MEGA 158 in Trouble | మెగా158కు అన్నీ అవాంతరాలే : నటీనటుల కోసం బాబీ, నిర్మాత కోసం చిరంజీవి ఎదురుచూపులు

మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి మెగా158 చిత్రం కీలక పాత్రల ఎంపికలో గందరగోళం, ఇంకో శక్తివంతమైన పాత్రపై మారుతున్న నిర్ణయాలు, నిర్మాణ సంస్థ మార్పులతో అనిశ్చితిలో పడింది. మార్చిలో షూటింగ్ ప్రారంభమవుతుందా అన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

MEGA 158 in Trouble | మెగా158కు అన్నీ అవాంతరాలే : నటీనటుల కోసం బాబీ, నిర్మాత కోసం చిరంజీవి ఎదురుచూపులు

#Mega158 in Trouble? Casting Chaos and Production Shake-Up Rock Chiranjeevi’s Film

సారాంశం:

మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్‌లో మెగా158 చిత్రం ప్రారంభ దశలోనే కాస్టింగ్, నిర్మాణ సమస్యలను ఎదుర్కొంటోంది. హీరోయిన్ ఎంపిక నుండి నిర్మాణ సంస్థ మార్పుల వరకు గందరగోళం కొనసాగుతోంది. మార్చిలో షూటింగ్ ప్రారంభమవుతుందా అన్నది ఆసక్తికరం.

 

  • గందరగోళంలో చిరంజీవి – బాబీ చిత్రం
  • ముందుగా హీరోయిన్లతో సమస్య మొదలు
  • ముఖ్యపాత్ర కోసం ప్రముఖ నటుల దోబూచులాటలు
  • కూతురి పాత్రకు యువ హీరోయిన్ల వెనుకంజ
  • వెనక్కితగ్గిన నిర్మాత – సినిమా వేరే సంస్థ చేతుల్లోకి

విధాత వినోదం డెస్క్​ | హైదరాబాద్​:

MEGA 158 in Trouble | అట్టహాసంగా పూజలు జరుపుకుని లాంఛనంగా మొదలైన చిరంజీవి – బాబీ చిత్రానికి, షూటింగ్​కు వెళ్లాల్సిన సమయంలో సినిమా కష్టాలు మొదలయ్యాయి. హీరోయిన్​తో మొదలై, కూతురి పాత్ర దాకా నటీమణులు ఎవరూ ఖరారు కావడం లేదు.

కథానాయిక ఎంపికతో మొదలైన సమస్యలు

Anushka Shetty, Aishwarya Rai and Priyamani in discussion for heroine role in Mega158

ముందుగా హీరోయిన్​ విషయం తీసుకుంటే, మొట్టమొదటగా జేజమ్మ అనుష్కను నాయికగా తీసుకుంటున్నారని వార్తలు వెలువడ్డాయి. అభిమానులు కూడా ఆహా..ఓహో అనుకున్నారు. ఎంతకాలానికి మెగాస్టార్​ సరసన అనుష్కను చూడబోతున్నామని సంబరపడిపోయారు. ఇంతలో అనుష్క మాయమయింది. మధ్యలో మాళవికా మోహనన్​, రాశీఖన్నాఅన్నారు. తర్వాత ఏకంగా ఐశ్వర్యారాయ్​ను తీసుకున్నారని గుసగుసలు.. ఈసారి కూడా అబ్బో.. బాబీ బీభత్సంగా ప్లాన్​ చేస్తున్నాడనుకుంటే ఏమైందో ఏమో, అది కూడా వెనక్కివెళ్లింది. ప్రస్తుతం కథానాయికగా ప్రియమణి ఎంపికైందని తాజా వార్త. ఇది కొంచెం వర్కవుట్​ అయ్యేట్లుగానే ఉంది. ఎందుకంటే ప్రియమణి ఇప్పుడు కొంచెం మధ్యవయసు అమ్మగా సినిమాల్లోనూ, వెబ్​సిరీస్​ల్లోనూ నటిస్తోంది. అవన్నీ కూడా మంచి హిట్​ అయ్యాయి. ఈ సినిమాలో చిరంజీవి వయసు మళ్లిన పాత్రలోనే నటిస్తున్నాడు కాబట్టి, ప్రియమణికి పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు. అదీకాక, మెగాస్టార్​ చిరంజీవి పక్కన అంటే ఆ క్రేజ్​ వేరేగా ఉంటుందని తనకు బాగా తెలుసు. మిగతా ముగ్గురు (బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్​) టాప్​స్టార్లతో హీరోయిన్​గా నటించిన ప్రియమణికి చిరంజీవి సరసన అప్పట్లో అవకాశం రాలేదు. అది ఈ రూపంలో ఇప్పుడు లభించడంతో ఈ యమదొంగ హీరోయిన్​కు లక్కీఛాన్సే. అయితే ఈ నాయికావేట ఇక్కడితో ఆగుతుందా? లేదా అనేది వేచిచూడాలి.

