ఈ ఏడాది భారీగా శబరిమల ఆదాయం..!అయ్యప్పను దర్శించుకున్న 50లక్షల భక్తులు..!

శబరిమల అయ్యప్ప ఆలయానికి ఈ ఏడాది భక్తుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది

ఈ ఏడాది భారీగా శబరిమల ఆదాయం..!అయ్యప్పను దర్శించుకున్న 50లక్షల భక్తులు..!

Sabarimala Temple | శబరిమల అయ్యప్ప ఆలయానికి ఈ ఏడాది భక్తుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. పతినంతిట్ట జిల్లా పెరియార్‌ టైగర్‌ రిజర్వ్‌లోని ఉన్న ఆలయానికి మరకవిళక్కు సందర్భంగా ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. శబరిమల ఆలయాన్ని నిర్వహిస్తున్న ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు (TDB) ప్రెసిడెంట్ పీఎస్ ప్రశాంత్ మాట్లాడుతూ.. ఆలయంలో మండలం మకరవిళక్కు రెండు నెలలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన్నారు. ఈ రెండు నెలల్లో అయ్యప్ప దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఈ రెండు నెలల్లోనే 50 లక్షల మంది భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నారన్నారు. గతేడాదితో పోలిస్తే ఐదు లక్షల మంది భక్తులు అధికంగా వచ్చారని తెలిపారు. గతేడాది ఈ రెండు నెలల్లో 44 లక్షల (44,16,219) మంది భక్తులు వచ్చి అయ్యప్పస్వామిని దర్శించుకున్నట్లు చెప్పారు. గతంతో పోలిస్తే ఈ రెండు నెలల్లో ఆలయ ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగిందని టీబీడీ తెలిపింది. ఈ సారి మండలం-మకరవిళక్కు రెండు నెలల్లో ఆలయానికి రూ.357.47 కోట్లు సమకూరింది. గతేడాది కంటే ఇది రూ.10 కోట్లు ఎక్కువని తెలిపారు. దేవస్వం బోర్డు చైర్మన్‌ ప్రశాంత్ మాట్లాడుతూ.. ఈసారి ఆలయంలో భక్తులు పెరగడంతో ప్రజలు ప్రస్తుతం ఆధ్యాత్మికత వైపు పయనిస్తున్నారని అనే విషయాన్ని నిరూపిస్తోందన్నారు.

ఇదిలా ఉండగా.. ఈ ఏడాది మండలం మకరవిళక్కు సమయంలో చాలా మంది భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీఎం పినరయి విజయన్ ప్రభుత్వాన్ని విమర్శించింది. మండలం సందర్భంగా భక్తులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడంలో కేరళ ప్రభుత్వం విఫలమైందని మండిపడింది. శబరిమలకు వెళ్లే భక్తులకు మౌలిక వసతులు కల్పించాలని కాంగ్రెస్ నేత, ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆలయ చరిత్రలో తొలిసారిగా భక్తులు మార్గమధ్యంలో యాత్రను విడిచిపెట్టాల్సి వచ్చిందన్న సతీశన్‌.. ఇది బాధాకరం, విచారకరమన్నారు. భక్తులు 15 నుంచి 20 గంటల పాటు క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చిందని.. మహిళలు, పిల్లలు, వృద్ధులు ఏమీ తినకుండా క్యూలైన్లలో నిల్చున్నారన్నారు.