Venkateswara Temple In Raichur | హరిహర క్షేత్రంలో..అద్భుత మహిమ

వేడి నీటిని పోస్తే చల్లగా, చల్లని నీటిని పోస్తే వేడిగా మారిపోతుంది! హరిహర క్షేత్రంలోని ఈ అద్భుతం వెనుక రహస్యం ఏమిటో తెలుసా?

Venkateswara Temple In Raichur | హరిహర క్షేత్రంలో..అద్భుత మహిమ

విధాత : హరిహరులు కొలువుతీరిన ఆ పవిత్ర క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వుడి విగ్రహానికి చేసే అభిషేకం అద్బుతంగా నిలుస్తుంది. శ్రీవారికి వేడి నీటితో అభిషేకం ఆనవాయితీగా వస్తుండగా…విగ్రహంపై అభిషేకం కోసం పోసిన వేడి నీరు చన్నీటిగా మారిపోతుంది. అదే సమయంలో నాభి స్థానంల చల్లటి నీరు పోస్తే వేడిగా మారుతుంది. ఈ అద్భుతం ఏమిటన్నది ఇప్పటిదాక సైంటిస్టులకు సైతం అంతుపట్టలేదు. ఇదంతా ఆ స్వామివారి మహిమగా భావిస్తున్న భక్తులు హరిహరులను దర్శించుకునేందుకు భారీగా తరలివస్తుంటారు.

కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా గబ్బూరులో ఉన్న లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయం హరిహర క్షేత్రంగా ప్రసిద్ది చెందింది. ఇక్కడ కొలువైన వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి విగ్రహానికి సెగలు కక్కే నీటితో ప్రతి ఆదివారం అభిషేకం చేస్తారు. ఆ నీరు తలనుంచి పాదాల దగ్గరకు వచ్చేసరికి క్షణాల్లో చల్లగా మారిపోతుంది. సెగలు కక్కే నీరు సైతం పాదాల వద్దకు వచ్చేసరికి చల్లగా మారే అద్భుత దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసి తరించడం కోసం ఇక్కడికి భారీగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇందులో మరో వింత కూడా ఉంది. చల్లటి నీటిని స్వామివారి నాభి స్థానంలో పోస్తే వేడిగా మారిపోతుంది.

800ఏండ్ల చరిత్ర

హరిహర క్షేత్రంగా పిలిచే ఈ ఆలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉంది. అభిషేక ప్రియుడిగా పరమేశ్వరుడు, అలంకార ప్రియుడ శ్రీ వేంకటేశ్వరులు ఇద్దరు ఈ క్షేత్రంలో కొలువు తీరారు. పన్నెండో శతాబ్దానికి చెందిన సేవన వంశ రాజు సింహనుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. నిజానికి ఈ ఆలయాన్ని శివుడి కోసం నిర్మించారట. లింగాన్ని ఏర్పాటు చేసేందుకు గర్భగుడిలో ఒక పీఠాన్ని కూడా ఏర్పాటు చేయగా..తనకూ ఈ ఆలయంలో చోటుకావాలి అని శ్రీహరి అడిగారని క్షేత్ర పురాణం. దీంతో విష్ణువు కోరిక మేరకు శివుడు తనకోసం ఏర్పాటు చేసిన పీఠంపై వేంకటేశ్వరుడి విగ్రహం ప్రతిష్టించేలా చేశాడట. ఆ తర్వాత కాలంలో అగస్త్యముని శివలింగాన్ని ప్రతిష్టించాడని స్థలపురాణం. ప్రత్యేక గీతాలతో కనిపించే శివలింగం అరుదైనది కావడం విశేషం. ఇక్కడే లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయం కూడా ఉంది. శివకేశవులు కొలువుతీరిన అరుదైన ఈ ఆలయాల్లో శ్రీవారు ప్రసన్న వేంకటరమణగా, శివుడు ప్రసన్న రాజేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ స్వామివార్లను దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని, సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.