Shilpa Shetty| నటి శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు

విధాత: నటి శిల్పాశెట్టి(Shilpa Shetty), రాజ్ కుంద్రా(Raj Kundra) దంపతులపై పోలీస్ కేసు నమోదైంది. వ్యాపారవేత్త దీపక్ కొఠారి(Deepak Kothari)ని రూ.60 కోట్ల మేర మోసం(Fraud Case) చేసినట్లు వారిపై అభియోగాలు నమోదయ్యాయి. బాధితుడి జుహు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు చేశారు. కేసును దర్యాప్తును ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యు)కి అప్పగించారు. 2015- 2023 వరకు ఓ వ్యాపార ఒప్పందం నిమిత్తం రూ.60.48 కోట్లు వారికి ఇచ్చానని, కానీ ఆ డబ్బును వ్యక్తిగత ఖర్చులకు ఉపయోగించుకున్నారని దీపక్ కొఠారి తన ఫిర్యాదులో ఆరోపించారు.
షాపింగ్ ప్లాట్‌ఫామ్ బెస్ట్ డీల్ టీవీకి వారు డైరెక్టర్లుగా ఉన్న సమయంలో దీపక్ వారితో ఒప్పందం చేసుకున్నారు. అప్పటికి ఆ కంపెనీలో 87 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉన్నారు. మొదట 12 శాతం వడ్డీతో రూ. 75 కోట్ల రుణం కావాలని వారు కోరారని, కానీ అధిక పన్నుల భారం నుంచి తప్పించుకునేందుకు ఆ మొత్తాన్ని రుణం బదులుగా పెట్టుబడిగా మార్చాలని తనను ఒప్పించారని కొఠారీ వివరించారు. నెలవారీ రాబడితో పాటు అసలు కూడా తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారని బాధితుడు పేర్కొన్నాడు. వారి మాటలు నమ్మి, 2015 ఏప్రిల్‌లో రూ. 31.9 కోట్లు, అదే ఏడాది సెప్టెంబర్‌లో మరో రూ. 28.53 కోట్లు బదిలీ చేసినట్లు కొఠారీ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. 2016 ఏప్రిల్‌లో తనకు శిల్పా శెట్టి వ్యక్తిగత హామీ కూడా ఇచ్చారని దీపక్ తెలిపారు. ఆ తర్వాత కొన్ని నెలలకే ఆమె డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని, ఈ విషయాన్ని బయటకు చెప్పలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆ కంపెనీ దివాలా తీసిన విషయం తెలిసిందని చెప్పారు. ఇదిఇలా ఉండగా.. శిల్పా శెట్టి దంపతులు గతంలోనూ చీటింగ్ కేసుల్లో ఇరుక్కున్నారు. అలాగే రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయ్యారు.