Donald Trump : మూడోసారి పోటీకి నేను సిద్దం..ఫిట్ గా ఉన్నా
మూడోసారి అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు ట్రంప్ సిద్ధమన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. కానీ అది సాధ్యమేనా?
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి పోటీకి తాను సిద్దంగా ఉన్నానని..ఇందుకు నేను ఆరోగ్యంగా ఫిట్ గా ఉన్నానని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మలేసియా నుంచి టోక్యోకు వెళ్తుండగా ఎయిర్‌ఫోర్స్‌వన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ తన కఠిన నిర్ణయాలతో ప్రపంచాన్ని పరేషాన్ చేస్తున్నారు. తాజాగా మూడోసారి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ తన మనసులోని మాట బయటపెట్టారు. అయితే అమెరికా రాజ్యంగ పరంగా ఒకరు రెండు పర్యాయాలు మాత్రమే అధ్యక్ష పదవిలో కొనసాగవచ్చు. మూడోసారి అధ్యక్ష పదవికి ట్రంప్ కు పోటీ చేసే అస్కారం లేదు. అయితే ఉపాధ్యక్ష పదవికి ట్రంప్ పోటీ చేసే అవకాశం మిగిలి ఉన్నందున..మీరు 2028లో ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు ట్రంప్ తనదైన గడసరి సమాధానమిచ్చారు. ఉపాధ్యక్ష పదవికి పోటీ ఆలోచన చాలా క్యూట్‌గా ఉందని..అయితే ప్రజలు దీన్ని ఇష్టపడరని..తనకు కూడా అది ఇష్టం లేదని తెలిపారు. మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు మార్గాలున్నాయని వ్యాఖ్యానించారు. అయితే.. దాని గురించి తాను ఇంకా ఆలోచించలేదన్నారు. తదుపరి అమెరికా అధ్యక్షుడి రేసులో రిపబ్లికన్ అభ్యర్థులైన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోలకు బలమైన అవకాశాలు ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. వారు గొప్ప వ్యక్తులని ప్రశంసించారు. తాజాగా తాను మూడోసారి పోటీ చేసే అవకాశం లేకపోలేదంటూ ట్విస్టు ఇచ్చారు.
మూడోసారి పోటీకి మార్గం కష్టతరం
ఇటీవల వైట్‌హౌస్ మాజీ వ్యూహకర్త స్టీవ్ బానన్ సైతం 2028లో ట్రంప్ మూడోసారి అధ్యక్షుడిగా పోటీ చేసే విషయంపై మార్గాలను కనుగొంటున్నట్లు తెలిపారు. ప్రజలు అందుకు అనుగుణంగా ఉండాలని సూచించారు. బానన్ వ్యాఖ్యల నేపథ్యంలో ట్రంప్ కూడా మూడోసారి పోటీకి ఆసక్తి కనబరచడం ప్రాధాన్యం సంతరించుకుంది. యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బోండీ మాత్రం ట్రంప్ మూడోసారి పోటీ చేయడానికి అవసరమైన చట్టపరమైన మార్గాన్ని కనుక్కోవడం కష్టమేనని తేల్చిచెప్పారు. రాజ్యాంగ సవరణలు చేయడం ద్వారా అవకాశాలు ఉన్నప్పటికీ అది చాలా కష్టంతో కూడుకున్నదన్నారు. ట్రంప్ కలగంటున్నట్లు మూడోసారి అధ్యక్షుడు కావాలంటే 22వ రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ చేయాలంటే కాంగ్రెస్‌తో పాటు రాష్ట్రాల ఆమోదం కూడా ఉండాలి. అయితే చాల కష్టపరమైన ప్రక్రియ అని నిపుణులు చెబుతున్నారు. అమెరికా చరిత్రలో ఫ్రాంక్లిన్ రూజ్ వెల్ట్ ఒక్కరే నాలుగుసార్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తర్వాత అలాంటి అవకాశం లేకుండా 1951లో 22వ రాజ్యాంగ సవరణ తెచ్చారు. దీంతో ఒక వ్యక్తి రెండు పర్యాయాలు మాత్రమే అమెరికా అధ్యక్ష పదవి నిర్వహించే నిబంధన అమలులోకి వచ్చింది.
ట్రంప్ కు నోబెల్ కోసం జపాన్ మద్దతు
నోబెల్ బహుమతి కోసం కలలకంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే తాను పలు దేశాల మధ్య యుద్ధాలు ఆపానని ప్రచారం చేసుకుంటూ వచ్చే ఏడాది నోబెల్ కోసం రేసులో ఉన్నారు. నోబెల్ కోసం పలు దేశాధినేతలతో ప్రతిపాదనలు సైతం చేయించుకుంటున్నారు. తాజాగా ట్రంప్ జపాన్ పర్యటన క్రమంలో నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ ను నామినేట్ చేస్తానని జపాన్ ప్రధాని సనాయె తకాయిచి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ వెల్లడించింది. థాయ్‌లాండ్-కంబోడియాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో ట్రంప్ విజయం సాధించారు. ఇక, పశ్చిమాసియాలో కుదిర్చిన ఒప్పందం (ఇజ్రాయెల్-హమాస్) చరిత్రాత్మకమైంది’అని జపాన్ ప్రధాని ఈ సందర్బంగా ప్రశంసించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram