మావోయిస్టుల ఘాతుకం.. బీజేపీ కార్యకర్త హత్య

- ఛత్తీస్‌గఢ్‌లోని మోహ్లా మన్‌పూర్‌లో ఘటన
విధాత: అనుమానిత నక్సల్స్ గ్రూప్ బీజేపీ కార్యకర్తను కాల్చి చంపింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత జిల్లా మోహ్లా మన్‌పూర్‌లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్నది. ఈ విషయాన్ని శనివారం పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ హత్య వెనుక మావోయిస్టుల పాత్ర ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బలగాలు, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, ఇతరులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని రాజ్‌నంద్‌గావ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాహుల్ భగత్ తెలిపారు. “మొహ్లా మన్పూర్ జిల్లాలోని ఔంధీ పోలీస్ స్టేషన్ పరిధిలో బిర్జు తారామ్ అనే బీజేపీ కార్యకర్తలను గుర్తు తెలియని ముష్కరులు హతమార్చారు. శుక్రవారం రాత్రి నుంచి ఈ ఘటనపై విచారణ కొనసాగుతున్నది” అని ఐజీ భగత్ చెప్పారు.
90 స్థానాలున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో 20 స్థానాలకు నవంబర్ 7న పోలింగ్ జరగనున్నది. మిగిలిన 70 స్థానాలకు నవంబర్ 17న రెండో విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హత్య జరుగడంతో పోలీసు యంత్రాంగం బందోబస్తును మరింత కట్టుదిట్టం చేసింది.