శ్రావణమాసం తప్పితే.. నవంబర్ లోనే శుభ ముహూర్తాలు !

శ్రావణమాసంలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలకు భారీగా శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబర్‌లో పెళ్లి తేదీలు, ఆ తర్వాత నవంబర్‌లోనే శుభ ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి.

Reported by: Tejaswini Nanna | ఆధ్యాత్మికం | Aug 13, 2026, 3:34 pm IST
Read Time: 4 mins
శ్రావణమాసం తప్పితే.. నవంబర్ లోనే శుభ ముహూర్తాలు !

శ్రావణ మాసం ప్రవేశంతో తెలుగు రాష్ట్రాలలో శుభాకార్యాల సందడి నెలకొంది. శ్రావణం మాసం అంటేనే వివాహాది శుభాకార్యాలకు అనువైన మాసంగా అనుసరిస్తుంటారు. శ్రావణమాసంలో వరలక్ష్మి వ్రతాలు, శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలు, దత్తాత్రేయ స్వామి అనఘాష్టమి వ్రతాలు ఆచరించుకుంటారు. ఈ మాసంలో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు, నిశ్చితార్ధాలు, గృహప్రవేశాలు, నూతన గృహ నిర్మాణ పూజలు, వ్రతాలు, కొత్త వ్యాపారాల ప్రారంభం వంటి శుభా కార్యాలు కొనసాగునున్నాయి. శ్రావణ మాసం ఆగస్టు 13వ తేదీతో మొదలై సెప్టెంబర్ 11వ తేదీతో ముగియ్యనుంది.

శ్రావణ మాసంలోనే రాఖీ పౌర్ణమి, వరలక్ష్మి వ్రతాలు, నాగేంద్రస్వామి పూజలు, అమ్మవారికి విశేష పూజలు, జాతీయ జెండా పండుగలు జరుగుతాయి. ఇవే కాకుండా శ్రావణ మాసంలో వన భోజనాలకు కూడా వెళ్తారు.ఈ సారి శ్రావణ మాసంలో భారీగా పెళ్లిళ్లు కానున్నాయని పండితుల కథనం. దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు ఉండే మొదటి మాసం శ్రావణ మాసం కావడం విశేషం.

భారీ సంఖ్యలో పెళ్లిళ్లు..

శ్రావణ మాసం దాటితే మళ్లీ ఆక్టోబర్ 29వ తేదీ వరకు పెళ్లి మూహుర్తాలు లేవని పండితులు స్పష్టం చేస్తున్నారు. శ్రావణం తర్వాతా వచ్చే భాద్రపదం శూన్యమాసం కావడంతో వివాహాలు చేసుకోరని, ఆ తర్వాతా వచ్చే ఆశ్వీయుజ మాసం శుక్ర మౌఢ్యం రావడంతో ఆక్టోబర్ 29వరకు మూహుర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. భాద్రపద, ఆశ్వీయుజ, కార్తీక మాసాల కాలంలో చాతుర్మాస్య దీక్షలు, పితృ పక్షాలు, ఇతర కారణాల వల్ల వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు ఉండవని గుర్తు చేస్తున్నారు. దీంతో మళ్లీ నవంబర్, డిసెంబర్ మాసాల్లోనే పెళ్లిళ్లు, గృహప్రవేశాలకు అనుకూలమైన శుభ ముహూర్తాలు ప్రారంభమవుతాయని పండితులు చెబుతున్నారు.

మంచి మూహుర్తాలు ఇవే..

ఈ ఆగస్టు నెలలో … 15,16,21,22,23,26,27,28,30 తేదీలు, సెప్టెంబర్ 3, 4,5,8,10,11 తేదీలలో వివాహ మూహుర్తాలు ఉన్నాయి. ఆ తర్వాతా ఆక్టోబర్ 29వరకు మూహుర్తాలు లేవు. ఈ శ్రావణ మాసం సీజన్ లో ఇప్పటికే కల్యాణ మండపాలను బుక్‌ చేసుకుంటున్నారు. ఈ నెలలో దాదాపుగా 10వేల వరకు పెళ్లిళ్లు కావచ్చని విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. దీంతో పురోహితులు, ఫొటోగ్రాఫర్లు, కేటరింగ్, డెకరేషన్, భోజనాల తయారీ చేసే వారికి ఇకపై చేతి నిండా పనితో ఈ మాసం మొత్తం బిజీబిజీ కాబోతున్నారు.