నీట్ పరీక్షలపై మరో కీలక అప్‌డేట్‌.. ఇకపై మారనున్న పరీక్షా విధానం.. లీకేజీలు తగ్గేనా?

నీట్‌ పరీక్ష పత్రం లీకేజీ, పరీక్ష రద్దు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై నీట్‌ పరీక్షను సీబీటీ పద్ధతిలో నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రకటించారు.

నీట్‌ పరీక్షలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శుక్రవారం (15.05.2026) కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. 2027 సంవత్సరం నుంచి నీట్‌ ఎగ్జామ్‌ను ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించనున్నట్టు ప్రకటించారు. నీట్‌ –యూజీ 2026 పరీక్ష పత్రం లీకేజీ, పరీక్ష రద్దు అంశాలు దేశంలో సంచలనం రేపాయి. రాజస్థాన్‌లోని కోచింగ్‌ సెంటర్లకు పేపర్‌ లీక్‌ అయిందని ధృవీకరించుకున్న నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ.. పరీక్షను రద్దు చేస్తూ తిరిగిన జూన్‌ 22న నిర్వహించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. మాల్‌ప్రాక్టీసుల విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సహించేది లేదని చెప్పారు. ప్రస్తుతం చోటు చేసుకున్న పేపర్‌ లీకేజీకి ఓఎంఆర్‌ షీట్‌ ప్రధాన కారణమని అన్నారు. అందుకే వచ్చే ఏడాది నుంచి పేపర్‌–పెన్‌ విధానానికి స్వస్తి పలుకుతున్నట్టు ప్రకటించారు. దాని స్థానంలో ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌ (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌–సీబీటీ) నిర్వహిస్తామని తెలిపారు. పరీక్ష పూర్తయిన వెంటనే తమకు లీకేజీపై ఫిర్యాదు అందిందని, వెంటనే విచారణకు ఆదేశించామని ప్రధాన్‌ చెప్పారు.

ఇప్పటి వరకూ నీట్‌ యూజీ పరీక్షను పెన్‌ అండ్‌ పేపర్‌ అంటే ఓఎంఆర్‌ షీటు విధానంలో నిర్వహిస్తూ వస్తున్నారు. అంటే విద్యార్థులకు ప్రశ్న పత్రం, ఓఎంఆర్‌ షీట్‌ ఇస్తే.. వారు దానిలో సరైన సమాధానం వద్ద ఉన్న బబుల్‌ను నింపాలి. తర్వాత స్కానింగ్‌ ద్వారా మూల్యాంకనం నిర్వహిస్తారు. ఇప్పుడు ఇదే విధానం వివాదానికి కారణంగా నిలిచింది.

ఆన్‌లైన్‌ పరీక్ష ఎలా నిర్వహిస్తారు?

లీకేజీలకు బ్రేక్‌ పడుతుందా?

ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌ ద్వారా పేపర్‌ లీక్‌ ఆగిపోతుందని వందశాతం చెప్పలేం కానీ.. ఓఎంఆర్‌ విధానంతో పోల్చితే లీకేజీకి అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా ప్రశ్న పత్రాల డిజైన్‌, ముద్రణ ఉండవు. వాస్తవానికి ప్రస్తుత పద్ధతిలో చాలా వరకూ లీకేజీలు డిజైనింగ్‌, ప్రింటింగ్‌, ట్రాన్స్‌పోర్ట్‌, స్టోరేజ్‌ దశల్లోనే ఉంటున్నాయి. ఆన్‌లైన్‌ విధానంతో ఈ వ్యవస్థలేవీ ఉనికిలో ఉండవు. నేరుగా ప్రశ్నపత్రం తయారీ.. తదుపరి విద్యార్థికి చేరడం అనే రెండు దశలే ప్రధానంగా ఉంటాయి. పరీక్ష మొదలయ్యే సమయానికి మాత్రమే డాటా అన్‌లాక్‌ అయ్యే కారణంగా ఇవి బయటికి పొక్కే అవకాశాలు దాదాపు శూన్యం. పైగా రియల్‌టైమ్‌ మానిటరింగ్‌ ఉంటుందని విద్యావేత్తలు చెబుతున్నారు. తద్వారా స్క్రీన్‌ యాక్టివిటీ, లాగిన్‌ ప్యాట్రన్స్‌, అనుమానాస్పద సందర్భాలను వెంటనే గుర్తించే అవకాశం ఉంటుందని అంటున్నారు.

కొత్త రిస్కులూ ఉంటాయి..

ఆన్‌లైన్‌ పరీక్షల్లో కొన్ని రిస్కులు కూడా ఉంటాయని సైబర్‌ నిపుణులు చెబుతున్నారు. హ్యాకింగ్‌ ప్రయత్నాలు జరుగవచ్చని అంటున్నారు. రిమోట్‌ యాక్సెస్‌ ద్వారా మోసాలు జరిగే అవకాశం కొట్టిపారేయలేమని చెబుతున్నారు. సర్వర్‌ మొత్తం కాంప్రమైజ్‌ అవడానికీ స్కోప్‌ ఉందని చెబుతున్నారు. ఎగ్జామ్‌ సెంటర్లలోని కంప్యూటర్‌ మాల్‌వేర్‌ చొప్పించే అవకాశాలు ఉంటాయి. అయితే.. ఇవన్నీ చాలా కఠినమైన ప్రైవసీ సెటింగ్స్‌ దాటుకుని చేయాల్సి ఉంటుంది. ఇక చివరిగా ఇన్‌సైడర్‌ లీక్స్‌. అంటే.. ప్రశ్నలు తయారు చేసే స్థాయిలోనే లీక్‌ అవడం. ఇదే జరిగితే దేవుడు కూడా కాపాడలేడు. మొత్తానికి సీబీటీ మాత్రమే ఏకైక పరిష్కారం కాదని విద్యావేత్తలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..

ప్రియురాలి మోసం..యువకుడి ఆత్మహత్య
జూన్ 21న మళ్లీ నీట్ యూజీ పరీక్ష

Latest News