T20 CWC-IND vs NAM | నమీబియాపై భారత్ ఘన విజయం – టీ20 వరల్డ్‌కప్‌లలో అతిపెద్ద గెలుపు
న్యూఢిల్లీలో నమీబియాపై భారత్ 93 పరుగుల భారీ విజయం సాధించి టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో పరుగుల తేడా పరంగా అతిపెద్ద గెలుపు నమోదు చేసింది. కిషన్ పేలుడు, పాండ్యా దూకుడు, వరుణ్ తిప్పుడుతో విజయం అలవోకగా భారత్‌ను వరించింది.
India Crush Namibia by 93 Runs in Delhi, Register Biggest T20 World Cup Win
సారాంశం: భారత్ అతిపెద్ద విజయం
కిషన్ 61 (24), పాండ్య 52 (28) & 2/21, వరుణ్ 3/7 ల అద్భుత ప్రదర్శనతో భారత్ 209 పరుగుల భారీ స్కోరు చేసి నమీబియాను 116కే కట్టడి చేసింది. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో పరుగుల తేడా పరంగా భారత్‌కు ఇది అతిపెద్ద గెలుపు.
- ఇషాన్ కిషన్, పాండ్యాల విధ్వంసం
- భారత స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకున్న నమీబియా
- పరుగుల తేడా పరంగా భారత్ రికార్ఢు విజయం
- అత్యధిక నెట్ రన్‌రేట్‌తో గ్రూప్‌లో అగ్రస్థానం
- తదుపరి మ్యాచ్ పాకిస్థాన్‌తో ఆదివారం నాడు
విధాత క్రీడా విభాగం | హైదరాబాద్:
T20 CWC-IND vs NAM | న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన టి20 ప్రపంచకప్ గ్రూప్-A మ్యాచ్‌లో భారత్ నమీబియాపై 93 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇది టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో పరుగుల తేడా పరంగా భారత్‌కు అతిపెద్ద విజయం. వరుసగా రెండో గెలుపుతో భారత్ గ్రూప్ దశలో 4 పాయింట్లతో, అత్యధిక నెట్ రన్‌రేట్‌తో అగ్రస్థానానికి చేరుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 209 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య చేధనలో నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌట్ అయింది.
అనుభవ రాహిత్యంతో కుప్పకూలిన నమీబియా
209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా పవర్‌ప్లేలో ఒక వికెట్ కోల్పోయి 57 పరుగులు చేసి బాగానే ఆడినా, ఆ తరువాత పెద్ద భాగస్వామ్యాలు లేకపోవడంతో ఒత్తిడిలో పడింది. ఒక దశలో 2 వికెట్లకు 67 పరుగులతో ఉన్న నమీబియా, 94 పరుగులకే 6 వికెట్లకు చేరింది. ఆ తర్వాత అలౌట్ కావడానికి ఎంతోసేపు పట్టలేదు. చివరికి 18.2 ఓవర్లలో 116 పరుగులకు నమీబియా తన ఆట ముగించింది. లారెన్ స్టీన్‌క్యాంప్ 29 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
భారత స్పిన్నర్లు నమీబియాను పూర్తిగా తిప్పేసారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి రెండే ఓవర్లలో 7 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకోవడంతో ప్రత్యర్థి జట్టు కోలుకోలేకపోయింది. బ్యాటింగ్‌లో చెలరేగిన హార్దిక్ పాండ్య బంతితో కూడా 2 వికెట్లతో మెరిసాడు. 18.2 ఓవర్లలోనే నమీబియా 116 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ 93 పరుగుల ఘన విజయం సాధించింది.
ఎదురుదాడే భారత్ మంత్రం
అంతకుముందు టాస్ గెలిచిన నమీబియా బౌలింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 209 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. పవర్‌ప్లేలోనే దూకుడుగా ఆడిన ఓపెనర్లు పటిష్టమైన పునాది వేయగా, మధ్య ఓవర్లలో కూడా వేగం తగ్గకుండా నిలబెట్టడం ఈ ఇన్నింగ్స్ ప్రత్యేకతగా నిలిచింది.
