Dragon | యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’ ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు సృష్టించింది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్, మలయాళ నటుడు బిజూ మీనన్‌తో పాటు రుక్మిణి వసంత్, ఖుష్బూ సుందర్, రాజీవ్ కనకాల, అశుతోష్ రాణా, ప్రభాస్ శ్రీను, శత్రు, బెనెడిక్ట్ పాల్ గ్యారెట్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
గ్యాంగ్ వార్ నేపథ్యంలో..
సాంకేతిక విభాగంలో రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, భువన్ గౌడ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎడిటింగ్‌ను ప్రణవ్ శ్రీ ప్రసాద్ చేపట్టగా, యాక్షన్ సన్నివేశాలను పీటర్ హెయిన్స్ రూపొందిస్తున్నారు.
గ్లింప్స్ విషయానికి వస్తే.. ప్రశాంత్ నీల్ తనకు బాగా సెట్ అయ్యే మాఫియా, గ్యాంగ్ వార్ నేపథ్యాన్ని ఎంచుకొని, దానికి బ్రిటీష్ కాలం మరియు స్వాతంత్ర్య పోరాట అంశాలను జోడించినట్లు కనిపిస్తోంది. రుక్మిణి వసంత్ పాత్ర ద్వారా ప్రధాన పాత్రలను పరిచయం చేసిన విధానం ఆసక్తికరంగా అనిపించింది.
రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో..
ముఖ్యంగా ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చింది. గ్లింప్స్‌లో ఆయన పాత్రను పవర్‌ఫుల్‌గా చూపిస్తూ, యంగ్ టైగర్ నటనకు ఇది కేవలం చిన్న నమూనా మాత్రమే అనే భావనను కలిగించారు. ఎన్టీఆర్ మ్యాజిక్ పూర్తిస్థాయిలో కనిపించకపోయినా, ఆయన రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్ అభిమానులకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చేలా ఉంది.
ఇక బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఎంట్రీ కథలో బలమైన ప్రభావాన్ని చూపించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మరోసారి ఆకట్టుకున్నారు. హీరోయిన్ రుక్మిణి వసంత్ పాత్ర ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ, గ్లింప్స్‌లో ఆమెను పాత్రలను పరిచయం చేసే కోణంలో మాత్రమే చూపించడం వల్ల పాత్రలోని లోతు పూర్తిగా తెలియలేదు.
బ్యాంక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది…
ఎప్పటిలాగే ప్రశాంత్ నీల్ సినిమాల్లో ప్రధాన బలంగా నిలిచే సంగీతం, విజువల్స్ ఈ గ్లింప్స్‌లో కూడా హైలెట్ అయ్యాయి. రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ భారీగా ఆకట్టుకోగా, భువన్ గౌడ విజువల్స్ సినిమాకు గ్రాండ్ లుక్ తీసుకొచ్చాయి.
మొత్తంగా చూస్తే, ‘డ్రాగన్’ గ్లింప్స్ భారీ స్కేల్, మాస్ యాక్షన్, లార్జర్ ద్యాన్ లైఫ్ అనుభూతిని అందిస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచిందని చెప్పవచ్చు.
