Site icon vidhaatha

Kolkata Law College Gangrape | కాళ్లు పట్టుకున్నా.. కనికరించలేదు.. దుస్తులు తొలగించి..! : కోల్‌కతా లా కాలేజీ విద్యార్థిని భయానక అనుభవం

Kolkata Law College Gangrape | దక్షిణ కోల్‌కతాలోని కస్బాలో ఒక కాలేజీ క్యాంపస్‌లో న్యాయ విద్యార్థిపై జరిగిన లైంగిక దాడి కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో తృణమూల్‌ కాంగ్రెస్‌ అనుబంధ విద్యార్థి సంఘం తృణమూల్‌ ఛాత్ర పరిషద్‌ (టీఎంసీపీ) ఆఫీస్‌ బేరర్‌ కూడా ఉన్నాడు. మిగిలిన ఇద్దరు అదే క్యాంపస్‌ విద్యార్థులు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో ఒళ్లు గగుర్పాటు కలిగించే విషయాలు ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు 31 ఏళ్ల మనోజ్‌ మిశ్రా. తనను పెళ్లి చేసుకోవాలంటూ మనోజ్‌ తనను వేధించేవాడని బాధితురాలు తెలిపింది. తాను ఇప్పటికే వేరొకరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని చెబుతూ తిరస్కరించడంతో కోపోద్రిక్తుడైన మనోజ్‌.. తనను గదిలో బంధించి తనను, తన బాయ్‌ఫ్రెండ్‌ను చంపుతానని, తన తల్లిదండ్రులను అరెస్టు చేయిస్తానని బెదిరించాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ‘నేను అతడి కాళ్లు పట్టుకుని బతిమలాడాను. కానీ.. అతడు నన్న వదల్లేదు. వాళ్లు బలవంతంగా నన్ను గార్డ్‌ రూమ్‌లోకి లాక్కు పోయారు. నా దుస్తులు తొలగించి, నాపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు’ అని బాధితురాలు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నట్టు ఇండియా టుడే తెలిపింది.

తప్పించుకుంటుంటే.. దాడి చేశారు

నిందితులు తనపై దాడిని చిత్రీకరించారని, వాళ్ల మాట వినకపోతే దీనిని బయటపెడతామని బెదిరించారని బాధితురాలు పేర్కొన్నది. తనపై లైంగికదాడిని ప్రతిఘటించి, తప్పించుకు పోయేందుకు ప్రయత్నించానని, దాంతో తనపై హాకీ స్టిక్‌తో దాడి చేయడంతో తీవ్ర గాయమైందని తెలిపింది. ఈ ఘోర సంఘటన దక్షిణ కలకత్తా లా కాలేజీ క్యాంపస్‌లో బుధవారం రాత్రి 7.30 గంటల నుంచి 10.50 గంటల మధ్య చోటు చేసుకున్నట్టు ఎఫ్‌ఐఆర్‌ను బట్టి తెలుస్తున్నది. మరుసటి రోజు మిశ్రా, అహ్మద్‌లను కస్బా ఏరియా ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి మొబైల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూడో అనుమానితుడు ముఖర్జీని ఆయన ఇంటి వద్ద శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో అరెస్టు చేశారు. అతడి మొబైల్ ఫోన్‌ను కూడా పోలీసులు సీజ్‌ చేశారు.

మహిళలకు భద్రత లేదు

తృణమూల్‌ కాంగ్రెస్‌ పాలనలో మహిళలకు రాత్రిపూట రక్షణ లేకుండా పోయిందని బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవీయ ఎక్స్‌లో పేర్కొన్నారు. బెంగాల్‌ మహిళలకు రాత్రుళ్లు పీడకలలుగా దాపురించాయని అన్నారు. లైంగిక దాడులు అనేవి నిత్యకృత్యం అయిపోయాయని విమర్శించారు. నేరం జరుగుతున్న సమయంలో కాలేజీ గేట్లు మూసివేయాలని కాలేజీ అధికారులు ఆదేశించారని వార్తలు వస్తుండటాన్ని ఆయన ప్రస్తావించారు. ఎందుకు గేట్లు మూయించారని నిలదీశారు. ఇది కేవలం నేరం మాత్రమే కాదని, అత్యున్నత స్థాయిలో కప్పిపుచ్చుకునే ప్రయత్నమని తృణమూల్‌ పాలనపై నిప్పులు చెరిగారు. టీఎంసీ.. రేపిస్టులు, వారి సంరక్షకుల పార్టీగా తయారైందని మండిపడ్డారు. బాధితురాలికి న్యాయం జరిగే వారకూ ఆమె పక్షాన పోరాడుతామని తెలిపారు.

Exit mobile version