Amarnath Yatra | అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. తేదీలు, చార్జీల వివరాలివే..
ఇక మంచుకోండలు శివనామ స్మరణతో మారుమోగిపోనున్నాయి. భక్తులు ఎంతో పవిత్రమైనదిగా భావించే అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కాబోతున్నది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ఈ వార్త చదవండి.

Amarnath Yatra | ఏటా దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో నిర్వహించే అమర్‌నాథ్ యాత్రకు చాలా ప్రాముఖ్యం ఉన్నది. ప్రతి సంవత్సరం వేల మంది భక్తులు ఈ యాత్ర చేపడుతారు. ఎంతో కష్టమైనా అన్నింటినీ అధిగమించి అమర్‌నాథ్‌కు చేరుకుంటారు. ఒక గుహలో సహజసిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకుని ఆనందపారవశ్యులవుతారు. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్స్ మొదలయ్యాయి. ఈ యాత్రకు వెళ్లాలనుకునేవారు ముందుగానే తమ పేర్లను రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. అమర్‌నాథ్‌జీ ఆలయ బోర్డు (SASB) వెబ్‌సైట్‌లో ఈ మేరకు వివరాలు ఉంచారు. వాటి ప్రకారం.. అమర్‌నాథ్ యాత్ర ఈ ఏడాది జూలై (3.07.2025) నుంచి ప్రారంభం అవుతుంది. 2025 ఆగస్ట్ 9న ముగుస్తుంది. గ్రూపు రిజిస్ట్రేన్లు కూడా మొదలయ్యాయి. ఐదు అంతకు మించిన వ్యక్తులు ఒక బృందంగా ఈ యాత్రలో పాల్గొనవచ్చు. అయితే.. ముందు వచ్చినవారికే ముందు అవకాశం ప్రాతిపదికన రిజిస్ట్రేషన్లు ఉంటాయి.
ఇలా రిజిస్టర్ చేసుకోండి
శ్రీ అమర్‌నాథ్‌జీ ష్రైన్ బోర్డ్ (SASB) వెబ్‌సైట్‌ను క్లిక్ చేయాలి. అందులో పేర్కొన్న మార్గదర్శకాలను, చేయాల్సినవి, చేయకూడనివి క్షుణ్ణంగా చదవాలి. అనంతరం ‘ఐ అగ్రీ’ అనే చోట క్లిక్ చేయాలి. అనంతరం ‘రిజిస్టర్’ అనే బటన్ క్లిక్ చేయాలి.
మీ వివరాలన్నీ అందులో పొందుపర్చాలి. మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో అప్‌లోడ్ చేయాలి. మీ ఆరోగ్య ధృవీకరణ సర్టిఫికెట్‌ను కూడా అప్‌లోడ్ చేయడం తప్పనిసరి. ఈ ప్రాసెస్ పూర్తి చేయగానే మీ వెరిఫైడ్ మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది.
రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించేందుకు రెండు గంటల వ్యవధిలో మీకు పేమెంట్ లింకు వస్తుంది. మనీకంట్రోల్ పేర్కొన్నదాని ప్రకారం రిజిస్ట్రేషన్ చార్జ్ ఒక వ్యక్తికి 220 రూపాయలుగా ఉంటుంది.
సక్సెస్‌ఫుల్‌గా పేమెంట్ చేయగానే మీరు అదే వెబ్‌సైట్ నుంచి మీ యాత్ర రిజిస్ట్రేషన్ పర్మిట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ ప్రక్రియలన్నీ పూర్తవగానే మీకు అధికారికంగా పర్మిట్ జనరేట్ అవుతుంది.
అమర్‌నాథ్ యాత్ర సందర్భంగా చేయాల్సినవి, చేయకూడనివి..
చేయాల్సినవి :
ప్రతి యాత్రికుడు యాత్ర ప్రారంభానికి ముందే సూచించిన లొకేషన్లలో తమ ఆర్ఎఫ్ఐడీని కలెక్ట్ చేసుకోవాలి. ఆర్ఎఫ్ఐడీని కలెక్ట్ చేసుకోవడానికి అవసరమైన మీ ఆధార్ కార్డును దగ్గర ఉంచుకోవాలి.
మీ భద్రత, రక్షణ కోసం యాత్రలో ఉన్నంత సేపూ ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌ను మీ మెడలో ధరించాలి.
ఆకస్మికంగా ఉష్ణోగ్రతలు పడిపోయే పరిస్థితికి ముందుగానే సన్నద్ధులై ఉండాలి. అందుకోసం చలిని తట్టుకునే దుస్తులు వెంట తీసుకెళ్లాలి. గొడుగు, రెయిన్ కోటు, విండ్‌చీటర్ వంటివి దగ్గర ఉంచుకుంటే మంచిది.
అత్యవసర సమయాల్లో ఉపయోగపడేందుకు ఒక కాగితంపై మీ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్ రాసి పెట్టుకోవాలి.
చేయకూడనివి :
ఆర్ ఎఫ్ ఐడీ కార్డు లేని ఏ రిజిస్టర్డ్ యాత్రికుడినైనా అనుమతించరు.
యాత్ర సమయంలో మద్యం, కెఫినేటెడ్ డ్రింక్స్, సిగరెట్లు వంటివాటి వాటికి దూరంగా ఉండాలి.
ఎత్తయిన ప్రాంతాలకు వెళ్లినప్పుడు కలిగే అసౌకర్యాన్ని ముందే గుర్తించుకోవాలి.
హెచ్చరిక నోటీసు బోర్డులు ఉంచిన ప్రాంతాల్లో నిలబడకూడదు.
యాత్ర సాగే ప్రాంతంలో పర్యారవణానికి హాని కలిగించేలా లేదా కాలుష్యం సృష్టించే పనులు చేయకూడదు.