Dragon | టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ నీల్ చేసిన వ్యాఖ్యలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.
తాజా ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోషిస్తున్న పాత్ర తన కెరీర్‌లోనే అత్యంత డార్క్, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని వెల్లడించారు. సరదాగా తమ మధ్య ఈ పాత్రను “ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన విలన్”గా పిలుచుకుంటూ ఉంటామని చెప్పారు. అంత పెద్ద స్టార్ అయిన ఎన్టీఆర్ ఇలాంటి ప్రయోగాత్మక పాత్రను చేయడానికి అంగీకరించడం చాలా గొప్ప విషయమని ఆయన ప్రశంసించారు.
పిస్టల్ మోడ్ నుండి తీసుకున్నాం..
ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను “లూగర్ – ది అసస్సిన్ ఇన్ చీఫ్”గా పరిచయం చేసిన విషయం వెనుక కూడా స్పష్టమైన కారణం ఉందని నీల్ తెలిపారు. ప్రేక్షకులను తప్పుదోవ పట్టించకుండా ముందుగానే పాత్ర స్వభావాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ పేరు పెట్టినట్లు చెప్పారు. “లూగర్” అనే పేరు ఒక ప్రత్యేకమైన పిస్టల్ మోడల్ నుంచి తీసుకున్నామని, దానికి కథలో కీలకమైన ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు.
అలాగే ఈ పాత్ర రూపకల్పన కోసం తాను దాదాపు మూడు సంవత్సరాలు పని చేసినట్లు చెప్పారు. ముందుగా సినిమా ముగింపును ఫిక్స్ చేసి, ఆ తర్వాత హీరో పాత్రను దానికి తగ్గట్టుగా డిజైన్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్నానని పేర్కొన్నారు.
బ్రిటీష్ పాలన తర్వాతి కాలంలో..
తన గత చిత్రాలైన కేజీఎఫ్లో: చాప్టర్ 1లో రాకీ, సలార్ పార్ట్ 1లో దేవా పాత్రల తరహాలో డ్రాగన్లోని లూగర్ పాత్ర కూడా గ్రే షేడ్స్ కలిగి ఉంటుందని తెలిపారు. అయితే ఇదే తన గ్రే-షేడ్ పాత్రల ట్రయాలజీలో చివరి చిత్రం అని అధికారికంగా ప్రకటించారు.
కథ నేపథ్యం గురించి మాట్లాడిన ప్రశాంత్ నీల్.. ఈ సినిమా బ్రిటీష్ పాలన తర్వాతి కాలంలో జరిగే సంఘటనల ఆధారంగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా ఓపియం, హెరాయిన్ డ్రగ్స్ వ్యాపారం, ముంబై, కోల్‌కతా వంటి నగరాల నేపథ్యంలో డిస్టోపియన్ వాతావరణంలో కథ సాగుతుందని చెప్పారు.
ఇక ఎన్టీఆర్ నటన గురించి కూడా ప్రశాంత్ నీల్ ప్రత్యేకంగా మాట్లాడారు. కథ, ఎమోషన్స్‌పై తారక్‌కు అసాధారణమైన అవగాహన ఉందని పేర్కొన్నారు. పాత్రలో పరిపూర్ణత కోసం ఆయన ఎంతో అంకితభావంతో పని చేశారని చెప్పారు. అలాగే సినిమాలో హీరో పాత్ర మాత్రమే కాకుండా ఇతర పాత్రలకు కూడా బలమైన నేపథ్యం ఉంటుందని వెల్లడించారు.
అయితే ఇంటర్వ్యూలో చివర్లో ప్రశాంత్ నీల్ మరో ఆసక్తికరమైన విషయం చెప్పారు. డ్రాగన్‌ని కేవలం డార్క్ గ్యాంగ్‌స్టర్ కథగా భావించడం పొరపాటు అని అన్నారు. పైకి నెగెటివ్ షేడ్స్, డ్రగ్స్ మాఫియా, హంతకుడి కథలా కనిపించినా.. చివరికి ఇది ప్రేక్షకులకు ఒక గొప్ప దేశభక్తి అనుభూతిని అందించే చిత్రంగా నిలుస్తుందని వెల్లడించారు. ప్రశాంత్ నీల్ స్టైల్ యాక్షన్, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, దానికి తోడు దేశభక్తి అంశం జతకావడంతో డ్రాగన్‌పై అంచనాలు ఇప్పుడు మరింత పెరిగాయి.
