లారీ- కంటైయినర్ ఢీ.. చెలరేగిన మంటలు.. నలుగురు మృతి

- నలుగురు దుర్మరణం.. ఇద్దరికి గాయాలు
- మృతుల్లో ఇద్దరు మైనర్లు.. ఫుణెలో ఘటన
- లారీకి బ్రేకులు ఫెయిల్ కావడమే కారణం
విధాత: మహారాష్ట్రలోని పూణెలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. బ్రేక్ ఫెయిల్ అయిన లారీ కంటెయినర్‌ను ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు మైనర్లు సహా నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
పోలీసుల వివరాల ప్రకారం.. పూణె-బెంగళూరు హైవేపై స్వామినారాయణ దేవాలయం-నవ్లే వంతెన సమీపంలో సోమవారం రాత్రి 09.30 గంటల సమయంలో బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా ట్రక్కు కంటైనర్‌ను ఢీకొట్టింది. ఆపై మరో ట్రక్కును ఢీకొట్టింది. ఈ క్రమంలో లారీకి మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న పూణె మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
కాలిపోతున్న ట్రక్కు నుంచి బాధితుల మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఘటన జరిగినప్పుడు ట్రక్కులో మొత్తం ఆరుగురు ఉన్నారు. వారిలో నలుగురు మరణించారు. మరో ఇద్దరు ట్రక్కు నుంచి దూకి తప్పించుకోగలిగారు. వారు కూడా ప్రమాదంలో గాయపడ్డారు. అయితే, బాధితులను ఇంకా గుర్తించలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు జరపుతున్నట్టు పేర్కొన్నారు.