బీజేపీ చెంతకు చేరితే.. బారా ఖూన్ మాఫీ! ఇదిగో తాజా నిదర్శనం!
ప్రతిపక్షంలో అవినీతిపరులుగా ఉన్నవారు.. బీజేపీలోనో లేదా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిలోనో చేరితే.. ఉన్నట్టుంది పవిత్రులైపోతారు

- అజిత్‌పవార్‌పై చీటింగ్ కేసులో పోలీసుల క్లోజర్ రిపోర్ట్
- 22వేల కోట్ల చీటింగ్ స్కామ్‌లో డిప్యూటీ సీఎం
- మార్చి 15న నివేదికపై ముంబై కోర్టు విచారణ
ముంబై: ప్రతిపక్షంలో అవినీతిపరులుగా ఉన్నవారు.. బీజేపీలోనో లేదా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిలోనో చేరితే.. ఉన్నట్టుంది పవిత్రులైపోతారు. ఉన్నట్టుండి కాకపోయినా.. కొంతకాలానికైనా వారిపై మచ్చలన్నీ తొలగిపోతాయి. సబ్బు రుద్ది ఉతికేసినట్టు మాయమైపోతాయి. తాజాగా అజిత్‌పవార్ కేసు విషయంలోనూ ఇదే జరిగిందా? జరిగిన పరిణామాలు చేస్తే అవునని అనిపించక మానదు. మొన్నటిదాకా ఎన్సీపీ నాయకుడిగా అజిత్‌పవార్ ఉన్నప్పుడు ఆయనను అవినీతిపరుడు అని బీజేపీ ముద్ర వేసింది. కానీ.. కొన్ని నెలల క్రితం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అజిత్‌పవార్ ఎన్సీపీని చీల్చి.. అప్పటి వరకూ తాను విమర్శించిన బీజేపీతో కలిసి.. మరో చీలిక పార్టీ షిండే సేన ప్రభుత్వంలో కూర్చున్నారు. నిజానికి ఆయనపై చీటింగ్ కేసు నడుస్తున్నది. మహారాష్ట్ర సహకార బ్యాంకు (ఎంఎస్‌సీబీ)ను 25వేల కోట్ల మేరకు మోసం చేశారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. అయితే.. ఇప్పుడు ఆయన బీజేపీకి మిత్రుడు. ఆర్థిక నేరాల విభాగం పోలీసులు తాజాగా ఆయనపై కేసును మూసేస్తూ నివేదిక ఇచ్చారు. అందులో వారు పేర్కొన్నదేంటో తెలుసా? వాస్తవాలు ధ్రువీకరించుకోవడంలో పొరపాట్లు జరిగాయట! మార్చి 1వ తేదీన ముంబై ఆర్థిక నేరాల విభాగం పోలీసులు ‘సీ సమ్మరీ’ పేరిట ఒక నివేదికను ముంబై కోర్టుకు సమర్పించారు. ఒక వ్యక్తిపై పొరపాటుగా అభియోగాలు నమోదు చేసినట్టు దర్యాప్తు సంస్థ అభిప్రాయానికి వచ్చిన సమయంలో సీ సమ్మరీ నివేదికను కోర్టుకు సమర్పిస్తారు. అప్పుడు కోర్టు ఆ నివేదికను ఆమోదిస్తుంది. అనంతరం సదరు వ్యక్తిపై కేసు ముగుస్తుంది. అజిత్ పవార్ విషయంలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా సమర్పించారు. దీనిపై విచారణను ముంబై సెషన్స్ కోర్ట్ స్పెషల్ జడ్జి ఆర్‌ఎన్ రోకడే మార్చి 15వ తేదీకి వాయిదా వేశారు. నివేదికను ఆమోదించడమా? తిరస్కరించడమా? అన్న విషయంలో తదుపరి విచారణ సందర్భంగా కోర్టు నిర్ణయం తీసుకోనున్నది. తిరస్కరించిన పక్షంలో మరింత దర్యాప్తు జరిపి చార్జిషీటు దాఖలు చేయాలని ఆదేశించేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి.
పోలీసుల చర్య ఆశ్చర్యకరంగా ఏమీ లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాయకులు, ప్రత్యేకించి బీజేపీలోకి జంప్ అయిన వారు లేదా ఎన్డీయే గూటికి చేరిన వారి విషయంలో ఆయా రాష్ట్రాల దర్యాప్తు సంస్థలు, కేంద్ర దర్యాప్తు సంస్థల ధోరణి దాదాపుగా ఒకే తీరుగా ఉంటుందనే వాదన ఉన్నది. ఒక కేసు విషయంలో క్లోజర్ రిపోర్టును పోలీసులు కోర్టుకు సమర్పించడం ఇదే మొదటిసారి కాదని పలువురు సీనియర్ పాత్రికేయులు గుర్తు చేస్తున్నారు.
2020లో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కూడి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆర్థిక నేరాల విభాగం మొదటిగా క్లోజర్ రిపోర్టును సమర్పించింది. అజిత్‌పవార్ అప్పుడు కూడా ఉప ముఖ్యమంత్రిగానే ఉన్నారు. అజిత్‌పవార్‌తోపాటు 70 మంది ఇతరులపై ఈ కేసులో క్లోజర్ రిపోర్టును సమర్పించారు. అయితే.. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయి, బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్థిక నేరాల విభాగం పోలీసులకు మళ్లీ ఈ కేసులో దర్యాప్తు చేయాలన్న ఆసక్తి ‘కలిగింది’. 2022 అక్టోబర్‌లో ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నట్టు పేర్కొన్నది. అది జరిగిన కొద్ది నెలలకే 2023 జూలైలో అజిత్ పవార్.. ఎన్సీపీని చీల్చి.. శివసేన, బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలిపారు. అందుకు ప్రతిఫలంగా ఆయనకు రెండో ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు. అప్పటికే బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో అజిత్‌పవార్, పలువురు ఎన్సీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఆయన వెంట నడిచారు. ఇటీవలే అజిత్‌పవార్ పార్టీ అసలైన ఎన్సీపీ అని ఎన్నికల సంఘం గుర్తిస్తూ.. పార్టీ ఎన్నికల గుర్తయిన గడియారాన్ని అజిత్ కూటమికే కేటాయించింది. దీంతో శరద్‌పవార్ తన పార్టీకి ఎన్సీపీ (శరత్‌చంద్రపవార్) అని వేరే పేరు పెట్టుకోవాల్సి వచ్చింది. అన్నీ అనుకున్నట్టు జరిగాయేమో.. చివరకు అజిత్‌పై కేసు మూసివేసేందుకు ముంబై పోలీసులు సిద్ధపడ్డారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.