Buchi Babu | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న బుచ్చిబాబు, మీడియాతో మాట్లాడుతూ తన తదుపరి ప్రాజెక్టులు, ముఖ్యంగా ఎన్టీఆర్‌తో సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గతంలో బుచ్చిబాబు సాన, ఎన్టీఆర్‌కు ఓ కథ వినిపించారని, ఆ ప్రాజెక్ట్ దాదాపు ఖరారైందని వార్తలు వచ్చాయి. అయితే అనుకోని కారణాలతో ఆ సినిమా ముందుకు సాగలేదని, అనంతరం బుచ్చిబాబు ‘పెద్ది’ చిత్రాన్ని ప్రారంభించారని సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. అంతేకాకుండా ఎన్టీఆర్ తిరస్కరించిన కథనే ఇప్పుడు రామ్ చరణ్‌తో ‘పెద్ది’గా తెరకెక్కించారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అవి రెండు వేరు…

ఈ ప్రచారాలపై తాజాగా స్పందించిన బుచ్చిబాబు సాన పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్‌కు చెప్పిన కథ, ‘పెద్ది’ కథ రెండూ పూర్తిగా వేర్వేరు కథలని స్పష్టం చేశారు. ఈ రెండు సినిమాల మధ్య ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ కోసం సిద్ధం చేసిన కథ ఇప్పటికీ తన దగ్గరే ఉందని, భవిష్యత్తులో ఆ కథతో సినిమా చేసే అవకాశం ఉందని వెల్లడించారు.

ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనే ఆసక్తి తనకు ఇప్పటికీ ఉందని బుచ్చిబాబు చెప్పారు. “ఎన్టీఆర్ సర్ పిలిస్తే వెంటనే వెళ్లి సినిమా చేస్తాను. ఆయనతో సినిమా చేయడం ఎప్పటికీ నాకు ప్రత్యేకమైన అవకాశమే. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందనేది ఆయన నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది” అని అన్నారు.

నాలుగు క‌థ‌లు సిద్ధం…

‘పెద్ది’ తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఇంకా ఖరారు చేయలేదని కూడా బుచ్చిబాబు తెలిపారు. అయితే తన వద్ద ఇప్పటికే నాలుగు మంచి కథలు సిద్ధంగా ఉన్నాయని, సరైన సమయంలో వాటిలో ఏదో ఒకదాన్ని ప్రకటిస్తానని చెప్పారు.

ఇదిలా ఉంటే, ‘పెద్ది’ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కించారు.

మొత్తానికి బుచ్చిబాబు చేసిన తాజా వ్యాఖ్యలతో ఎన్టీఆర్ అభిమానులకు మరోసారి ఆశలు చిగురించాయి. భవిష్యత్తులో ఈ దర్శకుడు-హీరో కాంబినేషన్‌లో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.