Allu Arjun | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ రేంజ్‌కు చేరుకుంది. ‘పుష్ప’ సినిమాతో జాతీయ ఉత్తమ నటుడిగా గుర్తింపు పొందిన బన్నీ, తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ఒక భారీ మైలురాయిని చేరుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఆయన నిర్మిస్తున్న లగ్జరీ మేన్షన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
‘బ్లెసింగ్’ – బన్నీ డ్రీమ్ హౌస్
అల్లు అర్జున్ తన కొత్త ఇంటికి “బ్లెసింగ్” అనే ప్రత్యేకమైన పేరు పెట్టుకున్నారు. 2019 అక్టోబర్‌లో భూమి పూజతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్, ఇప్పుడు తుదిదశకు చేరుకుంది. ఆ సమయంలో ఆయన భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి చేసిన పూజ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. సుమారు 4 వేల చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ మేన్షన్, అత్యాధునిక సదుపాయాలు మరియు గ్లోబల్ స్టాండర్డ్ డిజైన్‌తో రూపుదిద్దుకుంటోంది.
ఈ ఇంటి నిర్మాణానికి దాదాపు రూ.100 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ప్రముఖ ఆర్కిటెక్ట్ అమీర్ శర్మ పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ మేన్షన్ వైట్ థీమ్‌తో మినిమలిస్ట్ స్టైల్‌లో ఉండబోతోంది. ఇందులో స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ లైబ్రరీ, మోడర్న్ ఆఫీస్ స్పేస్, పిల్లల కోసం ప్రత్యేక ప్లే ఏరియా వంటి అన్ని హైఎండ్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లో బన్నీ తన కుటుంబంతో కలిసి ఈ కొత్త ఇంటిలోకి గృహప్రవేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
చిరంజీవి ఇంటి పక్కనే..
ఈ మేన్షన్ మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇది మెగాస్టార్ చిరంజీవి నివాసానికి సమీపంలోనే ఉండటం. సినీ కుటుంబ అనుబంధాన్ని ప్రతిబింబించేలా ఈ లొకేషన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది. జూబ్లీహిల్స్‌లోనే అత్యంత విలాసవంతమైన ఇళ్లలో ఒకటిగా ‘బ్లెసింగ్’ నిలవనుందని అభిమానులు భావిస్తున్నారు.
ముంబై షిఫ్టింగ్‌పై క్లారిటీ
ఇటీవల అల్లు అర్జున్ ముంబైకి శాశ్వతంగా మారుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ ప్రచారంపై ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు. బన్నీ ముంబైకి షిఫ్ట్ కావడం లేదని, కేవలం సినిమా షూటింగ్స్ కోసం తాత్కాలికంగా అక్కడ ఉంటున్నారని తెలిపారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ కుమార్ దర్శకత్వంలో ‘రాకా’ అనే భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా ముంబైలో జరగనుండటంతో, ప్రయాణ సమయాన్ని ఆదా చేసేందుకు జుహులో సముద్రాన్ని ఎదురుగా చూసే లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను నెలకు రూ.16 లక్షల అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. అదనంగా, లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ కూడా లైన్‌లో ఉండటంతో ముంబైలో తాత్కాలిక నివాసం అవసరమైంది.
