T20 CWC 2026 – IND Super8 | ఆస్ట్రేలియా ఔట్‌! టీ20 వరల్డ్‌కప్ సూపర్‌ 8లో భారత్‌ ప్రత్యర్థులు వీరే..

టీ20 వరల్డ్‌కప్ 2026లో ఆస్ట్రేలియా అనూహ్యంగా నిష్క్రమించగా, సూపర్‌ 8 దశలో భారత్‌కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ ప్రత్యర్థులుగా ఖరారయ్యారు. ‘గ్రూప్ ఆఫ్ డెత్‌’గా మారిన ఈ దశలో భారత్‌కు ఎదురయ్యే సవాళ్లపై విశ్లేషణ.

  • By: ADHARVA |    sports |    Published on : Feb 17, 2026 9:00 PM IST
T20 CWC 2026 – IND Super8 | ఆస్ట్రేలియా ఔట్‌! టీ20 వరల్డ్‌కప్ సూపర్‌ 8లో భారత్‌ ప్రత్యర్థులు వీరే..

Australia Knocked Out! India’s Confirmed Super 8 Opponents Revealed in T20 World Cup 2026

విధాత క్రీడా విభాగం | హైదరాబాద్​:

T20 CWC 2026 – IND Super8 | టీ20 వరల్డ్‌కప్ 2026లో సంచలనం చోటుచేసుకుంది. మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. జింబాబ్వే కీలక పాయింట్లు సాధించడంతో ఆస్ట్రేలియా సూపర్‌ 8 బస్సును మిస్ చేసుకుంది. దీంతో సూపర్‌ 8 దశలో భారత్‌కు ఎదురయ్యే ప్రత్యర్థులు అధికారికంగా ఖరారయ్యారు.

గ్రూప్ దశలో మూడు విజయాలతో అజేయంగా ముందుకెళ్లిన టీమ్ ఇండియా ఇప్పుడు కఠిన పరీక్షకు సిద్ధమవుతోంది. ఈ దశలో భారత్‌కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ జట్ల రూపంలో పరీక్షలు ఎదురుకానున్నాయి.

దక్షిణాఫ్రికాతో తొలి సవాల్

సూపర్‌ 8లో భారత్ తొలి మ్యాచ్ ఫిబ్రవరి 22న అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో జరగనుంది. గత ఎడిషన్‌లో రన్నరప్‌గా నిలిచిన ప్రోటీస్ జట్టు ఈసారి కూడా దూకుడుగా ఆడుతోంది. కెప్టెన్ ఐడెన్ మార్క్​రమ్​ నేతృత్వంలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు సమతుల్యంగా కనిపిస్తున్నాయి.

ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్‌కు సెమీఫైనల్ రేసులో భారీ ఊరట లభించే అవకాశం ఉంది.

జింబాబ్వేతో జాగ్రత్త..

ఫిబ్రవరి 26న చెన్నైలో జింబాబ్వేతో భారత్ తలపడనుంది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియాను ఓడించి సంచలనం సృష్టించిన జింబాబ్వేను తక్కువ అంచనా వేయలేం. క్రమశిక్షణతో ఆడుతూ కీలక సమయంలో ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం ఆ జట్టుకు ఉంది. భారత్ పూర్తి ఏకాగ్రతతో ఆడాల్సిన మ్యాచ్ ఇదే.

కోల్‌కతాలో వెస్టిండీస్‌తో కీలక పోరు

మార్చి 1న కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో భారత్ చివరి సూపర్‌ 8 మ్యాచ్ ఆడనుంది. పవర్ హిట్టింగ్‌కు ప్రసిద్ధి చెందిన వెస్టిండీస్ ఇప్పటికే బలమైన ప్రదర్శనలతో ముందుకెళ్తోంది. సూపర్​–8లో ప్రవేశించిన మెదటి జట్టుగా సంచలనం సృష్టించిన విండీస్​ టి20ల్లో బలమైన జట్టుగా, భారత్​కు గట్టి పోటీనివ్వనుంది.

ఈ మ్యాచ్ సెమీఫైనల్ అర్హతను నిర్ణయించే కీలక పోరుగా మారే అవకాశం ఉంది.

భారత్ ఫామ్ బలంగా

సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ సమతుల్యంగా కనిపిస్తోంది. హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శన, ఇషాన్ కిషన్ దూకుడు, సూర్య, అభిషేక్​, దూబేల బ్యాటింగ్ జట్టుకు బలం చేకూరుస్తున్నాయి. బౌలింగ్ విభాగం కూడా క్రమబద్ధంగా రాణిస్తోంది.

అయితే సూపర్‌ 8 దశలో ఒక్క పొరపాటు కూడా ఖరీదైనదిగా మారే అవకాశం ఉంది. ప్రతి మ్యాచ్ కీలకమే.

ఆస్ట్రేలియా నిష్క్రమణతో టోర్నీ మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు భారత్ ఈ ‘గ్రూప్ ఆఫ్ డెత్’ను అధిగమించి సెమీఫైనల్ చేరుతుందా? అన్నది ఆసక్తికరం. కాగా, లీగ్​ దశలో భారత్​ ఇంకో మ్యాచ్​ ఆడాల్సివుంది. భారత్​కు ఎటువంటి ప్రాధాన్యతా లేని ఈ మ్యాచ్​ నెదర్​ల్యాండ్స్​తో ఈనెల 18న జరుగనుంది.

భారత్​ సూపర్​–8 మ్యాచ్​ల షెడ్యూల్​: 

తేదీ ప్రత్యర్థి వేదిక నగరం
22 ఫిబ్రవరి 2026 దక్షిణాఫ్రికా నరేంద్ర మోదీ స్టేడియం అహ్మదాబాద్
26 ఫిబ్రవరి 2026 జింబాబ్వే ఎంఏ చిదంబరం స్టేడియం చెన్నై
1 మార్చి 2026 వెస్టిండీస్ ఈడెన్ గార్డెన్స్ కోల్‌కతా