చిరంజీవితో ఢీ అనే పాత్రకు సూపర్​స్టార్ల డేట్లతో ఇబ్బంది

Chiranjeevi, Mohanlal and Karthi casting buzz for key police officer role in Mega158

ఇక ఇంకో ముఖ్యమైన పాత్ర – చిరంజీవి పాత్రకు సరిసమానంగా ఉండే పోలీసాఫీసర్​ అంటున్నారు. దానికి ముందుగా మలయాళ సూపర్​స్టార్​ మోహన్​లాల్​ అని అన్నారు. బాగుంది..ఇద్దరు స్నేహితులు కలిసి నటిస్తే వేరే లెవెల్లో ఉంటుందని హైప్​ క్రియేట్​ అయింది. మళ్లీ లాల్​ స్థానంలో ఖైదీ కార్తీని తీసుకున్నారని ఓ న్యూస్​ బాగా వైరల్​ అయింది. ఇద్దరు ఖైదీల జంట తెరపై బాగా ఉంటుందని, పైగా కార్తీకి ఇంతకుముందే తెలుగు చిత్రంలో నటించిన అనుభవం అదికూడా కింగ్​ నాగార్జునతో ఉంది కాబట్టి, ఓకే అయిపోతుందన్న తరుణంలో కథ మళ్లీ మొదటికొచ్చింది.  కార్తీకి డేట్స్​ సమస్య వచ్చిందంటూ, మళ్లీ మోహన్​లాల్​ ఒప్పుకున్నాడంటూ విషయం తమిళనాడు నుండి కేరళకు వెళ్లిపోయింది. ఇప్పుడు కేరళలో ఉండాలా? బయలుదేరాలా అని బాబీ ఆలోచిస్తున్నాడట. ఇక్కడా డేట్స్​సమస్యే.  మోహన్​లాల్​కు దృశ్యం 3 డేట్స్​తో క్లాష్​ అవుతున్నాయని వార్త.

కూతురి పాత్రకు తటపటాయిస్తున్న యువ హీరోయిన్లు

Kriti Shetty, Sara Arjun and Preeti Mukundan considered for Chiranjeevi Mega158 daughter role

తదుపరి ఇంకా ఆసక్తికర పాత్రేంటంటే, చిరంజీవి కూతురి పాత్ర. ఈ పాత్రకు కథలో చాలా ఇంపార్టెన్స్​ ఉందనీ, పేరున్న యువనటి కావాలని అన్నారు. ముందుగా రేసులోకి వచ్చింది ‘ఉప్పెన’ భామ కృతిశెట్టి. ఈ మధ్య పెద్దగా కనిపించని కృతి, వెంటనే తెరపై నుండి మాయమైంది. ఆ తరువాత వచ్చిన అమ్మాయి సారా అర్జున్​. మణిరత్నం ‘పొన్నియన్​ సెల్వన్’​లో చిన్నప్పటి ఐశ్వర్యారాయ్​గా నటించి, ఆ తరువాత కథానాయికగా ‘ధురంధర్’​తో దుమ్ములేపింది. మరి మళ్లీ ఏం మారిందో, కొన్ని రోజులు ‘ఛాంపియన్’ ఫేం అనస్వర రాజన్​ పేరు వినిపించింది. ఇప్పుడు మంచు విష్టు ‘కన్నప్ప’లో నటించిన ప్రీతి ముకుందన్​ వార్తల్లో నిలిచింది.  ఈ అమ్మాయిలందరూ కూతురు పాత్రనేసరికి వెనుకాడుతున్నట్లు సమాచారం.

