NTR | గ్లోబల్ స్టార్ జూనియ్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెండితెరపై తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న తారక్.. వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా సింపుల్‌గా ఉంటారు. సినిమాల షూటింగ్స్‌తో ఎప్పుడూ బిజీగా ఉండే ఆయన సోషల్ మీడియాలో మాత్రం చాలా అరుదుగానే కనిపిస్తారు. తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టడం కూడా చాలా తక్కువ. అయితే తాజాగా ఎన్టీఆర్ సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సాధారణంగా అభిమానులు తమ అభిమాన హీరోల గురించి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి సమయంలో ఎన్టీఆర్ తనలోని మరో కోణాన్ని అభిమానులకు పరిచయం చేశారు. నటుడిగానే కాకుండా మంచి వంటకారుడిగా కూడా పేరు తెచ్చుకున్న తారక్.. గతంలో బిర్యానీ, నాటుకోడి వంటి ప్రత్యేక వంటకాలు చేయడంలో తనకు మంచి నైపుణ్యం ఉందని పలుమార్లు వెల్లడించారు. అయితే ఈసారి మాత్రం పూర్తిగా భిన్నంగా కుకీస్ తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఎన్టీఆర్ చేసిన కుకీస్…
తాజాగా తారక్ తన ఇంట్లో స్వయంగా బేక్ చేసిన చాక్లెట్ చిప్ కుకీస్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. “My First Bake #BakedNotBought” అంటూ ఆయన చేసిన పోస్ట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఎప్పుడూ యాక్షన్, మాస్ సినిమాలతో కనిపించే ఎన్టీఆర్ ఇలా కిచెన్‌లో కుకీస్ తయారు చేయడం చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. కొద్ది సేపటికే ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ పోస్ట్ చూసిన సాయితేజ అనే అభిమాని ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. “అన్నా.. మా ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. మా కోసం రెండు కుకీలు పంపించవా?” అంటూ సరదాగా కామెంట్ చేశాడు. సాధారణంగా స్టార్ హీరోలు ఇలాంటి కామెంట్లను పట్టించుకోరు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఆ అభిమాని పోస్ట్‌కు తనదైన స్టైల్‌లో స్పందించారు.
అడ్రెస్ పెట్టు…
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం నటించిన ఓ పాపులర్ మీమ్‌లోని “అడ్రస్ పెట్టు.. ఫాస్ట్‌గా అడ్రస్ పెట్టు” అనే వీడియో క్లిప్‌ను రిప్లైగా షేర్ చేస్తూ అభిమానులను నవ్వుల్లో ముంచెత్తారు. తారక్ ఇచ్చిన ఈ ఫన్నీ రిప్లై క్షణాల్లో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఆయన కామెడీ టైమింగ్‌ను చూసి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అంతటితో ఆగకుండా ఎన్టీఆర్ ఆ అభిమానికి నిజంగానే కుకీస్ పంపించి మరింత పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సోషల్ మీడియాలో కూడా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అభిమానుల పట్ల తారక్ చూపించే ప్రేమ, ఆప్యాయత మరోసారి అందరికీ కనిపించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఫన్నీ రిప్లై…
ఇదిలా ఉండగా మరో అభిమాని “అన్నా.. బిర్యానీ, నాటుకోడి వండే నువ్వేంటి.. ఇలా కుకీస్ చేయడం ఏంటి?” అంటూ ప్రశ్నించాడు. దీనికి కూడా ఎన్టీఆర్ తన మార్క్ హ్యూమర్‌ను చూపించారు. తన బ్లాక్‌బస్టర్ చిత్రం బాద్షాలో బ్రహ్మానందం చెప్పిన పాపులర్ డైలాగ్ “మారాయి.. అన్నీ మారాయి” అనే వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ సరదాగా సమాధానం ఇచ్చారు. ఈ రిప్లై కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఒకవైపు భారీ సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు అభిమానులతో ఇలా సరదాగా మమేకమవడం ఎన్టీఆర్ ప్రత్యేకత అని ఫ్యాన్స్ చెబుతున్నారు. స్టార్‌డమ్ ఎంత పెరిగినా తన అభిమానులతో అనుబంధాన్ని కొనసాగించడం, వారిని ప్రత్యేకంగా ఫీలయ్యేలా చేయడం తారక్‌కు మాత్రమే సాధ్యమని సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
— Jr NTR (@tarak9999) June 5, 2026