San Rechal Gandhi | మోడల్‌ శాన్‌ రేచెల్‌ గాంధీ బలవన్మరణం వెనుక సంచలన విషయాలు! సూసైడ్‌ నోట్‌లో మాత్రం!

  • By: TAAZ    crime    Jul 14, 2025 3:29 PM IST
San Rechal Gandhi | మోడల్‌ శాన్‌ రేచెల్‌ గాంధీ బలవన్మరణం వెనుక సంచలన విషయాలు! సూసైడ్‌ నోట్‌లో మాత్రం!

San Rechal Gandhi | మోడల్‌, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ శాన్‌ రేచల్‌ గాంధీ పుదుచ్చేరిలో ఆదివారం (జూలై 13) బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. చనిపోయే నాటికి ఆమె వయసు కేవలం 26 ఏళ్లే. ఈమె బలవన్మరణం వెనుక అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆమె చనిపోయినట్టు తెలుస్తున్నది. పోలీసుల దర్యాప్తులో అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. పెద్ద మొత్తంలో ట్యాబ్లెట్స్‌ తీసుకోవడం ద్వారా ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. తొలుత ఒక ప్రభుత్వ హాస్పిటల్‌లో, తర్వాత ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చేర్పించి, చికిత్స అందించినప్పటికీ ఉపయోగం లేకపోయింది. జవహర్‌లాల్‌ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (JIPMER)లో ఆమె తుదిశ్వాస విడిచింది.

డబ్బు అడిగితే నిరాకరించిన తండ్రి

కొంతకాలంగా రేచల్‌ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టు స్థానిక పోలీసులు చెబుతున్నారు. తన కెరీర్‌ను కొనసాగించేందుకు కొన్ని రోజుల క్రితమే  ఆమె తన బంగారు ఆభరణాలన్నీ అమ్మేసినట్టు సమాచారం. నగలమ్మిన సొమ్ము కూడా సరిపోకపోవడంతో తండ్రి సహకారం కూడా కోరినట్టు తెలిసింది. చనిపోవడానికి ముందు తన తండ్రి ఇంటికి రేచల్‌ వెళ్లి, ఆర్థిక సహకారం కోరింది.  అయితే.. కొడుకు విషయంలో కూడా చాలా ఖర్చులు ఉన్నాయని, తాను డబ్బు సర్దలేనని తండ్రి తేల్చి చెప్పినట్టు తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రేచల్‌.. తీవ్ర నిర్ణయం తీసుకుంది. శాన్‌ రేచల్‌ మరణానంతరం ఆమె గదిలో ఒక లేఖను పోలీసులు కనుగొన్నారు. తన మరణానికి ఎవరూ కారణంగా కాదని పేర్కొంటూ ఆ లేఖ మొదలవుతుంది.

శరీర ఛాయను సవాల్‌ చేసిన యువతి

సౌందర్య లోకంలో ప్రత్యేకించి మోడలింగ్‌ రంగంలో తెల్లటి శరీర ఛాయ ఉంటేనే గ్రేట్‌ అనే ఫీలింగ్‌ ఉన్న నేపథ్యంలో ఆ భావనను బద్దలు కొట్టింది రేచల్‌. తన నల్లని సహజ ఛాయతోనే అనేక టైటిళ్లు  గెలుచుకున్నది. అందానికి శరీర రంగు ప్రామాణికం కానేకాదని కుండబద్దలు కొట్టింది. 2022లో మిస్‌ పాండిచ్చేరిగా ఎన్నికవడం ద్వారా రేచల్‌ గాంధీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. 2023లో మిస్‌ ఆఫ్రికా గోల్డెన్‌ పాజంట్‌ పోటీల్లో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించింది. 2019లో మిస్‌ బెస్ట్‌ ఆటిట్యూడ్‌, అదే సంవత్సరం మిస్‌ డార్క్‌ క్వీన్‌ తమిళనాడు, 2022లో క్వీన్‌ ఆఫ్‌ మద్రాస్‌ తదితర టైటిళ్లను గెలుచుకున్నది. తమ శరీరఛాయతో సంబంధం లేకుండా యువతులు మోడలింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలోకి రావాలని రేచల్‌ ప్రోత్సహించేది. అందాల పోటీలకు కోచ్‌గా కూడా వ్యవహరించేది. స్కిన్‌ కలర్‌ గొలుసులను బద్దలు చేస్తూ అన్ని రకాల శారీర ఛాయలు కలిగిన యువతులు సైతం అందాల పోటీల్లో పాల్గొనాలని తన వీడియోల ద్వారా ప్రోత్సహించేది. ఒక విధంగా మోడలింగ్‌ రంగం ప్రామాణికాలను బలంగా దెబ్బతీయడంలో కొంత విజయం సాధించింది. కానీ.. అందరినీ ప్రభావితం చేయగల శక్తి కలిగి, తనను తాను కష్టాలకు ఎదురీదే శక్తిని సముపార్జించుకోవడంలో నిలువలేక పోవడమే విషాదం.