ఇలా ముఖ్య నటీనటులు ఫైనల్​ కాక ఓ పక్క దర్శకుడు ఇబ్బంది పడుతుంటే, పులి మీద పుట్రలా అసలుకే ఎసరొచ్చింది. అది నిర్మాణ సంస్థ తరపున.

నిర్మాణ సంస్థకు ఆర్థిక ఇబ్బందులు – చేతులు మారిన ప్రాజెక్ట్​?

KVN Productions and Vriddhi Cinemas Logos

ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్​ ప్రొడక్షన్స్​ ఈ చిత్ర నిర్మాణానికి పూనుకుంది. కె.వెంకట నారాయణ నిర్మాత. ఈ బ్యానర్​ ఒకేసారి పెద్ద పెద్ద చిత్రాలను నిర్మిస్తోంది. కన్నడంలో కేజీఎఫ్​ ఫేం యశ్​ హీరోగా, గీతూ మోహన్​దాస్​ దర్శకత్వంలో టాక్సిక్​, ప్రేమ్​ దర్శకుడిగా కేడీ: ది డెవిల్​, తమిళంలో దళపతి విజయ్​ హీరోగా తన ఆఖరి చిత్రం జననాయగన్​, తెలుగులో ఈ చిరంజీవి – బాబీ సినిమాను దాదాపుగా ఒకేసారి సెట్స్​పైకి వదిలింది. వీటిలో జననాయగన్​ షూటింగ్​ పూర్తి చేసుకోగా, టాక్సిక్​ పోస్ట్​ ప్రొడక్షన్​లోనూ, కేడీ అండర్​ ప్రొడక్షన్​లోనూ ఉన్నాయి. చిరంజీవి సినిమా మార్చిలో పట్టాలెక్కాల్సివుంది.

ఇంతలో జననాయగన్​ చిత్రం సెన్సార్​ బోర్డు – కోర్టు కేసుల్లో ఇరుక్కుని ఇంకా విడుదలకు నోచుకోకపోవడంతో ప్రీరిలీజ్​ బిజినెస్​ పూర్తయిన ప్రాంతాలనుండి బయ్యర్ల ఒత్తిడి మొదలైంది. దాంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్న సంస్థ, చిరు చిత్రం నుండి తప్పుకున్నట్టుగా విశ్వనీయ వర్గాల కథనం. తాజాగా రామ్​చరణ్​ పెద్ది సినిమాను నిర్మిస్తున్న వృద్ధి సినిమాస్(వెంకట సతీశ్​ కిలారు)​ ఈ చిత్రాన్ని టేకప్​ చేసినట్లుగా సమాచారం. సరే.. నిర్మాణ సంస్థలతో పెద్ద సమస్యేమీ ఉండదు. ఒకరు కాకపోతే ఇంకొకరు రెడీగా ఉంటారు. చిరంజీవి మార్కెట్​ అలాంటిది. పైగా నిన్ననే ‘మన శంకరవరప్రసాద్​గారు’ విజృంభించి 400 కోట్లు వసూలు చేసేసరికి ఆశలు ఆకాశంలో ఉన్నాయి.

మార్చిలో షూటింగ్​ ప్రారంభమని ప్రకటన – జరిగే పనేనా?

ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రం మార్చిలో షూటింగ్​ ప్రారంభమవుతుందా? లేదా అనేది మిలియన్​ డాలర్ల ప్రశ్న. దర్శకుడు బాబీ కొల్లి పవర్​ఫుల్​ గ్యాంగ్​స్టర్​ కథాంశంతో, చిరంజీవిని కొంచెం ఓల్డ్​ గెటప్​లో పాటలు లేకుండా, సీరియస్​ టోన్​లో చూపించాలనుకుంటే పరిస్థితులు తనకు పరీక్ష పెడుతున్నాయి. చూద్దాం.. ఈ సమస్యల నుండి బాబీ ఎలా గట్టెక్కుతాడో.. అయితే ఇదంతా అధికారిక సమాచారం కాదు కానీ, చిత్రబృందంతో దగ్గరగా మెసిలే వారినుంచి వచ్చినవే. కాబట్టి ఎంతో కొంత నిజముండకపోదు. ఏదైమైనా అధికార ప్రకటన కోసం మరింత కాలం వేచిచూడాల్సిందే.