Kavitha Yatra Without KCR Photo | కేసీఆర్ ఫోటో లేకుండానే నా తెలంగాణ యాత్ర : కవిత
కేసీఆర్ ఫోటో లేకుండా తెలంగాణ యాత్ర ప్రారంభిస్తున్నట్లు కవిత ప్రకటించారు. సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా జాగృతి జనం బాట యాత్ర చేపట్టనున్నారు.

విధాత, హైదరాబాద్ : కేసీఆర్ ఫోటో లేకుండానే తెలంగాణలో నేను ప్రజాయాత్ర చేపట్టనున్నట్లుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ బహిష్కృత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తాను చేపట్టనున్న జాగృతి జనం బాట యాత్ర పోస్టర్లను కవిత బుధవారం మీడియా సమావేశంలో ఆవిష్కరించి మాట్లాడారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడని.. బీఆర్ఎస్ పార్టీ అధినేత అని..ఆ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేసిన నేపథ్యంలో నేను ఆయన ఫోటో పెట్టుకుని యాత్ర చేయడం నైతికత కాదన్నారు. అందుకే కేసీఆర్ ఫోటో లేకుండానే నేను యాత్ర చేస్తానని స్పష్టం చేశారు. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ ఫోటోని వాడుకోవడం నైతికంగా నాకు సరికాదు అన్నారు. నా నిర్ణయంతో కేసీఆర్‌ని అగౌరవపరచడం లేదు అన్నారు. చెట్టు పేరు చెప్పుకుని పండ్లు అమ్ముకునే ఆలోచన నాకు లేదన్నారు. ఆ చెట్టు నీడలో ఉన్నప్పుడు నేను ఆ చెట్టును కుట్రదారులు, దుర్మార్గుల నుంచి కాపాడాలని అనేక ప్రయత్నాలు చేసి చివరకు సస్పెండ్ కావడం జరిగిందన్నారు. దారులు వేరు అయినప్పుడు కేసీఆర్ ఫోటో పెట్టుకోవడం సరికాదని నేను భావిస్తున్నానని కవిత చెప్పుకొచ్చారు. భౌగోళిక తెలంగాణ వచ్చిందని..సామాజిక తెలంగాణ సాధించుకోవాలని అన్నందుకే నన్ను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారన్నారు.
జాగృతి జనం బాట పేరుతో యాత్ర : కవిత
సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా జాగృతి బలోపేతం కోసం తెలంగాణ వ్యాప్తంగా యాత్ర నిర్వహిస్తున్నట్లుగా కవిత వెల్లడించారు. జాగృతి జనం బాట పేరుతో యాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఆక్టోబర్ 25నుంచి ఫిబ్రవరి 13వరకు యాత్ర నాలుగు నెలల పాటు కొనసాగుతుందని తెలిపారు. సామాజిక తెలంగాణ అనేది నినాదం కాదని..విధానం అని..ఈ విధానం కోసం నేను, తెలంగాణ జాగృతి అహర్నిశలు పని చేస్తుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మించిన గురువులు లేరని..అందుకే జాగృతి తరుఫున నేను ప్రజల వద్ధకు వెళ్లాలని నిర్ణయించుకున్నానన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజలను కలిసి వారి సమస్యలు తెలసుకుని పరిష్కార కోసం పోరాటం చేయాలన్న ఆలోచనతోనే నేను తెలంగాణ ప్రజా యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నానన్నారు. యాత్రలో భాగంగా మహిళలు, యువత, రైతులు సహా అన్ని వర్గాల ప్రజలను కలుస్తానని.. మేధావులతో సమాలోచన, ప్రజలతో మమేకం అవుతామన్నారు. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీకి అవకాశం ఉందా లేదా అన్నదానిపై కూడా తన యాత్రలో స్పష్టత వస్తుందని కవిత వెల్లడించారు. షెడ్యూల్ మేరకు ప్రతి జిల్లాలో రెండు రోజులు యాత్ర కొనసాగుతుందని ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు తమ హక్కులను పొందినప్పుడే సామాజిక తెలంగాణ సాకారమవుతుంది. అందుకోసం తెలంగాణ జాగృతి నిరంతరం పనిచేస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీనే వదిలేశానని..నాకు ఎమ్మెల్సీ పదవి ఎందుకని కవిత ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు. నా ఎమ్మెల్సీ పదవి రాజీనామాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆమోదింపచేయడం లేదో నాకు అర్ధం కావడం లేదన్నారు. నా రాజీనామా ఆమోదిస్తే వారి పార్టీకి చెందిన వారి రాజీనామాలు ఆమోదించాల్సి వస్తుందన్న ఆందోళనతో వారు నా రాజీనామాను పెండింగ్ లో పెట్టినట్లున్నారని కవిత వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో తెలంగాణ జాగృతికి సంబంధం లేదని కవిత పేర్కొన్నారు.