ఈ మ్యాచ్‌లో ఎదుకుదాడికి దిగాలన్న భారత బ్యాటర్ల ధోరణి స్పష్టంగా కనిపించింది. ఒక్కో బౌలర్‌ను లక్ష్యంగా చేసుకుంటూ స్ట్రైక్ రేట్ 200 దాటేలా పద్ధతిగా ఆడిన తీరు ప్రత్యర్థిపై తీవ్ర ఒత్తిడి కలిగించింది. అయితే ఆఖరి ఓవర్లలో పట్టు కోల్పోయినా, అప్పటికే స్కోరు భారీ లక్ష్యానికి దారితీసింది.
కిషన్ పేలుడుకు దద్దరిల్లిన స్టేడియం – పాండ్యా హాఫ్ సెంచరీ

ఓపెనర్ ఇషాన్ కిషన్ ఎప్పటిలాగే ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించాడు. కేవలం 20 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసిన కిషన్ 24 బంతుల్లో 61 పరుగులు చేసి మ్యాచ్‌కు భారీ స్కోరు పునాది వేసాడు. భారత్ ఏడో ఓవర్‌లోనే 100 పరుగులు దాటిందంటే అది కిషన్ చలవే. అభిషేక్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ 8 బంతుల్లో 22 పరుగులతో మంచి ఊపుతో ఆరంభం అందించాడు. మధ్యలో శివం దూబే 16 బంతుల్లో 23 పరుగులు చేసి నిలకడగా ఆడగా, హార్థిక్ పాండ్యా 28 బంతుల్లో 52 పరుగులు చేసి విధ్వంసం కొనసాగించాడు. పాండ్యా–దూబే జోడీ ఐదో వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది.
నమీబియా కెప్టెన్ గెరార్డ్ ఎరామస్ (Gerhard Erasmus) అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లతో భారత్‌కు అడ్డుకట్ట వేశాడు. లేకపోతే భారత్ స్కోరు 250 దాటేది. కిషన్, తిలక్ వర్మ, పాండ్యాల కీలక వికెట్లు తీసి చివరి ఓవర్లలో ఒత్తిడి తెచ్చాడు. అయినా భారత్ 209/9 భారీ స్కోరు సాధించింది.
గ్రూప్‌లో భారత్ ఆధిపత్యం
గ్రూప్-Aలో తొలి మ్యాచ్‌లో అమెరికాను ఓడించిన భారత్, ఇప్పుడు నమీబియాపై భారీ విజయం సాధించింది. తదుపరి హై-ప్రొఫైల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో కొలంబోలో తలపడనుంది. దానికి ముందు ఈ మ్యాచ్‌లో భారీ గెలుపు ద్వారా తన నెట్ రన్‌రేట్‌ను కూడా భారీగా పెంచుకుంది. 4 పాయింట్లతో, +3.05 రన్‌రేట్‌తో పాకిస్థాన్‌ను అధిగమించి గ్రూప్–Aలో అగ్రస్థానానికి చేరుకుంది. టోర్నీలో 20 జట్లు పాల్గొంటున్న నేపథ్యంలో భారత్ ప్రదర్శన అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తోంది.
భారత్‌కు టీ20 వరల్డ్‌కప్‌లలో అతిపెద్ద విజయాలు (పరుగుల తేడా)
- 93 పరుగులు vs నమీబియా, ఢిల్లీ, 2026
- 90 పరుగులు vs ఇంగ్లాండ్, కొలంబో RPS, 2012
- 73 పరుగులు vs ఆస్ట్రేలియా, మిర్‌పూర్, 2014
- 71 పరుగులు vs జింబాబ్వే, మెల్‌బోర్న్, 2022
- 68 పరుగులు vs ఇంగ్లాండ్, ప్రావిడెన్స్, 2024 సెమీ ఫైనల్
సంక్షిప్త స్కోర్లు:
భారత్: 209/9 (20 ఓవర్లు) – ఇషాన్ కిషన్ 61(5 సిక్స్‌లు, 6 ఫోర్లు), హార్దిక్ పాండ్యా 52(4 సిక్స్‌లు, 4 ఫోర్లు); ఎరాస్మస్ 4/20
నమీబియా: 116 ఆలౌట్ (18.2 ఓవర్లు) – స్టీన్‌క్యాంప్ 29; వరుణ్ 3/7.
కాగా, గ్రూప్–A లో భారత్, గ్రూప్–Bలో శ్రీలంక, గ్రూప్–Cలో వెస్టిండీస్, గ్రూప్–Dలో న్యూజీలాండ్, తలా 4 పాయింట్లతో, అధిక రన్‌రేట్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram