Medaram jathara | మేడారంలో మండ మెలిగే పండుగ సందడి… భారీగా భక్తులరాకతో తీవ్రరద్దీ
బుధవారం గుడిమెలిగే పండుగ నిర్వహించిన మేడారం వడ్డెలు( పూజారులు), ఈ బుధవారం మండమలిగే పండుగతో మరో కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచంలో అతిపెద్ద ఆదివాసీ జాతరలో ఒక్కటిగా ప్రఖ్యాతిగాంచిన గిరిజన జాతరగా మేడారం పేరొందింది.
- మేడారంలో మండ మెలిగే పండుగ సందడి
- ఆకుపచ్చని తోరణాలతో ఆలయప్రాంగణం
- సమ్మక్క, సారలమ్మ దేవతల గుడులు శుద్ధి
- గ్రామ దేవతలకు సంప్రదాయ మొక్కులు
- ఈ రాత్రంతా గద్దెల వద్ద వడ్డెల జాగారాలు
- మేడారానికి భారీగా భక్తులరాకతో తీవ్రరద్దీ
- ఈ నెల 28 నుంచి అసలైన జాతరకు శ్రీకారం
విధాత, ప్రత్యేకప్రతినిధి: మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరలో భాగంగా ఒక్కో ఘట్టాన్ని పరిపూర్తి చేస్తున్నారు. జాతరకు ముందస్తు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం నిర్వహించే మండమెలిగే పండుగ బుధవారం ఆదివాసీ వారసత్వ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం నిర్వహించారు. గత బుధవారం గుడిమెలిగే పండుగ నిర్వహించిన మేడారం వడ్డెలు( పూజారులు), ఈ బుధవారం మండమలిగే పండుగతో మరో కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచంలో అతిపెద్ద ఆదివాసీ జాతరలో ఒక్కటిగా ప్రఖ్యాతిగాంచిన గిరిజన జాతరగా మేడారం పేరొందింది. ఈ జాతరకు అంకురార్పణగా వారం రోజుల ముందు మండమలిగే పండగ నిర్వహించడం అనాదిగా అనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమాన్ని బుధవారం అత్యంత కన్నుల పండువగా నిర్వహించారు. ఈ మండ మెలిగే పండుగతో జాతర ప్రారంభమైనట్లుగా ఆదివాసీలు భావిస్తారు. సమ్మక్క కొలువైన మేడారం, సారలమ్మ ఉన్న కన్నెపల్లి, కొండాయిలోని గోవిందరాజులు, పూనుగొండ్లలోని పగిడిద్దరాజు గుడులను తెల్లవారు జామున్నే పూజారులు భక్తి, శ్రద్ధలతో పుట్టమట్టితో అలికి, ముగ్గులు పెట్టి, పచ్చని మామిడి తోరణాలతో అలంరించారు.
మేడారంలోని సమ్మక్క ప్రధాన పూజారి ఇంటి నుంచి డప్పుచప్పుళ్లు, డోలు వాయిద్యాల నడుమ పసుపు, కుంకుమలతో మేడారం గ్రామం చుట్టూ ఊరేగింపు నిర్వహించి, ఆదివాసీ ఆడపడుచులు సమ్మక్క గుడికి వెళ్లి పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత గ్రామదేవతలుగా కొలిచే బొడ్రాయికి శుద్ధ జలంతో కడిగిశుద్ధి చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో బూరుగు కొమ్మలతో దిష్టి తోరణాలు కట్టారు. ఆదివానీ ఆచార సంప్రదాయాల ప్రకారం ఉపవాస దీక్షలతో మండమెలిగే పండుగ చేశారు. బుధవారం రాత్రి గద్దెల చెంత పూజలు చేసి తల్లులకు నైవేద్యాలు సమర్పించి, తమదైన పద్ధతిలో రేపు ఉదయం వరకు రహస్య పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ రాత్రి కొంత సేపు గద్దెల ప్రాంగణంలో వనదేవతల దర్శనాలు నిలిపివేస్తారు. దీంతో ఇక జాతర ప్రారంభానికి ముందస్తు అనుమతి లభిస్తోంది. గ్రామ సరిహద్దుల వద్ద దిష్టితోరణాలు కడుతారు.
28 నుంచి 31 వరకు మహాజాతరకు షురూ
ఈ నెల 28 నుండి 31 వ తేదీ వరకు నాలుగు రోజులపాటు మేడారం మహా జాతర ప్రారంభం కానుంది. మొదటి రోజున సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులను గద్దెల వద్దకు తీసుకొస్తారు. రెండో రోజు చిలకలగుట్ట దిగి సమ్మక్క గద్దెల వద్దకు చేరుకుంటుంది. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఒక రోజుగద్దెలపై తమ వనదేవ,దేవతలను సందర్శించి మొక్కులు సమర్పించిన తర్వాత వన ప్రవేశం జరుగుతోంది.
వన దేవతల సన్నిధిలో భక్త జనసందోహం
మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతల సన్నిధి బుధవారం భక్త జనసందోహంతో కళకళలాడింది. బుధవారం వనదేవతలకు ప్రత్యేకమైన రోజు కావడంతో ఉదయం నుంచే భక్తులు క్యూ లైన్ ల ద్వారా దేవతల దర్శనం చేసుకున్నారు. గత నెల రోజుల నుంచి మేడారానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. బుధ, గురు, ఆదివారాల్లో భక్తుల పెద్ద సంఖ్యలో రావడంతో జాతరవాతావరణం వేడెక్కింది. బుధవారం కూడా దాదాపు 75 వేల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రాకతో మేడారంతోపాటు పరిసర అటవీప్రాంతం, గద్దెలు, జంపన్నవాగు, మేడారంలో రద్దీ పెరిగింది. భక్తులకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా చర్యలు చేపట్టారు.
X








Google News
Facebook
Instagram
Youtube
Telegram