Trisha | చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ప్ర‌త్య‌క్షం అయిన త్రిష‌.. విజయ్‌తో రిలేషన్‌షిప్ వార్తలపై మౌనం

Trisha | కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్‌తో కలిసి ఒక పెళ్లి వేడుకకు హాజరైన నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

  • By: Sandeep |    movies |    Published on : Mar 14, 2026 9:09 AM IST
Trisha | చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ప్ర‌త్య‌క్షం అయిన త్రిష‌.. విజయ్‌తో రిలేషన్‌షిప్ వార్తలపై మౌనం

Trisha | కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్‌తో కలిసి ఒక పెళ్లి వేడుకకు హాజరైన నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ పరిణామాల తర్వాత తొలిసారిగా చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంటపడిన త్రిష.. రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు ఎలాంటి స్పందన ఇవ్వకుండా మౌనంగా వెళ్లిపోవడం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది.

ప్రశ్నల వర్షం..

చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న త్రిషను చూసిన మీడియా ప్రతినిధులు వెంటనే ఆమెను చుట్టుముట్టారు. హీరో విజయ్‌తో కలిసి పెళ్లి వేడుకకు హాజరైన విషయంపై స్పష్టత ఇవ్వాలని పలువురు ప్రశ్నలు సంధించారు. అయితే త్రిష ఎక్కడా అసహనం వ్యక్తం చేయకుండా చాలా ప్రశాంతంగా తన దారిన వెళ్లిపోయింది.

ఆ సమయంలో ఆమె వైట్ టీ-షర్ట్, బ్లాక్ ప్యాంట్స్, డెనిమ్ జాకెట్ ధరించి స్టైలిష్‌గా కనిపించింది. రిపోర్టర్లు వరుసగా ప్రశ్నలు అడిగినా త్రిష ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన సిబ్బందితో కలిసి ఎయిర్‌పోర్ట్ లోపలికి వెళ్లిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివాదానికి కారణం ఏమిటి?

ఇటీవల ప్రముఖ నిర్మాత కల్పతి సురేష్ కుమారుడి వివాహ వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు విజయ్, త్రిష కలిసి హాజరవడంతో ఇద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. అదే సమయంలో విజయ్ భార్య సంగీత కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు వచ్చిన వార్తలు సంచలనంగా మారాయి. ఆ పిటిషన్‌లో విజయ్‌కు ఒక నటితో వివాహేతర సంబంధం ఉందని ప్రస్తావించబడినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఆ నటిగా త్రిష పేరు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

విజయ్ స్పందన

ఈ వివాదాల మధ్య విజయ్ ఇటీవల తన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం (TVK)’ నిర్వహించిన ర్యాలీలో పరోక్షంగా స్పందించారు. గత కొంతకాలంగా తన గురించి కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయని, అవి అభిమానులను బాధపెడుతున్నాయని అన్నారు. అభిమానులు అలాంటి వార్తలను పట్టించుకోకుండా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.

కోలీవుడ్‌లో హాట్ టాపిక్

ప్రస్తుతం విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సమయంలో అతని వ్యక్తిగత జీవితం చుట్టూ జరుగుతున్న చర్చలు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇదే సమయంలో విజయ్ చివరి సినిమా అని చెప్పబడుతున్న ‘జననాయగన్’ కూడా సెన్సార్ సమస్యల్లో చిక్కుకోవడం చర్చనీయాంశమైంది. ఇలాంటి పరిస్థితుల్లో త్రిష ఎయిర్‌పోర్ట్‌లో మీడియా ప్రశ్నలకు స్పందించకుండా వెళ్లిపోవడం సోషల్ మీడియాలో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. అభిమానులు మాత్రం ఈ వార్తలపై అధికారిక స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు.