Ladla Bhai Yojana | మహారాష్ట్రలో నిరుద్యోగులకు ‘లాడ్లా భాయ్ పథకం’.. నిరుద్యోగ భృతి ఎవరికి ఎంత!
ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఓటర్లను ప్రత్యేకించి యువ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో అధికార మహాయుతి ప్రభుత్వం నిమగ్నమైంది.

ముంబై: ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఓటర్లను ప్రత్యేకించి యువ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో అధికార మహాయుతి ప్రభుత్వం నిమగ్నమైంది. ఇప్పటికే బాలికలకు ‘మాఝి లడ్కి బహిన్ యోజన పేరిట అర్హులైన మహిళలకు నెలకు 1500 అందించే పథకాన్ని తీసుకొచ్చిన మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వం.. తాజాగా యువకుల కోసం నిరుద్యోగ భృతి పథకాన్ని తీసుకొచ్చింది. వారికోసం లాడ్లా భాయ్ యోజన’ తీసుకొస్తున్నట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే బుధవారం ప్రకటించారు. ఆషాఢి ఏకాదశి (తొలి ఏకాదశి) సందర్భంగా పంధార్పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఏక్‌నాథ్ షిండే.. అబ్బాయిలు, అమ్మాయిల మధ్య తమ ప్రభుత్వం ఎలాంటి వ్యత్యాసాలు చూపబోదని చెబుతూ.. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు లాడ్లా భాయ్ యోజన’ తీసుకు వస్తున్నామని ప్రకటించారు.
ఏమిటీ లాడ్లా భాయ్ పథకం.. ఎవరికి లాభం?
12వ తరగతి, ఆపైన విద్యను అభ్యసించినవారికి ఈ పథకాన్ని ఉద్దేశించారు. లబ్ధిదారుల అర్హతలను బట్టి స్టైపెండ్‌ను ఇవ్వనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ పథకం కింద 12 తరగతి పాసైన యువకులకు నెలకు 6000 ఇస్తారు. డిప్లొమా హోల్డర్లకు నెలకు 8వేలు, గ్రాడ్యయేషన్ పూర్తి చేసినవారికి నెలకు 10వేలు అందిస్తారు. దీనితోపాటు సదరు యువకులు ఏదైనా ఫ్యాక్టరీలో ఏడాదిపాటు అప్రెంటిస్‌షిప్ చేసేందుకు అవకాశం కల్పిస్తారు. దీని ద్వారా వారు ఉద్యోగం పొందేందుకు తగిన అనుభవాన్ని సంపాదించుకుంటారు.
నిపుణులైన వర్క్‌ఫోర్స్‌ను సిద్ధం చేసేందుకు ఈ పథకాన్ని ఉద్దేశించినట్టు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే చెప్పారు. ఇటువంటి పథకం ప్రవేశపెట్టడం దేశంలోనే ఇదే మొదటిసారి అని ఆయన చెప్పినట్టు ఫ్రీ ప్రెస్ జర్నల్ తెలిపింది. ఈ ఏడాది చివరిలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో షిండే ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం విశేషం.
మాఝి లడ్కి బహిన్ పథకంతో ఎవరికి లాభం?
ముఖ్యమంత్రి మాఝి లడ్కి బహిన్ యోజన కింద 21 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు అర్హులైన మహిళలకు నెలకు 1500 ఇస్తారు. మహిళ సాధికారత, అభివృద్ధి, ఆర్థిక స్వాతంత్ర్యం, ఆరోగ్యం, పోషకాహారం, తమకాళ్లపై తాము నిలబడటం కోసం ఈ పథకాన్ని తీసుకువచ్చామని ప్రభుత్వం చెబుతున్నది. జూలై నెల నుంచి అమల్లో ఉండే ఈ పథకానికి ఏటా 46వేల కోట్లు అవసరమవుతాయని అజిత్‌పవార్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో వెల్లడించారు.