Maharashtra | పుణె కార్పొరేషన్ ఎన్నికల్లో పవార్లతో షిండే కూటమి?
మహారాష్ట్రలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే సేన బ్రదర్స్ ఏకం కాగా.. పవార్ గ్రూపులు కూడా ఒక తాటిపైకి వచ్చాయి. విచిత్రం ఏమిటంటే.. షిండే సేన సైతం పవార్లతో చేతులు కలుపుతుందన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. రాబోయే రోజుల్లో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపులకు ఈ కార్పొరేషన్ ఎన్నికలు మార్గం సుగమం చేస్తాయా? అనేది చర్చనీయాంశంగా మారింది.
Maharashtra | మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కొత్త కూటములు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం మహాయుతిలో ఉన్న ఏక్‌నాథ్ షిండే.. బీజేపీకి వ్యతిరేకంగా పవార్ల కూటమితో చేతులు కలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే శివసేన (ఉద్ధవ్), మహారాష్ట్ర నవ నిర్మాణ సేన నేతలు ఉద్ధవ్ ఠాక్రె, రాజ్ ఠాక్రె ఒకేవేదికపై వచ్చిన విషయం తెలిసిందే. పుణె మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) ఎన్నికల నేపథ్యంలో షిండే సైతం పవార్లతో జతకడుతున్నారు. శివసేన నాయకుడు రవీంద్ర ధంగేకర్ సోమవారం ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ చీఫ్ అజిత్‌పవార్‌ను కలిశారు. అయితే కూటమి మార్పులపై స్పందించలేదు. ఈ విషయాన్ని పార్టీ చీఫ్ షిండే డిసైడ్ చేస్తారని తెలిపారు. ‘పార్టీ కార్యకర్తలు అజిత్‌పవార్‌ను కలవాలని కోరుకున్నారు. కూటముల గురించి ఎలాంటి డిస్కషన్స్ చోటు చేసుకోలేదు. ఏక్‌నాథ్ షిండే చర్చలు జరుపుతారు. ఆయనే నిర్ణయం తీసుకుంటారు’ అని ధంగేకర్ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
ఇదిలాఉంటే.. శివసేన పుణె సిటీ చీఫ్ ప్రమోద్ భాంగిరే మంగళవారం ఏకంగా నగర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండబోదని ప్రకటించేశారు. అయితే.. ఎన్సీపీ గ్రూపులతో చేతులు కలిపే అంశం గురించి మాత్రం ఆయన ఏమీ చెప్పలేదు. ఇప్పటికే పుణె, పింప్రి–చించ్వాద్ ఎన్నికల కోసం ఎన్సీపీ గ్రూపులు ఏకమైన విషయం తెలిసిందే. రెండు పార్టీలు తమ సొంత గుర్తులపైనే పోటీ చేస్తాయని ఎన్సీపీ–ఎస్పీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ మీడియాకు తెలిపారు. అయితే.. కూటమికి సంబంధించిన నిర్ణయాల్లో ఎన్సీపీ – ఎస్పీ కురువృద్ధ నేత శరద్‌పవార్ జోక్యం ఏమీ లేదని ఆయన వ్యాఖ్యానించడం ఆసక్తి రేపుతున్నది.
‘పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత పుణెలోని కార్యకర్తలతో సుప్రియా సూలె స్వయంగా మాట్లాడారు. అదే సమయంలో పింప్రి–చించ్వాడ్ కార్యకర్తలతోనూ చర్చించారు. వారి అభిప్రాయాలు, వారి ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత పుణె, ప్రింప్రి–చించ్వాడ్‌లలో ఎన్సీపీ ఉభయ గ్రూపులు కలిసి పనిచేయాలని నిర్ణయించడమైనది. అయితే.. రెండు పార్టీలు తమ సొంత గుర్తులపైనే ఎన్నికల్లో పోటీ చేస్తాయి’ అని రోహిత్ పవార్ తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియలో పవార్ ఇన్‌వాల్వ్ కాలేదని ఆయన చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ లాంటి చిన్న పరిధి కలిగిన ఎన్నికల్లో ఆయన అంతటి పెద్ద నాయకులు జోక్యం చేసుకోరని రోహిత్ అన్నారు. మనకోసం కష్టపడేవారి అభిప్రాయాలు వినాలి, అర్థం చేసుకోవాలని అనే ఆయన చెప్పారని తెలిపారు. ఆ మేరకు పార్టీ కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram