Jr NTR |యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత బిజీగా ఉన్నారు. ఒకప్పుడు వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొన్న తారక్, తన కెరీర్‌ను పూర్తిగా మార్చుకున్న తీరు ఇప్పుడు సినీ వర్గాల్లో ప్రత్యేక చర్చకు కారణమవుతోంది. ముఖ్యంగా ‘టెంపర్’ సినిమా తర్వాత ఆయన కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. ఆ సినిమా ఆయనకు కొత్త ఇమేజ్ తీసుకురావడమే కాకుండా వరుస విజయాలకు బాటలు వేసింది.
‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’, ‘జై లవ కుశ’, ‘అరవింద సమేత’, ‘RRR’ వంటి సినిమాలతో ఎన్టీఆర్ తన మార్కెట్‌ను భారీ స్థాయిలో పెంచుకున్నారు. ముఖ్యంగా ‘RRR’ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చుకున్న తారక్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఆ సినిమా తర్వాత ఆయన నుంచి వచ్చిన ‘దేవర’ మంచి అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన అందుకుంది.
ట్రెండింగ్‌లో తారక్ లుక్..
ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టి నటించిన ‘వార్ 2’పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా ఫలితం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందనే చర్చలు సోషల్ మీడియాలో వినిపించాయి. దీంతో ఇప్పుడు అభిమానుల దృష్టి పూర్తిగా ఆయన తదుపరి ప్రాజెక్టులపై పడింది.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. భారీ మాస్ అవతారంలో కనిపించిన తారక్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ సినిమాను మొదట 2022లో ప్రకటించగా, 2024లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తాజాగా విడుదలైన గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం ఈ చిత్రాన్ని 2027 జూన్ 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
తదుపరి ప్రాజెక్ట్స్ ఏంటి?
అయితే ‘డ్రాగన్’ తర్వాత ఎన్టీఆర్ ఎవరితో సినిమాలు చేస్తారనే అంశం ఇప్పుడు అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే అధికారికంగా ‘దేవర 2’ ప్రకటించినప్పటికీ, సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. ప్రాజెక్ట్ అధికారికంగా ఉన్నప్పటికీ షూటింగ్ మొదలయ్యే వరకు అభిమానుల్లో సందేహాలు కొనసాగుతున్నాయి.
మరోవైపు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎన్టీఆర్ సినిమా గురించి కూడా గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. నిర్మాత నాగవంశీ గతంలో ఈ ప్రాజెక్ట్ మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుందని పేర్కొన్నారు. ఇందులో సుబ్రహ్మణ్య స్వామి కథాంశం ఉంటుందని, ఎన్టీఆర్ ఆ పాత్రలో కనిపించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది.
వెట్రిమారన్‌తో కూడా..
ఇక తమిళ స్టార్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో కూడా ఎన్టీఆర్ సినిమా ఉండొచ్చనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కే అవకాశం ఉందని సమాచారం. అలాగే బాలీవుడ్‌లో ‘వార్ 2’ తర్వాత YRF స్పై యూనివర్స్‌లో ఎన్టీఆర్ సోలో హీరోగా సినిమా చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా గతంలో వినిపించాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్‌పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఇక గతంలో ఎన్టీఆర్ స్వయంగా దర్శకుడు వెట్రిమారన్‌తో సినిమా చేయాలనే ఆసక్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరి భవిష్యత్తులో ఆ కలయిక కూడా నిజమవుతుందా అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లలో ఏవి ముందుకు వస్తాయి, ఏవి కేవలం చర్చలుగానే మిగిలిపోతాయి అనే విషయంపై పూర్తి క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటనలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
