Dhurandhar 2 | బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. గతేడాది సంచలనం సృష్టించిన ‘ధురంధర్’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్‌తో అదరగొట్టేసింది. రణవీర్ సింగ్ తన పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో మరోసారి ప్రేక్షకులను మెప్పించగా, ఆదిత్య ధర్ తన స్టైలిష్ మేకింగ్‌తో సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని సినీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లు, స్పై ఎలిమెంట్స్, దేశభక్తి భావాలను స్టైలిష్‌గా మిళితం చేసిన తీరు ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తోంది.
ఈ సినిమాపై దేశవ్యాప్తంగా స్టార్ హీరోల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని చూసి “Patriotism with Swag” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది. దీంతో ‘ధురంధర్ 2’పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే హిందీ వెర్షన్ బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతుండగా, తెలుగు ప్రేక్షకులకు మాత్రం గత రెండు రోజులుగా నిరాశే ఎదురైంది. సాంకేతిక సమస్యలు, సెన్సార్ బోర్డు చివరి నిమిషంలో సూచించిన మార్పులు కారణంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్ల విడుదల వాయిదా పడింది. డబ్బింగ్ పనుల్లో జాప్యం, డిజిటల్ ప్రింట్లు థియేటర్లకు అందకపోవడం వల్ల బుధవారం నాటి పెయిడ్ ప్రీమియర్లతో పాటు రెగ్యులర్ షోలు కూడా రద్దయ్యాయి.
ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకులకు థియేటర్ యాజమాన్యాలు రీఫండ్‌లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది అభిమానులు భాష తెలియకపోయినా కేవలం సినిమా క్రేజ్‌తో హిందీ వెర్షన్‌ను సబ్‌టైటిల్స్‌తో చూసేందుకు థియేటర్లకు వెళ్లడం కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ నిరీక్షణకు ఇప్పుడు ముగింపు పడింది. సినిమా యూనిట్ ఎదుర్కొన్న సాంకేతిక సమస్యలు, సెన్సార్ చిక్కులు పూర్తిగా తొలగిపోయాయి. శనివారం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘ధురంధర్ 2’ తెలుగు వెర్షన్ అధికారికంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇప్పటికే బుకింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో తెలుగు షోలు అందుబాటులోకి రావడంతో అభిమానులు భారీ ఎత్తున టిక్కెట్లు బుక్ చేస్తున్నారు. సొంత భాషలో సినిమా చూసే అవకాశం రావడంతో ఈ వీకెండ్‌లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హిందీ వెర్షన్‌కు ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ రావడం, ఇప్పుడు తెలుగు వెర్షన్ కూడా విడుదల కావడం వల్ల దక్షిణాదిలో బాక్సాఫీస్ లెక్కలు పూర్తిగా మారే అవకాశం ఉంది. మొత్తానికి ‘ధురంధర్ 2’ తన పవర్‌ఫుల్ రివెంజ్ డ్రామాతో సౌత్ ఇండియా థియేటర్లలో గర్జించడానికి సిద్ధమైంది.
