానని, సోషల్ మీడియా ట్రోల్స్‌ను పట్టించుకోనని చిరంజీవి స్పష్టం చేశారు. మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌లో భావోద్వేగం!

Megastar Chiranjeevi | విధాత, హైదరాబాద్: రాజకీయాలకు తాను పూర్తిగా దూరంగా ఉన్నానని కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో చిరంజీవి భేటీ నేపథ్యంలో ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోతున్నారన్న ప్రచారానికి చిరు తన వ్యాఖ్యలతో తెరదించారు. చిరంజీవి బ్లడ్ బాంక్, ఫీనిక్స్ ఫౌండేషన్ కలిసి ప్రారంభించిన మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. హీరోయిన్ సంయుక్తా మీనన్, తేజ సజ్జా సహా పలువురు నటులు రక్తదానం కార్యక్రమానికి హాజరయ్యారు. తేజ సజ్జా స్వయంగా రక్తదానం చేశారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడారు.
విమర్శలకు మంచి పనులే సమాధానం
నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ పలువురు తనపై ఆకారణంగా నోరు పారేసుకుంటున్నారని, సోషల్ మీడియాలో అవాకులు చవాకులు చేస్తున్నారని చిరంజీవి అవేదన వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శలు..సోషల్ మీడియా విమర్శలు తాను పెద్దగా స్పందించబోనన్నారు. ఇటీవల ఓ నాయకుడు అనవసరంగా నాపై విమర్శలు చేశారని..అనంతరం ఆ నాయకుడిపై అక్కడి ప్రాంతానికే చెందిన మహిళ ఎదురు తిరిగి చిరంజీవిని అన్ని మాటలు ఎలా అనగలుగుతున్నారంటూ ప్రశ్నించిన వీడియోను చూశానన్నారు. ఆ మహిళ గురించి వాకబు చేస్తే ఒకప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఆమె బిడ్డ ప్రాణం నిలబడిందని తెలిసిందన్నారు. అందుకే ఆ మహిళకు నాపై గౌరవం ఏర్పడిందని, ఆ వార్త తెలిసి నా హృదయం ఉప్పొంగి పోయిందంటూ భావోద్వేగం చెందారు. ఈ ఘటన తర్వాత నుంచి ఆ నాయకుడు తిరిగి మళ్లీ తనపై ఎలాంటి విమర్శలు చేయలేదని, వారు కూడా ఇంటికి వెళ్లాక నా గురించి ఆలోచించి నేనెలాంటి వాడినో గుర్తెరిగి విమర్శలు చేయరని అన్నారు. ఇప్పుడైనా..ఎప్పుడైనా మనం చేసే పనులే మాట్లాడుతాయన్నారు. తనపై చెడు రాసేవారికి..మాట్లాడే వారిని నేను చేసే మంచి పనులే సమాధానమని స్పష్టం చేశారు.
అభిమానులే సర్వస్వం
సోషల్ మీడియాలో వచ్చే వాటిని అసలు పట్టించుకోనని, నాకు అంత సమయం కూడా ఉందని అభిమానులే నాకు సర్వం అని చిరంజీవి అన్నారు. తన గురించి ఎవరెం మాట్లాడుకున్నా, సామాజిక మాధ్యమాల్లో అదే పనిగా ట్రోల్స్ చేసినా నేను స్పందించనని నేను చేసిన పనులు, మంచి మాత్రమే మాట్లాడుతుంటాయని చిరంజీవి అన్నారు. రక్తదానం గురించి చెప్పగానే తన పేరు గుర్తుకొస్తున్నదంటే అది నా పూర్వ జన్మ పుణ్యమని అన్నారు. గతంలో.. ఒక జర్నలిస్ట్ రాసిన కథనం చదివాకే రక్తదానం బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చిందని.. ఇంతవరకు ఆ జర్నలిస్టు ఎవరో మాత్రం తనకు తెలియలేదన్నారు. తాజాగా తేజా సజ్జా వంటి యువ నటులు రక్తదానానికి ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. నాకు బిడ్డ లాంటి తేజా.. బ్లడ్ డొనేట్ చేసినందుకు థాంక్స్ చెబుతున్నానన్నారు. నాపై అభిమానంతో ఇక్కడే గాక ఇతర ప్రాంతాలు, దేశాల్లోనూ రక్తదానం చేస్తున్న వారికి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.